- తెలంగాణ తల్లి దీవెనలతోనే ప్రత్యేక రాష్ట్రం
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
నర్సాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : తెలంగాణ తల్లి మన ఉద్యమానికి నిత్యం స్ఫూర్తినిస్తుందని, ఆ తల్లి దీవెనలతోనే మనకు రాష్ట్రం వొచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ఎంతో కష్టపడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ స్తిత్వాన్ని నిలబెట్టారని గుర్తుచేశారు. నర్సాపూర్ నియోజకవర్గం కుల్చారం మండలం చిన్న గణపురంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. చిన్నగణపురంలో తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకువొస్తున్నాయని,. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన యువతకు, గ్రామ పెద్దలకు, విద్యార్థులకు హరీష్ రావు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాకముందు మెదక్ జిల్లా ఎలా ఉండేదో మనందరికీ తెలుసునని, తెలంగాణ వొచ్చిన తర్వాత మెదక్ జిల్లా ఎలా అభివృద్ధి చెందిందో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర నేతల సంచులు మోసి ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టినోడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చిన తర్వాత రూ.4 వేల పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు. కేసీఆర్ ఇస్తున్న బతుకమ్మ చీరలు ఒకటే, నేను గెలిస్తే రెండు ఇస్తామని చెప్పాడని కానీ ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు, బతుకమ్మ చీరలు పెన్షన్లు బంద్ చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి కూడా ముఖం లేదని అంటున్నారని తెలిపారు.
తెలంగాణ తల్లిని ఉద్యమంలో అందరూ మొక్కారు. నేడు ఆ తల్లిని స్వయానా సీఎం రేవంత్ మన నుంచి వేరు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జై తెలంగాణ నినాదాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాడని, ఆయన కావాలనే జై తెలంగాణ నినాదం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తమ సీఎంకు కోపం వొస్తుందని తెలంగాణ పేరు ఎత్తడం లేదు. ఏ రాష్ట్రం నాయకుడైనా తాను పుట్టిన గడ్డకు జై కొడతాడు. రేవంత్ రెడ్డి ఇక్కడి వాడు కాడేమో! అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిన హామీలు నెరవేర్చినట్టుగానే చెప్పని పనులు చేస్తాడట. తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తా, తెలంగాణ చిహ్నం మారుస్తానని అంటున్నాడు. తెలంగాణ ఉద్యమంపై రేవంత్ రెడ్డికి ఎంత అక్కసు ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన జై తెలంగాణ అనాల్సిందేనని.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం అంటే తెలంగాణ ఆనవాళ్లు చెరిపేయడమేనని హరీష్ రావు విమర్శించారు.




