దేశం కాదు..ముందు తెలంగాణ గురించి ఆలోచించు

రైతు ఆత్మహత్యలపై స్పందించి ఆదుకో
రాష్ట్ర రైతులను ఆదుకోవడంలో కెసిఆర్‌ ‌నిర్లక్ష్యం
సకాలంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు
కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాలపై పొన్నం మండిపాటు

‌సీఎం కేసీఆర్‌ ‌తొలుత ఇంట గెలిచి…ఆ తర్వాత రచ్చ గెలిచే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌సూచించారు. తెలంగాణలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకోని కేసీఆర్‌…‌దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులకు ఎగబడి సాయం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. తొలుత రాష్ట్రంలోని రైతులను ఆదు కోవడంపై దృష్టిపెట్టాలని కోరారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణలో ప్రజలకు న్యాయం చేశాక…దేశం గురించి ఆలోచించాలన్నారు. ఇక్కడ సమస్యలను గాలికి వొదిలేసి, సమస్యలే లేవన్న రీతిలో మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలోని రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయనేలేదన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎందుకు ఇవ్వలేదన్నారు. లక్ష 91వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయంటే..కనీసం 30వేల ఖాళీలు కూడా ఇంకా నింపలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని పొన్నం పేర్కొన్నారు. తెలంగాణను ఆర్థికంగా దివాలా తీయించిన కెసిఆర్‌ ఇప్పు‌డు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణను అప్పులమయం, అవినీతిమయం చేశారని మండిపడ్డారు. జరగని అభివృద్ధిని జరిగినట్లుగా 3డీ షోను చూపించి…ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్‌ ‌ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను కూడా ఇదే విధంగా మోసం చేయాలని చూస్తే నమ్మరని అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌సర్కారు ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ.. గతంలో కాంగ్రెస్‌ ‌హయాంలో తెచ్చినవేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో పొలం దున్నినోడిని, దున్ననోడిని అందరినీ సమానం చేసే పరిస్థితిని తెచ్చింది కేసీఆరేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల నిధులు నావంటే నావని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకోవడం సిగ్గుచేటనీ, సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలని, కాంగ్రెస్‌ ‌హయాంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు లేవని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *