పదేళ్లలో ప్రజల ఆశలు.. అడియాశలు

  • తెలంగాణ ప్రల కలలు నెరవేరలేదు…
  • కెసిఆర్‌ అవినీతి కుటుంబ పాలనతో అనేక కష్టాలు
  • కాంగ్రెస్‌ను నిలువరించడమే బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌పార్టీల ధ్యేయం
  • ముగ్గురి మధ్య చీకటి ఒప్పందం
  • వేములవాడ విజయభేరీ  సభలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ

సిరిసిల్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కలలు పూర్తిగా నెరవేరలేదని, కెసిఆర్‌ ‌కుటుంబ పాలనతో ప్రజలకు అనేక కష్టాలు ఏర్పడ్డాయని కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌కు మద్ధతుగా వేములవాడ పట్టణంలో సభను కాంగ్రెస్‌ ‌పార్టీ వారు నిర్వహించారు. ఈ సభలో రాహుల్‌ ‌గాంధీ పాల్గొని మాట్లాడుతూ… ఎందరో బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కన్నవారి ఆశలు అడియాశలు చేశారని, తెలంగాణ ప్రజల కలలు సాకారం కాలేదని అన్నారు. తెలంగాణలో అవినీతి పాలన కొనసాగిస్తున్న కెసిఆర్‌ ‌కుటుంబంతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఒకవైపు ఉండగా బిఆర్‌ఎస్‌, ‌బిజెపి, ఎంఐఎంలు మరోవైపు ఉన్నాయని, ఈ మూడు పార్టీలు ఒక్కటేనని వారందరి ధ్యేయం కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలోకి రాకుండా చూడడమేనని అన్నారు. అయినప్పటికిని ప్రజల ఆదరాభిమానాలులో తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందని, కెసిఆర్‌ ‌కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని అన్నారు.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతుందని, ధరణితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, నిరుద్యోగుల జీవితాలతో బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ చెలగాటం ఆడుతుందని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్‌, ‌కేంద్రంలో నరేంద్రమోదీలు శాశ్వతంగా పదవుల్లో ఉండాలని ఆశిస్తూ, తమ వ్యతిరేకులపై అనేక కేసులు నమోదు చేస్తున్నాయని అన్నారు. తనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 24 కేసులు నమోదు చేశారని, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై సిబిఐ, ఈడిల ద్వారా కేసులు నమోదు అవుతాయని అన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌పాలన ఉండాలని ఎంఐఎం కోరుకుంటుందని, కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం దీనికి నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తనపై ఒత్తిడి తేవడానికి తనకు కేటాయించిన ఇల్లు ఖాళీ చేయించారని, అయితేనేమి దేశంలో ప్రతి పేదవాడి గుండెల్లో, ఇంటిలో తాను ఉన్నానని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యతిరేకంగా ఉండే వారిపై కేసులు నమోదు అవుతాయని, తెలంగాణ ము్య మంత్రిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, చీకటి ఒప్పందం వారి మధ్య ఉందని అన్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టి రాష్ట్రంలో గెలవబోతుందని,తాము ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, ఇళ్లులేని పేదలందరికి ఇళ్ల నిర్మిస్తామని, ప్రతి మండలంలో  ఇంటర్నేషనల్‌ ‌ప్రమాణాలతో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో తమ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని, తాము తెలంగాణ ప్రజల్లో ఒకరిమని అన్నారు. వేములవాడ నియోజక వర్గంలో కాంగ్రెస్‌పార్టి అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ఆది శ్రీనివాస్‌ ‌మాట్లాడుతూ…నియోజక వర్గ ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని, తనకు ఒక సారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు.

పేదవాడికి, ధనిక వర్గాలకు మధ్య ఈ ఎన్నిక జరుగుతుందని, దొరల ఆగడాలను అరికట్టి , వారి గడీలను బద్దలు కొట్టడానికి తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సభలో కాంగ్రెస్‌ ‌పార్టి జిల్లా నాయకులు, వేములవాడ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో వేలాది మంది పాల్గొనడంతో వేములవాడ శివారు మూడు గంటల పాటు కిక్కిరిసిపోయింది. దీనితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వొచ్చింది.  ఇదిలా ఉండగా అంతకు రెండు గంటల ముందు బిజెపి అభ్యర్థి వికాస్‌ ‌రావు నిర్వహించిన సభకు ఉత్తర ప్రదేశ్‌ ‌సిఎం ఆదిత్యనాథ్‌ ‌యోగి హాజరు కావడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించారు. రోడ్డు పక్కనే గల స్థలంలో ఈ సభ నిర్వహణ ఉండటంతో వాహనాల రాకపోకలను పోలీసులు దారి మళ్లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *