హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : మూసీ నది ప్రాశస్త్యం- ఆషాఢ బోనాల ఉత్సవాల వైభవ ప్రభావాలను సమన్వయం చేస్తూ ‘మÖసీ తరంగాలు- సింహవాహిని శతకం’ పద్య సంకలనాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, మూసీ పునర్జీవన సంస్థ ఎండీ ఈ.వెంకట నరసింహారెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించారు. మాసబ్ ట్యాంక్ మూసీ పునర్జీవన సంస్థ కార్యాలయంలో జీహెచఎంసీ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, కవి వరకాల యాదగిరి హైదరాబాద్ నగర సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, బోనాల పండగ విశిష్టతపై మూసీ తరంగాలు సింహవాహిని శతకాన్ని రచించారు. గోల్కొండ కోటలో వెలసిన శ్రీ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై బల్కంపేట రేణుక ఎల్లమ్మ కల్యాణం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో బోనాల వేడుకల విశిష్ఠతతో నెల రోజులు సాగే బోనాల వైభవాన్ని అద్భుతంగా విశ్లేషించారని వెంకట నర్సింహారెడ్డి అన్నారు. నగరంలోని పలు మహంకాళి ఆలయాల్లో జరిగే బోనాల వేడుకలతోపాటు ఒకప్పుడు హైదరాబాదు నగర ప్రజల జీవనాడి ముచుకుంద నది ప్రవాహ వర్ణనలను సూత్రీకరించటం విశేషమన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన మూసీ నది సమూల ప్రక్షాళన ప్రాధాన్యతను పద్యాల రూపంలో ఆకట్టుకునే రీతిలో కవి జర్నలిస్ట్ వరకాల యాదగిరి సాహితీ వర్ణన పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంద న్నారు. ఆధునిక కాలంలో సంప్రదాయ తెలుగు పద్య సాహిత్యాన్ని ‘మూసీ తరంగాలు- సింహవాహిని శతకం’ ను వెలువరించడం ముదావహం అని వెంకట నరసింహారెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ వరకాల యాదగిరి కలం నుంచి వార్తలు వ్యాసాలే కాక పద్య సాహిత్యం వెలువడటం విశేషమని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది అభివృద్ధి పనుల ప్రాధాన్యతను విశ్లేషించడంతోపాటు హైదరాబాదు నగర చారిత్రాత్మక సంప్రదాయ బోనాల వేడుకల వైభవాన్ని పుస్తకంలో అద్భుతంగా వర్ణించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిహెచఎంసి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుగా యాదగిరి తన అనుభవంతో హైదరాబాద్ నగర వారసత్వ సంస్కృతిపై రాసిన చారిత్రాత్మక అంశాలు నేటి తరానికి విజ్ఞాన దాయకంగా ఉంటాయని అన్నారు. సంప్రదాయ సాహిత్యం ను కోరుకునే తెలుగు పాఠకులను ‘మూసి తరంగాలు -సింహ వాహినిశతకం’ విశేషంగా ఆకర్షిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ కవి వరకాల యాదగిరి మాట్లాడుతూ నాలుగున్నర దశాబ్దాలుగా నిరంతరం మూసి నది ప్రవాహాన్ని పరిశీలించిన అనుభవం, చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలపై ఉన్న ఆసక్తితో పుస్తకాన్ని వెలువరించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో మూసి పునర్జీవన సంస్థ డైరెక్టర్ విష్ణువర్ధన్ రావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. పుస్తక రచయిత కవి యాదగిరికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
మూసీ తరంగాలు- సింహవాహిని శతకం ఆవిష్కరణ




