భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులను ఇరుకున పెట్టే రాజకీయ వ్యూహం అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిందారోపణల పై కేంద్ర విచారణ సంస్థ సీబీఐ కి అప్పగిస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది కలిగించే అంశం..! కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో సీబీఐ పై తీవ్రాతి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..! రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లోపాల పై సీబీఐ విచారణ కోరడం పై పార్టీ అధిష్టానానికి సహేతుకమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
శని,ఆదివారాల్లో జరిగిన తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకల ఆరోపణల పై జస్టిస్ పి సి గోష్ నివేదిక పై సుదీర్గ చర్చ జరిగింది. 650 పేజీల పైగా ఉన్న నివేదిక పై స్వల్ప కాలిక చర్చ జరిపి అర్ధరాత్రి..ప్రతిపక్ష పార్టీలు బీ ఆర్ ఎస్,బీజేపీ ల సమావేశాల బహిష్కరణ ల మధ్య కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లోపాల పై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు అది చేపట్టిన అప్పటి అధికార భారత రాష్ట్ర సమితి పై పలు ప్రజా సంఘాలు ..ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ..ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. 2023 లో బిఆర్ఎస్ ఎన్నికలలో పరాజయం పాలై ..కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లోపాల పై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్‌తో విచారణ జరిపించింది. విచారణ జరుగుతున్నంతకాలం కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాజెక్టుకు సంబందించి నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చివరకు జస్టీస్ ఘోష్ జూలై 31న విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినప్పటి నుండి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అరెస్టు తప్పదన్న వార్తలు విస్తృతమైనాయి. అయితే నివేదిక అందిన సరిగ్గా ఒక నెలకు అంటే ఆగస్ట్ 30న రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రెండో రోజు సమావేశంలో సాయంత్రం ఈ నివేదికపై అన్ని పార్టీలు చర్చించే విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
దాదాపు తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగించనున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయంటూ ఇంతకాలం ఆరోపిస్తూ వొస్తున్న బిజెపిని ముగ్గులోకి దింపినట్లు అయింది. కాళేశ్వరంతోపాటు మరికొన్ని ఆరోపణలను ఎదుర్కుంటున్న బిఆర్ఎస్పై చర్యలు తీసుకోకుండా విచారణలపేరున కాపాడుతూ వొస్తున్నదంటూ బిజెపి చాలాకాలంగా కాంగ్రెస్‌పైన విరుచుకుపడుతున్నది. గతంలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై కాంగ్రెస్ సిట్ వేసింది. కాని ఇంతవరకు ఆచరణ దాల్చలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్లా తయారవడానికి ఈ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా అవగాహన ఉందంటూ బిజెపి నాయకత్వం ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు చెక్ పెట్టే విధంగా కాళేశ్వరం కేసును కాంగ్రెస్ వ్యూహాత్మకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసు కేంద్రానికి సంబంధించిన సంస్థలు, అంతరాష్ట్ర అంశాలతో ముడివడి ఉందని, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, వ్యాప్కోస్ లాంటి సంస్థల ప్రమేయం ఉండడంవల్ల కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడమే సరైందిగా భావిస్తున్నట్లు ఆదివారం ఆర్థరాత్రి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్టు అయింది. గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికలైనప్పటినుండి బిఆర్ఎస్ పరిస్థితి ఏ మంత బాగులేదన్నది వాస్తవం . భవిష్యత్‌లో ఆ పార్టీ ఎలా నిలదొక్కుకుంటుందన్నది చర్చనీయాంశమైంది. అయితే ఆ పార్టీ అధినాయకత్వం బీజేపీ వైపు చూస్తున్నదన్న వదంతులు వినవస్తున్నాయి.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ఆ ఎన్నికలను దాదాపు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్ నాయి. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడం ఒంటరిగా బిజెపి వల్ల సాధ్యం కాదు. అలాగే కేసుల కారణంగా బిఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోతున్నది. అందుకు ఈ రెండు పార్టీలు ఏకమయ్యే అవకాశాలు లేకపోలేదంటూ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. అందుకు బిఆర్ఎస్, బిజెపిలు ఒకటేనని చాలాకాలంగా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కూడా ఒక కారణం. సీబీఐ విచారణలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఆ రెండు పార్టీలు ఒకటి కావడంవల్లే విచారణను అటు కెక్కిస్తున్నారంటూ కాంగ్రెస్‌కు దుమ్మెత్తిపోసే అవకాశం ఏర్పడుతుంది.
ఇంతకాలంగా బిఆర్ఎస్ నాయకత్వంపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదంటూ తమను నిలదీస్తున్న బిజెపిని టార్గెట్ చేసే అవకాశం దీంతో కాంగ్రెస్‌కు ఏర్పడుతుంది. అందుకే న్యాయపరమైన చిక్కుముడులను విడదీయటంతోపాటు రాజకీయ ఎత్తుగడగా కాంగ్రెస్ కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తున్నదని భావించాలి . దానికి తగినట్లు ఎంతోకాలంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటివారు డిమాండ్ చేస్తున్న విషయం తెలియందికాదు. ఇంతకాలానికైనా కాంగ్రెస్ తలవంచుకుని సిబిఐకి ఈ కేసు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్లు తాజాగా బండి సంజయ్ ప్రకటించారు.
ఇదిలాఉంటే కాళేశ్వరంపైన జస్టీస్ పీసీ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదికపై చర్చించేందుకు కేవలం ఒక రోజు సమయాన్ని ఇవ్వటాన్ని సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం ఇవ్వలేదంటూ పలు రాజకీయపార్టీలు ధ్వజమెత్తాయి. సాయంత్రం అసెంబ్లీలో ప్రవేశపెట్టి అరగంటలోనే దీనిపై వివరణ ఇవ్వాలనడ మేంటని బిఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభలో ప్రభుత్వం తమ పైన చేసిన అనేక ఆరోపణల పైన వివరణ ఇవ్వడానికి కనీసం రెండుగంటల సమయమైనా ఇవ్వాలని పలుసార్లు హరీష్‌రావు స్పీకర్‌కు విజ్ఞప్తిచేయడం గమనార్హం. అలాగే తమకూ సమయం ఇవ్వలేదంటూ మరికొందరు బిఆర్ఎస్ సభ్యులతోపాటు బిజెపి సభ్యులు నిరసనగా వాకౌట్ చేశారు.
వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరాన్ని ఏం చేయదల్చుకుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి వాడకం విషయంలో ఇద్దరు మంత్రులు రెండు విధాలుగా చెప్పడంపట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనానికి గురికావడం .. నివేదిక పై చర్యలు తీసుకునే అంశం పై .ప్రతిపక్షాల సలహా సూచనలు మాత్రమే కోరుతున్నామని ..ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని తనదైన శైలిలో మాట్లాడుతూ ఆఖరికి కేంద్ర విచారణ సంస్థ కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాజకీయ ఎత్తుగడ గానే భావించాలి..!





