హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం(ఏసీడబ్ల్యూజీ) రెండో సమావేశానికీ, ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్వర్క్ రెండో సమావేశానికీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) ఆతిథ్యమివ్వనుంది. బ్రిక్స్-2026కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈనెల 4, 5 తేదీల్లో హైదరాబాద్లో ఈ సమావేశాలు జరుగుతాయి. బ్రిక్స్ ఇతివృత్తమైన ‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం స్ఫూర్తిగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా ప్రారంభిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులతోపాటు సీనియర్ విధాన రూపకర్తలు, నిపుణులు, ప్రాక్టీషనర్లు, అవినీతి నిరోధక, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. జూన్ 2,3 తేదీల్లో వర్చువల్గా జరిగిన బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం మొదటి సమావేశం ఫలితాల ఆధారంగా హైదరాబాద్ సమావేశం జరుగుతోంది. ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిని ఎదుర్కోవడం, పాలనలో పారదర్శకతనూ, జవాబుదారీతనాన్నీ పెంపొందించడంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ సభ్యదేశాలు చర్చిస్తాయి. దిగువ పేర్కొన్న అంశాల ద్వారా ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తాయి. అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీని గుర్తించేందుకు, అప్పగింత ప్రక్రియలకు మద్దతు ఇవ్వడానికి అనధికారిక సహకారాన్ని బలోపేతం చేయడం.. ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్వర్క్ ద్వారా సమాచారాన్ని పంచుకోవడం.. కార్యాచరణ సహకారాన్ని విస్తరించడం.. ఫిన్టెక్, డిజిటల్ ఆస్తులు, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక సాధనాల నుంచి ఉత్పన్నమయ్యే అవినీతి సంబంధిత ప్రమాదాలను నివారించడంలో, ఎదుర్కోవడంలో అనుభవాలనూ, ఉత్తమ పద్ధతులనూ పంచుకోవడం. ఆవిష్కరణ, సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన అనే అంశంపై ఈనెల 5న ప్రత్యేక అనుబంధ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. డిజిటల్ ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవస్థ, పౌర భాగస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం, పరిపాలనలో నిజాయతీని బలోపేతం చేయడానికి ఆవిష్కరణాత్మక విధానాలతో సాంకేతిక ఆధారిత పరిపాలనపై తమ అనుభవాలను పంచుకోవడానికి బ్రిక్స్ సభ్యులకు వేదికగా ఈ అనుబంధ కార్యక్రమం నిలుస్తుంది. చర్చలు, అనుభవాలను పంచుకోవడం, సహకార కార్యక్రమాల ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య ఆచరణాత్మక సహకారాన్ని ప్రోత్సహించాలనే భారత్ చిత్తశుద్ధిని హైదరాబాద్ సమావేశం తెలియజేస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





