అప్రమత్తంగా ఉండక తప్పదని నిపుణుల హెచ్చరిక
న్యూ దిల్లీ, జూన్ 7 : కొరోనా వేవ్ వొస్తుందంటే జనం భయపడే రోజులివి..కానీ థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫోర్త్ వేవ్‌ను అందరూ లైట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫోర్త్ వేవ్ వొస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం కొరోనా మహమ్మారి ఇంటి నుంచి కాలు బయట పెట్టనీయలేదు. ప్రాణభయం వెంటాడడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీవన ప్రయాణానికి లాక్ పడింది. క్రమంగా కొరోనా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో రెండున్నరేళ్ల తర్వాత జనజీవనం పట్టాలపై పరుగులు తీస్తుంది. మళ్లీ పూర్వ వైభవం వొచ్చిందా అన్నట్లుగా అంతటా రద్దీ వాతావరణం నెలకొంది. ఉత్సవాలు, పెళ్లిళ్లు, వేడుకలు, జాతరలు జనంతో కలకలలాడుతున్నాయి.
అయితే ప్రస్తుతం మళ్లీ ఫోర్త్ వేవ్ భయం ఆందోళన కలిగిస్తుంది. జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు అంటే నాలుగు నెలలపాటు ఫోర్త్ వేవ్ ప్రభావం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాన్పూర్ ఐఐటీకి చెందిన పరిశోధకులు ఫోర్త్ వేవ్‌పై కీలక విషయం వెల్లడించారు. అయితే దీని తీవ్రతపై మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. కొత్త వేరియంట్లు, మ్యూటేషన్లు, టీకాలు, బూస్టర్ డోసుల ప్రభావం ఆధారంగా ఫోర్త్ వేవ్ ప్రభావం ఎలా ఉందో అంచనా వేయొచ్చు. బూస్టర్ డోసు వల్ల కలిగే ఇమ్యూనిటీ నిలబడగలితే పోర్ వేవ్ ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఇమ్యూటీని మించి మ్యూటేషన్ ఇబ్బంది పెడితే మాత్రం ఫోర్త్ వేవ్ ప్రభావం గట్టిగా ఉంటుంది. దేశవ్యాప్తంగా కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా, ఇటు రాష్ట్రంలో కొరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో రెండు, మూడు జిల్లాల్లో కొరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. కేంద్రం అప్రమత్తం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ఉన్నాయి. గత రెండు వారాలుగా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 6 వందల యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనడం, మాస్క్, సామాజిక దూరం పాటించకపోవడం.. కొరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.




