అధికార పార్టీకి అగ్నిపరీక్ష

“బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏదయినా కారణంచేత ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం దొరుకుందేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవకపోతే త్వరలో జరుగనున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఓటమిని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం మరింత పెరగడం, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడడమే కాకుండా ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలు కూడా కొట్టిపారేయలేము. సాధారణంగా ఎక్కడయినా, ఉపఎన్నిక ఏదయినా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రజలు 6 గ్యారంటీల పేరుతొ తమను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ప్రతీకారం తీర్చుకోడానికి ఎదురు చూస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి దారులన్నీ మూసుకుపోయినట్టే చెప్పుకోవాలి.”

-ఇప్ప పృథ్వి రెడ్డి
(బీఆర్ఎస్ జనగామ జిల్లా నాయకుడు)

ఈ నెల 11న జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 2024 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన మాగంటి గోపినాథ్ అకాల మరణం తో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధానంగా ఈ పోటీ నెలకొంది. తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీల పేరుతొ అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ఫలితం నిజంగా అగ్నిపరీక్షే! కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న మాదిరిగా చెప్పుకోవడానికి ఏమీ లేక గత ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలనే నిందిస్తూ కాలం వెళ్లదీస్తుంది. బీఆర్ఎస్ 9 సంవత్సరాల పాలన చుసిన ప్రజలేమో ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసి వీళ్ళను గెలిపించి తప్పు చేశాం అనే నిర్దారణకు సంవత్సరం క్రితమే వచ్చేశారు. తెలంగాణ ప్రజలు ఇంత తక్కువ సమయంలో ఇటువంటి నిర్దారణకు రావడానికి అనేక కారణాలు దోహదపడ్డాయి.

2024 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్ ప్రాంతంలో ఉండే ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మక ఆరు గ్యారంటీల ఉచ్చులో పడలేదు కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆ ఉచ్చులో చిక్కుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి ప్రజల ఆలోచన విధానం సరైందని ఎత్తిపట్టినట్టుగానే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప చెప్పుకోవడానికి పెద్దగా చేసిందేమీ లేదనే చెప్పాలి. ఈ ప్రాంత ప్రజలు ఇంత బలంగా బీఆర్ఎస్ పట్ల విశ్వాసం, కాంగ్రెస్ పట్ల అవిశ్వాసం ప్రదర్శించడానికి బలమయిన కారణాలు ఉన్నాయి. చరిత్రలో ఎప్పటినుండో హైదరాబాదు విశిష్టత గొప్పదయినప్పటికీ ఈ కాలానికి తగ్గట్టుగా మహానగరాన్ని తీర్చిదిద్ది వర్తమానంలో హైదరాబాదు స్థానాన్ని సుస్థిరపరచడం కేసీఆర్ వల్లే సాధ్యమయింది. హైదరాబాద్ సహా పొలిమేరలో ఉన్న ప్రజలు 2012-13 దాకా ఎదుర్కున్న తాగునీటి సమస్య ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక 6-7 సంవత్సరాల వెనక్కి ఆలోచిస్తే ఇక్కడి రోడ్లు, భవనాల పరిస్థితి కూడా ఎట్లా ఉండేదో మన కళ్ళ ముందే కనిపిస్తుంది.

2014 కు ముందు వరకు హైదరాబాద్ నగరంలో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 51,000 కాగా 2014 తరువాత నుండి 2024 వరకు ఏర్పడ్డ కంపెనీలు దాదాపు 57,000. అంటే హైదరాబాద్ నగర అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో ఎట్లా పరిగెత్తిందో అర్థం అవుతుంది. నగరంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సాఫ్ట్ వేర్ రంగం చూస్తే 2014 కు ముందు దాదాపు 700 కంపెనీలు 3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుండగా 2014 నుండి 2023 వరకు 9 సంవత్సరాల్లోనే 700 కొత్త కంపెనీలు ఏర్పడి 9 లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిందంటే కేసిఆర్ పరిపాలన దక్షత వల్లే సాధ్యమైందని చెప్పాలి. ఫార్మా, వస్తు సేవలు, మ్యానుఫ్యాక్చరింగ్, భవన నిర్మాణ రంగం, విద్య, వైద్యం, రవాణా, హోటల్ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలబడడానికి బీఆర్ఎస్ పరిపాలనే ప్రధాన కారణం. ప్రజలు ఈ అభివృద్ధిని తమ కళ్లారా చూసారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీని అర్బన్ ప్రాంత ప్రజలు ఆదరించారు.

మరొక గమ్మత్తయిన విషయం ఏంటంటే తెలంగాణోద్యమ సమయంలో ఉద్యమాన్ని, అప్పటి తెరాస పార్టీని పూర్తిగా వ్యతిరేకించిన, హైదరాబాదులో ఎక్కువ సంఖ్యలో ఉండే “ఆంద్రోళ్ళు” (జూబ్లీహిల్స్ లో ఆంధ్ర ప్రజల వోట్లు దాదాపు 40 వేలు) నేడు కేసిఆర్, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అభిమానులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర ప్రజల పైన దాడులు చేస్తారని, వ్యాపారాలు జరుపుకోనివ్వరని, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ఆంధ్ర రాజకీయ నాయకులు చేసిన ప్రచారానికి, రాష్ట్రం ఏర్పడ్డ తరువాత వాస్తవ పరిస్థితులు చూసి కేసీఆర్ పాలనలో భద్రతగా ఉన్నారని భావించి వారు అర్థం చేసుకున్నారు కనుకే వారు ఉద్యమ పార్టీకి అండగా నిలిచారు. ఈ అర్బన్ వోటర్లు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అత్యంత ప్రభావితం చేయనున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితాన్ని ప్రభావితం చేయగల మరొక ప్రధాన వర్గం ముస్లిం మైనారిటీలు.

ముస్లిం మైనారిటీ ప్రజలు అంతకు ముందెన్నడూ లేనంత అధిక సంఖ్యలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందారు. ముఖ్యంగా “షాదీ ముభారక్”, స్వయం ఉపాధి కల్పన కోసం లక్ష రూపాయలు, మైనారిటీల కోసం రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలు, విద్యార్ధులకు స్కాలర్షిప్పులు, తదితర అనేక కార్యక్రమాలు చేపట్టి ముస్లిం మైనారిటీల మనసులను కూడా గెలిచిన ఘనత కేవలం కేసిఆర్ కు మాత్రమే దక్కింది. సాంప్రదాయంగా ఎంఐఎం వైపు ఉండే ముస్లిం ప్రజలందరూ బీఆర్ఎస్ ను ప్రత్యామ్నాయ పార్టీగా చూడడం మొదలుపెట్టడంతో అసద్ సోదరులకు భయం పట్టుకుని బీఆర్ఎస్ పార్టీతో స్నేహం చేయక తప్పని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. ఎంఐఎం ఎటు చెప్తే అటు వోటు వేసే రోజులు కనుమరుగయిపోవడమే కాదు, ఎంఐఎం పార్టీ చేస్తున్న అవకాశవాద రాజకీయాలు కూడా మాట్లాడుకునే చైతన్యంలోకి ముస్లిం ప్రజలు రావడం గొప్ప విషయం. ఎంఐఎం తన అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దత్తు ఇస్తున్నప్పటికే వోట్లు వేసే అవకాశం లేదని గ్రౌండ్ రియాలిటీ ద్వారా తెలుస్తుంది. దీన్ని అధిగమించడం కోసమే ఉన్నపపళంగా అజాహరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారనేది స్పష్టంగా తెలుస్తుంది.

ఇక పొతే ఈ ఎన్నికను ప్రభావితం చేయనున్న మరి కొన్ని ముఖ్య వర్గాలు సినీ కార్మికులు, ఎలైట్ పీపుల్, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు. ఈ వర్గాల్లో వేటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదని ఆయా వర్గాల వారే మాట్లాడుకోవడం విశేషం. పైగా హైడ్రా పేరుతొ నగరంలో కూల్చివేతలు సాగించడం, ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం, రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆకాశం నుండి పాతాళానికి తీసుకురావడం తప్ప చేసిందేమీ లేదనే అభిప్రాయం హైదరాబాద్ ప్రజల్లో నాటుకుపోయింది. 6 గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలం చెందడం, పైన చెప్పుకున్న కారణాల వల్ల ప్రజల్లో ఏర్పడ్డ తీవ్ర వ్యతిరేకత వల్లే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల సాకుతో మరో సాకుతో ఇప్పటివరకు ఎన్నికలు జరగకుండా ఆపగలిగాడు కానీ ఇంకా ఆపలేని పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చి పడింది.

అందుకే ఈ ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కన్నా అత్యవసరం. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏదయినా కారణంచేత ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం దొరుకుందేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవకపోతే త్వరలో జరుగనున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఓటమిని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం మరింత పెరగడం, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడడమే కాకుండా ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలు కూడా కొట్టిపారేయలేము. సాధారణంగా ఎక్కడయినా, ఉపఎన్నిక ఏదయినా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రజలు 6 గ్యారంటీల పేరుతొ తమను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ప్రతీకారం తీర్చుకోడానికి ఎదురు చూస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి దారులన్నీ మూసుకుపోయినట్టే చెప్పుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *