ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

– గాంధీ భవన్‌లో ‘ప్రజలతో ముఖాముఖి’
– ప్రతి వినతిపై బాధ్యతగా స్పందించి న్యాయం చేస్తాం
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ప్రజల విశ్వాసమే మా బలం.. ప్రజల మాటే ప్రభుత్వ నిర్ణయాలకు మార్గదర్శకం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని, పాలకులు ప్రజలకు దూరంగా ఉండటంతో అనేక సమస్యలు పేరుకుపోయాయని విమర్శించారు. ప్రజల కష్టాలు, బాధలు, ఆశలు, ఆకాంక్షలు తెలుసుకోవాలంటే ప్రజల మధ్యకే వెళ్లాలన, అందుకే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రతి వారం నిర్వహిస్తోందని తెలిపారు. గాంధీ భవన్‌లో ముఖాముఖి కార్యక్రమం బుధవారం జరగగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి సీతక్క నేరుగా వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. వచ్చిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని, పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలు వినడమే కాక వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రజా పాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రధానంగా వచ్చిన వినతులు

ధరణి అమలులో జరిగిన అక్రమాల కారణంగా తమ భూములు ఇతరులు ఆక్రమించుకున్నారని, రాత్రికి రాత్రే పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులు జరిగాయని పలువురు బాధితులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు రాని అర్హులైన కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచాలని యువత విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షలతో నమోదు చేసిన పోలీసు కేసులను ఎత్తివేయాలని పలువురు వినతిపత్రాలు సమర్పించారు. అటవీ శాఖ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ హక్కులను పరిరక్షించాలని కోరుతూ పలువురు గిరిజనులు, అటవీ ప్రాంతాల ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాయానికి గురైన వివిధ వర్గాలకు న్యాయం చేయాలని పెద్ద సంఖ్యలో ప్రజలు కోరారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లుగా గత ప్రభుత్వం వదిలివెళ్లిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోందని తెలిపారు. ప్రజలు ప్రజా ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసంతోనే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి తమ వినతులను అందజేస్తున్నారని చెప్పారు. ప్రతి వినతిని బాధ్యతగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *