దూరదృష్టి గల సంస్కర్త …..అంబేడ్కర్

“ఆధునిక ప్రపంచ చరిత్రలో మహిళల హక్కులకోసం కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి మహిళా పక్షపాతిగా అంబేడ్కర్ చరిత్రలో నిలిచిపోయారు అటువంటిది జనాభాలో 50శాతం ఉండే మహిళలను ఆకాశంలో సగం అంటున్నాం.అయితే ఇది కేవలం అంతాలకే పరిమితం అవుతుంది. ఆకాశంలో సగం అంటున్నామే కానీ,ఆ స్థాయిలో అవకాశాలను, అధికారాలను ఇవ్వడంలేదు, బీసీ ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఉత్సాహం కనబరుస్తున్న ఓబీసీ మహిళల వాటా తేల్చే ఆరాటం కన్పించడం లేదు..”

ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్ – 9866255355

విద్య లేక పోతే  వివేకం లేదు, వివేకం లేక పొతే నీతి లేదు, నీతి లేక పోతే దేశ పురోగతి లేదు అన్న భారతదేశపు గొప్ప దార్శనికులలో ఒకరైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 136వ జయంతి ఈ రోజు. ఆయన వారసత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి ఒక వర్గం ఉద్దేశపూర్వకంగా అవాంఛనీయ ప్రయత్నాలెన్నో చేసింది. అంబేద్కర్ అందరివాడు అనే సోయి లేకుండా శతాబ్దం గడచిన తర్వాత కూడా, అంబేడ్కర్ అంటే కేవలం ఒక దళిత నాయకుడిగా పరిగణించడం జరుగుతుంది. ఆయనను దళితులు, అణ గారిన వర్గాల ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఎవరు అవునన్న కాదన్న ఆధునిక భారత దేశపు అగ్రశ్రేణి మేధావుల్లో ఒకరుగా నిలిచారు.

బాబా సాహెబ్ అంబేడ్కర్ ఎన్నో అవమానాలకు గురైనారు. ఒకసారి మండు వేసవిలో దాహం తట్టుకోలేక దగ్గర్లో ఉన్న నీళ్ల కుండిలోని నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తే… కట్టుబాట్లు ఉల్లంఘించారనే కారణంతో ఆయన మీద వివక్షకు తెగబడ్డారు. ఇటువంటి సంఘటన ఎవరికీ జరిగిన ఇతరులైతే తమ రాత ఇంతే అని సరిపెట్టుకుని ఉండేవారు. మరి కొందరైతే కక్షతో రగిలి హింసా మార్గాన్ని ఎంచుకుని ఉండేవారు. కానీ, ఆయన అలా చేయలేదు.తనలోని బాధను గుండెల్లోనే నింపుకొని సమాజాన్ని చదవడం నేర్చుకున్నారు. ఏ పాఠశాలల్లో అయితే తనను చదువుకోవడానికి అనుమతించలేదో… అంతకు మించిన స్థాయిలో విదేశాల్లో విద్యను పూర్తి చేసి తానేమిటో నిరూపించుకున్నారు . అయినా తన మాతృభూమి, కర్మభూమి అయిన భారతదేశానికి తిరిగి వచ్చే విషయంలో స్పష్టమైన ఆలోచనతో ఉండేవారు. దేశ భవిష్యత్ తోడ్పాటు గల వ్యవస్థల నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర విస్మరించలేనిది.

అంబేడ్కర్ రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ గా మాత్రమే గాక, దృఢమైన ప్రజాస్వామ్యవాది. కష్టపడి సంపాదించిన స్వాతంత్య్రం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. రాజ్యాంగ సభలో ఆయన చివరి ప్రసంగంలో ఈ భయాందోళనలు సుస్పష్టంగా వ్యక్తమయ్యాయి. రాజ్యాంగంలో ప్రజాస్వామిక ఆత్మను ఆయన చాలా జాగ్రత్తగా అమర్చారు.ఆయన హెచ్చరికలే భారతదేశాన్ని దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ప్రజాస్వామ్య మార్గంలో నడిపిస్తున్నాయి. మనువాదులకు ప్రజాస్వామ్యం అంటే పడదు ..అంబేద్కర్ కు మనుస్మృతి అంటే పడదు. అయితే నేడు కులం, మతం, జాతి, భాష మొదలైన సామాజిక విభేదాలతో భారతీ యుల మధ్య సోదరభావాన్ని తగ్గించే ప్రయత్నాలను  చూస్తున్నాం. పైగా యజుర్వేద, అధర్వణ వేదాల్లోని రుషులు శూద్రులకు తగిన ప్రాధాన్యమిచ్చిన అనేక సందర్భాలను ఉదాహరించారు.

తమ సంకుచిత, మతపరమైన ప్రయోజనాల కోసం భాషా సమస్యలను సాకుగా చూపించేవారు దేశ ఐక్యత విషయంలో అంబేడ్కర్ అభిప్రాయాలను తెలుసుకుంటే ఎంతో ప్రయోజనందుతారు.తాను ప్రావీణ్యం సంపాదించిన తొమ్మిది భాషలలో ఒకటైన సంస్కృతాన్ని అధికారిక భాషగా ఆమోదించడానికి మద్దతుగా 1949 సెప్టెంబరు 10న ఆయన రాజ్యాంగ సభలో ఒక సవరణను ప్రవేశ పెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై తన ఆలోచనలు వెల్లడిస్తూ… “హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి’ అని ప్రకటించారు.హిందీ మాట్లాడే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాక పోయినప్పటికీ, దేశ ప్రాధాన్యాలకు ప్రథమ స్థానమిచ్చా రన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేశంలో ప్రజాస్వామిక పాలన విఫలం అయితే ప్రజలు సాయుధులై తిరుగపడతారని రాజ్యాంగ సభలోనే చాల స్పష్టంగా చెప్పాడు.మనుస్మృతిని పునరుద్దరించాలనుకునే వారు ఉద్దేశ్యపూర్వకంగానే ప్రణాళికాబద్ధంగానే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే అవకాశం ఉంది.

మూడేళ్లు కష్టపడి ఒక గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రూపొందించినా రాజకీయ రంగంలో సమానత్వాన్ని సాధించినంత మాత్రాన సరిపోదనిగ్రహించి  ‘ప్రజాస్వామ్యం విజయవంతంగా సాగడానికి అనుసరించా ల్సిన పద్ధతులపై 1952 డిసెంబర్ 22న ఒక ప్రసంగమిస్తూ…ప్రజా స్వామ్యం రూపం, ఉద్దేశం కాలక్రమేణా మారుతాయనీ, ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే ఆధునిక ప్రజాస్వామ్యపు లక్ష్యమనీ పేర్కొ న్నారు. ఈ దార్శనికతతోనే అన్ని ప్రభుత్వాలు పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో విజయం సాధించాక పోయినా నటించే ప్రయత్నం అడుగడుగునా కన్పిస్తుంది. ఆయన్ని ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడిగా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి.

‘వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని సాధించాలంటే బాబా సాహెబ్ ఊహించిన భారతదేశాన్ని సాకారం చేయడానికి మరింత కష్టించి పనిచేయాలన్న ప్రభుత్వాల నిబద్ధతను పునరుద్ఘాటించారు. అయితే ఏడాదికి ఒక్కసారి అంబేడ్కర్ ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంటామంటూ ప్రతిజ్ఞ చేసే అవకాశాన్ని ఆయన జయంతి కల్పిస్తోంది. జాతి, మత, ప్రాంత, కులాలకు అతీతంగా మనమంతా ‘భారతీయులు’గా సాగిపోదాం.అంటూ కడుపులో కత్తులు పెట్టుకొని శపధం చేసే రాజకీయాలు చూస్తున్నాం. ఒక సందర్భంలో సైమన్ కమిషన్ ఆధారాల గురించి అడిగితే… ప్రాంతీయ దురభిమానమూ, సమూహ భావనలకూ లోనయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తూ, “మనమె ప్పుడూ భారతీయులమే అన్న చేతన్యాన్ని ప్రజల్లో కలిగించడం అత్యావశ్యమని చెప్పడం మూలానా సమాజం నిత్య చైతన్యంతో విరజిల్లుతుంది

ఆధునిక భారతదేశంలో ఆర్బీఐ, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి అనేక సంస్థలు బాబాసాహెబ్ దూరదృష్టితో పురుడు పోసుకున్నవే. ఆర్థికశాస్త్రం, ఆర్థిక చరిత్రపై తన ప్రావీణ్యంతో భారత్ ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను ఆధారాలతో సహా ‘రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్’కు విశ్లేషణాత్మకంగా వివరించడంలో సఫలీకృతులైనారు. ఫలితంగా ఒక సెంట్రల్ బ్యాంక్ గా  విధులను నిర్వర్తించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు పునాది పడింది.ఆధునిక ప్రపంచ చరిత్రలో మహిళల హక్కులకోసం కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి మహిళా పక్షపాతిగా అంబేడ్కర్ చరిత్రలో నిలిచిపోయారు అటువంటిది జనాభాలో 50శాతం ఉండే మహిళలను ఆకాశంలో సగం అంటున్నాం.

అయితే ఇది కేవలం అంతాలకే పరిమితం అవుతుంది. ఆకాశంలో సగం అంటున్నామే కానీ,ఆ స్థాయిలో అవకాశాలను,  అధికారాలను ఇవ్వడంలేదు, బీసీ ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఉత్సాహం కనబరుస్తున్న ఓబీసీ మహిళల వాటా తేల్చే ఆరాటం కన్పించడం లేదు. అదే జరిగితే పొయ్యిమీద ఉన్న మహిళా  రిజర్వేషన్లు పొయ్యిలో పడే ప్రమాదం ఉంది. బాబాసాహెబ్ భారతదేశానికి దేవుడు ఇచ్చిన వరం ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి,ఈ దేశ అణగారిన బిడ్డలను సామాజిక,సాంస్కృతిక దాస్య శృంఖలాల నుంచి విముక్త చేసేందుకు తన జీవితాన్ని ధారపోసిన మహానీయులను స్మరించుకోవడం యావత్ జగత్ అందించే పుష్పాంజలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *