- 24 గంటలు పనిచేసే కోర్టులను తీసుకొస్తున్నాం
- న్యాయవ్యవస్థ బలోపేతానికి ఎన్నో చర్యలు
- డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశంలో ప్రధాని మోడీ
- గడపగడపకూ న్యాయం అందదాలన్న చీఫ్ జస్టిస్ రమణ
న్యూ దిల్లీ, జూలై 30 : సులభతర వాణిజ్యం, సులభతర జీవనం లాగే సులభతర న్యాయమూ అంతే ముఖ్యం అని ప్రధాని మోదీ అన్నారు. ఇందుకు న్యాయపరమైన మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ‘న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేసేందుకు గత ఎనిమిదేళ్లుగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ-కోర్టు మిషన్‌లో భాగంగా వర్చువల్ కోర్టులను ప్రారంభించాం. ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి నేరాలను విచారించేందుకు 24 గంటలూ పనిచేసే కోర్టులను తీసుకొస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు జైళ్లలో న్యాయ సహకారం కోసం ఎదురుచూస్తున్న అండర్‌ట్రయల్ ఖైదీల విడుదలకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని న్యాయస్థానాలను మోదీ కోరారు. దిల్లీలో జరిగిన నల్సా తొలి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశంలో ప్రధాని మోడీ, చీఫ్ జస్టిస్ట్ ఎన్వి రమణలు పాల్గొన్నారు. ఈ కోర్టు మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా వర్చువల్ కోర్టులను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టేందుకు అన్ని కోర్టుల్లో మౌలిక సదుపాయాలను విస్తరించినట్లు ప్రధాని తెలిపారు. సమాజంలో న్యాయవ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలని, న్యాయం కూడా అందరికీ సమానంగా అందాలన్నారు.
న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు గడిచిన 8 ఏళ్లలో ఎంతో పనిచేశామని మోదీ అన్నారు. జిల్లా న్యాయస్థానాలను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్బంగా జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా న్యాయ ఉద్యమాన్ని చేపట్టడంలో జిల్లా కోర్టులు చోదకాలుగా పనిచేస్తాయన్నారు. చాలా వరకు కేసుల్లో జిల్లా జుడిషియల్ అధికారులే కాంటాక్ట్‌లోకి వొస్తారని, జిల్లా న్యాయస్థానాల వద్ద తమకు కలిగిన అనుభవాల ద్వారానే న్యాయవ్యవస్థపై ప్రజల్లో ప్రజాభిప్రాయం ఏర్పడుతుందని ఆయన అన్నారు. జిల్లా న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు అత్యంత అవసరమని, దేశంలో న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా న్యాయస్థానాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదన్నారు. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చగలిగేలా జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. దేశంలో చాలా మంది ప్రజలు న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేక, న్యాయ సహకారం అందక మౌనంగా బాధపడుతున్నారని అన్నారు.

న్యాయ పక్రియలో చాలా మంది ప్రజలకు అతి దగ్గరగా ఉండేది జిల్లా న్యాయ సేవల అధికారులే. న్యాయస్థానాలపై ప్రజల అభిప్రాయం.. జిల్లా స్థాయిలో న్యాయాధికారుల నుంచి వారికి ఎదురయ్యే అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. జిల్లాల్లో న్యాయవ్యవస్థలను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చగలగాలి. అలా చేర్చగలిగితే మనమంతా న్యాయమూర్తులు, లాయర్లు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేయాలని సీజీఐ జస్టిస్ రమణ అన్నారు. ఈ సందర్భంగా దేశ యువతపై సీజేఐ ప్రశంసలు కురిపించారు. ‘ఈ దేశ నిజమైన బలం యువతలోనే ఉంది. ప్రపంచంలో ఐదోవంతు యువత మన దేశంలోనే ఉంది. అయితే మన శ్రామిక శక్తిలో నైపుణ్యవంతులు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారు. మిగతావారిలోనూ నైపుణ్యాలను పెంచి ఆ శక్తిని ఉపయోగించుకోవాలి’ అని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు.




