-బ్యాంకులు, షావుకారుల ముందు రైతును దొంగను చేశారు
-రైతు బంధు ఇచ్చి ఇన్ పుట్ సబ్సీడీ పూర్తిగా ఎత్తేశారు
-భూసార పరీక్షలు కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్రం పక్కదారి
-రైతు సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
ఫోటో రైటప్ : రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎస్.జైపాల్ రెడ్డి
రైతుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ అవగాహనా లేమి, నిర్లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు అప్పుల పాలయ్యారని, బ్యాంకులు, షావుకారుల ముందు రైతులను ప్రభుత్వం దొంగను చేసిందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు ఇచ్చి ఇన్ పుట్ సబ్సీడీని ఎత్తివేశారని, రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతృప్తిగా లేరని అన్నారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రైతు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, మన భవిష్యత్తు కార్యాచరణ ప్రస్తావన’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం అలిండియా ఫార్మర్స్ సౌత్ ఇండియా ఇంచార్జ్ యస్.జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా హాజరైన వక్తలు ఆదర్శ రైతు, రాష్ట్ర రైతు అవార్డు గ్రహీత ఎన్.ఉపేందర్ రెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, నేచురల్ ఫార్మింగ్ హరిబాబు, జిల్లా అవార్డు గ్రహీత, ఆర్గానిక్ ఫార్మర్ సుధీర్, భారతీయ కిసాన్ సంఘ్ నేత సుధీర్, శ్రీకాంత్, పకీర్ రాజేందర్ రెడ్డి, ఆంజనేయులు, శోభ, అనసూయ, మణెమ్మ, వివిధ జిల్లాల నుంచి హాజరైన రైతులు మాట్లాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 26 రాష్ట్రాల నుండి రైతు సంఘ నాయకుల పేరుతో ప్రతినిధులను ప్రభుత్వ ఖర్చులతో ఇక్కడికి ఆహ్వానించారు కానీ ఈ సమావేశానికి తెలంగాణ రైతులు సీఎం కెసిఆర్ కి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. రైతు సమస్యలు చెప్పుకోవడానికి ఏ రైతు సంఘాలకు కనీసం అవకాశం ఇవ్వని సీఎం, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచని సీఎం తెలంగాణలో వ్యవసాయం వెలిగిపోతున్నదనే ప్రచారం చేయించుకోవడం సరి కాదన్నారు. సంవత్సరాలనుండి పంట నష్టం నుండి రైతులను ఆదుకునేందుకు ఇన్ పుట్ సబ్సిడి లేదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఇచ్చిన లక్ష రూపాయల వ్యవసాయ రుణ మాఫీ హామీని సీఎం గాలికి వదిలేశాడని అన్నారు. ఈ కారణంగా రైతులను బ్యాంకులు డిఫాల్టర్లుగా ప్రకటించాయన్నారు. కొత్త అప్పు పుట్టక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని అప్పులు తీర్చలేక రైతులు నిండు ప్రాణాలను బలి చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో రైతు వేదిక హాల్లో రైతు ఉరి వేసుకొని మరణించడం దీనికి ఒక పరాకాష్ట అన్నారు. కేంద్ర ప్రభుత్వం అతివృష్టి, అనావృష్టి నుండి రైతులను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన పథకం అందుబాటులోకి తెస్తే దాన్ని తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అమలు పరచకుండా నిర్వీర్యం చేసిందన్నారు. కెసిఆర్ పుట్టిందే రైతుల కోసం అని ప్రకటించుకొని ఇక నుండి రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని కెసిఆర్ ఆమాట మరిచాడన్నారు. కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రతిపాదిస్తూ నిధులు కేటాయిస్తే వాటిని కెసిఆర్ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం బిచ్చగాళ్లుగా చూస్తుందని అన్నారు. భూములు కోల్పోయిన రైతుల పట్ల అత్యంత రాక్షసంగా ప్రవర్తిస్తూ వారికి న్యాయమైన పరిహారం ఇవ్వకుండా ఉసురు తీస్తుందని అన్నారు. వ్యవసాయం అంటేనే భూమి అని, ప్రభుత్వం రైతుల భూమి గుంజుకోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో రెవిన్యూ చట్టం దుర్మార్గం అన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలు గాలికి వదిలి దేశ వ్యాప్తంగా రైతులను ఉద్దరిస్తా అంటూ ఇతర రాష్ట్రల పర్యటనలు చేస్తూ అక్కడ రైతంగాన్ని ఉద్దరిస్తానని కెసిఆర్ చెప్పుకోవడం విడ్డూరం అన్నారు. 12 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తూ 24 ఇస్తున్నామని ప్రగల్బాలు పలుకుతుందన్నారు. ఎన్ని గంటలు ఇస్తారో స్పష్టం చేయాలన్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా ఇన్సూరెన్సు, పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు. లేబర్ సమస్య అధికంగా ఉన్నా యాంత్రీకరణ చేపట్టడం లేదన్నారు. రైతు 9 సెంట్రల్ స్పాన్సర్ స్కీంలకు రూ.10 వేలు ఇస్తుందని, రాష్ట్రం అమలు చేయాలన్నారు. రైతు భీమ వయస్సును 59 నుంచి 70 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పండించిన పంటలు ఎగుమతి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందాన్నరు. రాష్ట్ర జీడీపీ పెరిగిందని ప్రకటించిన సీఎం కెసిఆర్ రాష్ట్రంలో రైతులు ఎందుకు అప్పులపాలు అయ్యారో చెప్పాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సమస్యపై పరిష్కార మార్గాలు చూపాలన్నారు. రైతుల సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు.




