2050 ‌నాటికి ప్రతీ నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య

దేశంలో 6.3 కోట్ల మందికి వినికిడి సమస్యలున్నాయని సర్వేలు చెపుతున్నాయి. ప్రతీ లక్ష మంది జనభాలో 291 మందికి ఈ సమస్య ఉందనేది సర్వేల సారాంశం. వీరిలో ఎక్కువ శాతం 14 ఏళ్ళ లోపు వారే కావడం గమనార్హం. ఇలానే కొనసాగితే 2050 నాటికి ప్రతీ నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పక్షాన నేషనల్‌ ‌సాంపిల్‌ ‌సర్వే ఆర్గనైజేషన్‌ ‌చేసిన సర్వే ద్వారా తెలుస్తున్నది. అలాగే దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో శబ్ద కాలష్యంపై కేంద్ర కాలుష్య నివారణ మండలి 2018లో చేసిన ఒక సర్వేలో అత్యధిక శబ్ధ కాలుష్య నగరాల్లో హైదరాబాద్‌ ‌ప్రథమ స్థానంలో ఉందని తేల్చింది. ఆ తర్వాత స్థానం చెన్నై కాగా, దేశ రాజధాని దిల్లీ ఆ తర్వాత స్థానంలో ఉంది.
హైదరాబాద్‌లో శబ్ద కాలుష్యం 79 డెసిబల్‌ ‌కాగా, చెన్నైలో 67.8, దిల్లీలో 61 డెసిబల్‌గా ఉందని చెప్పింది. అసలే వాయు కాలుష్యతో ఇబ్బంది పడుతుంటే, శబ్ద కాలుష్యం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీని వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చాలా మందికి వినికిడి తగ్గిపోతున్నది. మనిషిలో వొత్తిడిని పెంచడమేకాక నిద్రపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. హృద్రోగ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనిపై గత సంవత్సరంలో దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి పలు నిబంధనలను రూపొందించింది. వాణిజ్య సముదాయాల్లో, నివాస ప్రాంతాల్లో టపాసులు పేలిస్తే వెయ్యి రూపాయలు, అదే సైలెంట్‌ ‌జోన్లు అంటే హాస్పిటళ్లు, పాఠశాలల వద్ద నిబంధనలకు మించి శబ్దం చేస్తే  మూడు వేల రూపాయలు, పబ్లిక్‌ ‌ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాలు, పెండ్లి వేడుకల్లో జరిగే శబ్దానికి పదివేల రూపాయలు చెల్లించే విధంగా వివిధ రూపాల్లో నియంత్రణను తగ్గించే ప్రణాళికను రూపొందించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శబ్దకాలుష్యం అధికమైంది. రాజధాని రోడ్లపై నిత్యం 50 నుండి 60 లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. ఇందులో కాలం చెల్లిన ఆర్టీసి బస్సుల శబ్దాలు విపరీతం. దానికి తగ్గట్లు 15 ఏళ్ళు దాటిన వాహనాలను నిబంధనల ప్రకారం నియంత్రించలేక పోతున్నారు. వీటికి తోడు కావాలని సైలెన్సర్‌లను శబ్దం వొచ్చే విధంగా అమర్చి అత్యంత వేగంగా వెళ్ళే యువకులు అనేకులు.ఇవి ఇలా ఉంటే వివిధ మతపరమైన కార్యక్రమాలకు పెట్టే లౌడ్‌ ‌స్పీకర్లు, రాజకీయ ఆధ్యాత్మిక సభలు, సమావేశాలు అనేకం. దేశంలో ఎక్కడైనా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే లౌడ్‌ ‌స్పీకర్లు వాడాలన్న నిబంధన ఉంది. కాని రాత్రి పన్నెండు, ఒంటి గంట వరకు డిజెలను విచ్చలవిడిగా వాడుతున్న సంఘటనలున్నాయి. ఈ  విషయంలో సుప్రీమ్‌ ‌కోర్టు 2005లోనే ఉత్తర్వులు జారీ చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇళ్ళ మధ్య నిర్వహిస్తున్న పబ్‌ల నుంచి వొచ్చే శబ్దాల విషయంలో ఇటీవల కొందరు న్యాయస్థానానికి వెళ్ళగా తెలంగాణ హైకోర్టు శబ్ద కాలుష్యం 45 డెసిబుల్స్ ‌కన్నా మించరాదని ఆదేశించింది కూడా.

అయినా టపాసులు కాల్వడం, విందులు, వినోదాల సందర్భంగా మైక్‌లు పెట్టి ఆ చుట్టు పక్కల వారికి నిద్రా భంగం కలుగచేస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా ఏపి లోని తిరుపతిలో బుల్లెట్‌ ‌వాహనాలకు ఎక్కువ శబ్దం కలిగించే విధంగా అమర్చిన సైలెన్సర్లను అక్కడి పోలీసులు  దాదాపు 278 వాహనాలకు సంబంధించిన వాటిని రోడ్‌ ‌రోలర్లతో తొక్కించిన విషయం తెలిసిందే. అలాంటి చర్యలతోనైనా వీధుల్లో అత్యంత దారుణ శబ్దాలు చేసుకుంటూ వెళ్ళే వారిని కొంతవరకైనా నివారించే అవకాశం ఉంది. ఇటీవల కర్ణాటకలో మసీదుల నుండి విపరీత శబ్దం చేస్తున్న లౌడ్‌ ‌స్పీకర్ల విషయంలో చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థ ఒకటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అక్కడ హిందూ ఆలయాలకు కూడా అలాంటి నోటీసులనే పోలీసులు అందజేయటం గమనార్హం. కాగా తాజాగా మహారాష్ట్రలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. రాజ్‌ ‌థాక్రే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన చేసిన ఫిర్యాదుకు బిజెపి, విహెపి, ఇతర హిందూ సంస్థలు మద్దతు పలికాయి. కాని అక్కడి సర్కార్‌ ‌చాలా సున్నితమైన ఈ విషయాన్ని కేంద్రంపై నెట్టింది. లౌడ్‌ ‌స్పీకర్ల వినియోగం విషయంలో కేంద్రమే ఒక జాతీయ స్థాయి విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేస్తూ తప్పించుకుంది. ఏది ఏమైనా పరిమితికి మించిన శబ్ద కాలుష్యం ప్రజలకు ప్రమాదకరం. అందుకే తెలంగాణలో దీన్ని నియంత్రించేందుకు ట్రాఫిక్‌ ‌పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జర్మనీ సంస్థ తయారు చేసిన ఎకాస్టిక్‌ ‌సౌండ్‌ ‌డిటెక్టర్‌ ‌కెమారాలను అరెంజ్‌ ‌చేసే ఆలోచనలో ఉన్నారు. దీని వల్ల ట్రాఫిక్‌ ‌కూడళ్ళ వద్ద అనవసరంగా హారన్‌ ‌మోగించే వారిని గుర్తించే వీలుంటుంది. ఆలాంటి వారిపై చర్యలు తీసుకునే విధంగా దీనికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. దీని వల్ల కొంతైనా కాలుష్య నివారణ జరుగుతుందని ఆశిద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page