ప్రమాణం చేయించిన సిజెఐ జస్టిస్ న్‌వి రమణ
తొలిసారిగా అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ
హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోడీ, నడ్డా తదితరులు
ప్రమాణానికి ముందు రాజ్‌ఘాట్‌లో గాంధీకి ముర్ము నివాళి
తన ఎన్నిక సామాన్యులకు దక్కిన గౌరవంగా ముర్ము వెల్లడి
అరుదైన ఘనత దక్కించుకున్న జస్టిస్ ఎన్‌వి రమణ
న్యూ దిల్లీ, జూలై 25 : దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము అత్యతున్నత పీఠం అధిష్టించారు. ఈ క్రమంలో రాష్ట్రపతిగా సోమవారం ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రలో హాలులో జరిగిన కార్యక్రమంలో భారత సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ముర్ము రెండో మహిళా రాష్ట్రపతి కాగా..తొలి గిరిజన రాష్ట్రపతి కావడం విశేషం. రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ముకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా స్వాగతం పలికారు. అక్కడ సైనిక వందనం స్వీకరించారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో ముర్ము సెంట్రల్ హాలుకు చేరుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ..రాజ్యాంగంలోని ఆర్టికల్-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఆ వెంటనే సైన్యం 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది.
ప్రమాణ స్వీకారానికి ముందు ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత దిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం.. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లగా.. రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ముర్ముకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె తొలి ప్రసంగం చేశారు. ప్రసంగం తర్వాత రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు ద్రౌపదీ ముర్ము. అక్కడ రాష్ట్రపతిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో రామ్‌నాథ్ కోవింద్ ముర్ము వెంటే ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత..అధికారిక ట్విట్టర్ ఖాతాను ముర్ముకు బదిలీ చేశారు. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన తొలి తెలుగు వ్యక్తిగా ఖ్యాతి గడించారు. సాధారణంగా రాష్ట్రపతితో సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ రమణ.. ఆ గౌరవం దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు వ్యక్తి భారత రాష్ట్రపతితో ప్రమాణం చేయించలేదు. రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణ స్వీకారం చేసిన 10వ వ్యక్తి ద్రౌపదీ ముర్ము. 1977లో నీలం సంజీవ రెడ్డి జులై 25న భారత ఆరో రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణం చేశారు. అప్పటి నుంచి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించినవారంతా అదే తేదీన బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పుడు 15వ రాష్ట్రపతి ముర్ము కూడా అదే జాబితాలో చేరారు.




