మితిమీరిన ఇసుక లారీల వేగం . అడ్డుకున్న స్థానిక మహిళలు, రాస్తారోకో
మణుగూరు,ప్రజాతంత్ర,అక్టోబర్19:మణుగూరు మండలంలోని రావిగూడెం గోదావరి నది నుండి ఇసుక లోడుతో వెల్తున్న లారీలను గురువారం సాయంత్రం మండలంలోని మణికంఠనగర్ గ్రామంలో మహిళలు ఇసుక లారీలను నిలిపివేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు మాట్లాడుతూ నిత్యం ఈ రహదారి పై లారీలు మితిమీరిన వేగంతో వెల్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీల మితిమీరిన వేగం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని. అధికారులకు, ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆరోపించారు. ఇసుక లారీల అతి వేగంగా వలన ప్రమాదాలు జరగడమే కాకుండా, రహదారి పై దుమ్ము ధూళి వలన తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ప్రభుత్వం ఇసుక రవాణా సాయంత్రం ఆరు గంటలకు నిలిపివేయాలని నిబంధనలు ఉన్నా, సదరు ఇసుక ర్యాంపు నిర్వాహకులు రాత్రి సమయంలో కూడా ఇసుక రవాణా చేస్తున్నారని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి లారీల వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, రహదారి పై దుమ్ము ధూళి రాకుండా వాటర్ తో రహదారి తడపాలని, నిబంధనలు పాటించని ర్యాంపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





