నుపూర్‌ ‌శర్మ అనుచిత వ్యాఖ్యలు

అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అహంకారంగా మాట్లాడితే ఏమవుతుందనేదానికి నుపూర్‌ ‌శర్మ చేసిన వ్యాఖ్యలతో ఏర్పడిన గందరగోళం ఇప్పుడు పాఠాన్ని నేర్పుతున్నది.  కాన్పూర్‌లో ఒక టివి ఇంటర్వులో బిజెపి అధికార ప్రతినిధిగా ఆమె చేసిన వ్యాఖ్యలు గాలిదుమారంనుండి తుఫాన్‌గా మారి ప్రపంచ దేశాలన్నీ భారత్‌ను వేలెత్తి చూపే పరిస్థితి కారణమయింది.  ఇంతకాలంగా ప్రపంచ చిత్ర పటంలో భారత్‌కు ఒక ఉన్నత స్థానం ఉండింది. చైనా, పాకిస్తాన్‌ ‌లాంటి దేశాలు తప్ప మరే దేశం భారత్‌ ‌వైపు వేలెత్తే సాహసానికి• వడిగట్టిందిలేదు. అమెరికా, రష్యా  లాంటి దేశాలతో సమాన గుర్తింపును తెచ్చుకుంటున్న భారత్‌ ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోని సంపన్న అరబ్‌ ‌దేశాలకు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఒక విధంగా  బలహీన భారత్‌గా గుర్తింపబడే పరిస్థితులకు దారితీసేదిగా ఉందని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒక పార్టీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు యావత్‌ ‌భారత దేశ ప్రజల పక్షాన క్షమాపణ చెప్పడమేంటని ఆ పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నాయి.

అధికారంలో ఉన్నాము కదా అని నోటికి ఎం•వొస్తే అంత మాట్లాడితే జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయన్న విషయాన్ని ఇప్పటికైనా పార్టీ నేతలు గుర్తించాల్సిన అవశ్యకత ఉందంటూ వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒక చిన్న కామెంట్‌ అరబ్‌ ‌దేశాలన్నిటినీ సంఘటితం చేసి, భారత్‌ను నిలదీసే పరిస్థితిని కల్పించింది. అంతే •కాదు.. అది దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావాన్ని చూపే ప్రమాదానికి కారణంగా మారుతోంది. అరబ్‌ ‌దేశాలతో విస్తృత వాణిజ్య సంబంధాలున్న భారత్‌  ఉత్పత్తులపై ఆదేశాలు నిషేధాన్ని విధించే పరిస్థితివరకు తెచ్చుకున్నామంటే పాలకులు దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది..  మత విద్వేశాలను నూరిపోస్తున్న బిజెపి ముందుగా భారతీయులకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్యనాయకుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ ‌చేస్తున్నారు. పార్టీ పరమైన వ్యాఖ్యలకు దేశం పక్షాన క్షమాపణ చెప్పడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు..

ఇది ఒక విధంగా దేశ పరువును మంటకలపడమేనంటూ ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ ‌కూడా ఈ విషయంలో బిజెపి ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. కేవలం ఆ పార్టీ అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు ఇవ్వాళ భారత ప్రభుత్వం తలదించుకోవాల్సి వొచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. గల్ఫ్ ‌దేశాల్లో ఒకటైన ఖతర్‌ ‌లాంటి చిన్నదేశం రగిలించిన ఈ చిచ్చు దావానలంగా ప్రపంచ ముస్లిం దేశా)కు పాకింది. ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో  నడిచే అల్‌ ‌జజీరా ఛానల్‌ ‌దీన్ని ప్రముఖంగా ప్రసారం చేయడంతో ముస్లిం దేశాలన్నీ భారత్‌ను క్షమాపణ చెప్పాలని పట్టుపట్టాయి.  కువైట్‌, ఒమోన్‌, ఇరా•,• సౌదీ ఆరేబియా, యుఏఈ, జోర్డాన్‌, ‌మాల్దీవులు, ఇండోనేషియా, బహ్రేయిన్‌ ‌లాంటి దేశాలు ఏకంగా భారత ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించే  పరిస్థితి ఏర్పడింది. కువైత్‌ ‌లాంటి చోట్ల భారత ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేస్తున్నట్లు బోర్డులే పెట్టడం పరిస్థితి ఎంత సీరియస్‌గా మారుతోందనడానికి ఉదాహరణగా నిలుస్తున్నది. విలువైన రంగు రాళ్ళు, ముత్యాలు, లోహాలు, ఇనుము, ఎలక్ట్రిక్‌ ‌సామగ్రీ, ఉక్కు, రసాయనాలు ఇలా అనేక సరుకులను ఆ దేశాలకు మన దేశంనుండి ఎగుమతి అవుతుంటాయి. అలాగే ఆయాదేశాలనుండి  అధిక మొత్తంలో పెట్రోల్‌ ‌ను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితిలో బిజెపి అధికార ప్రతినిధి మహమ్మద్‌ ‌ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు మన దేశానికి పెద్ద సంకట పరిస్థితినే తెచ్చి పెట్టింది.

ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు ఆదేశాలు ఏకంగా భారత్‌ ‌రాయబారులకు సమన్లను అందజేశాయంటే ఆ దేశాలు ఈ విషయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నాయన్నది అర్థమవుతున్నది.  ఈ దేశాలతో కేవలం వాణిజ్య పరమైన సంబంధాలే కాకుండా, మన దేశానికి సంబంధించిన    అనేక మంది ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ, విద్యార్జన చేస్తూ, కార్మికులుగా స్థిరపడ్డవారున్నారు. వారిపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపేదిగా ఉంది. ఇదే అదనుగా పాకిస్తాన్‌కూడా భారత్‌పై ఆరోపణల పరంపరకు దారితీస్తోంది. ఈ విషయంలో భారత్‌ ‌గట్టిగా సమాధానం చెబుతున్నప్పటికీ, ఇటీవల కర్ణాటకలో  చాలాకాలంగా  హిజాబ్‌ ‌ధరించడంపై చెలరేగిన వివాదాన్ని ఈ సమయంలో ప్రస్తావనకు తీసుకువొచ్చి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో  ఆ వ్యాఖ్యల కారకులైన బిజెపి అధికార ప్రతినిధి నూపుర్‌ ‌శర్మన•• ఆ పార్టీ  సస్పెండ్‌ ‌చేసింది. అలాగే దిల్ల్లీ మీడియా ప్రతినిధి నవీన్‌ ‌కుమార్‌ ‌జిందాల్‌ను బిజెపి పార్టీనుండి బహిష్కరించించింది. అంతటితో   సరిపోదని వారిని వెంటనే అరెస్టు  చేయాలన్న డిమాండ్‌ ‌బలంగా వినవొస్తున్నది. మనదేశంలోని వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌, ‌పార్టీలు  ఆప్‌, ‌బిఎస్పీ, ఎస్‌పి తదితర పార్టీలు ఈ డిమాండ్‌ ‌చేస్తున్నాయి. మొత్తానికి అన్ని మతాలకు ఆలవాలమైన  భారత్‌ ‌దేశానికి ఈ సంఘటన గొడ్డలిపెట్టుగా మారింది. మనది లౌకిక రాజ్యాంగమని చెప్పుకుంటున్నాం. కాని, ఎన్నికల్లో గెలవడంకోసం, అధికారంకోసం తప్పటడుగులు వేస్తున్నాయి కొన్ని పార్టీలు. ఇప్పటికైనా ఆచితూచి వ్యవహరించాలన్న పాఠాన్ని ఈ సంఘటన చెప్పకనే చెబుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *