పన్నల వసూళ్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై వాడీవేడీగా చర్చ
అధికార కార్పొరేటర్ల తీరుపై విపక్ష సభ్యుల ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. దీంతో మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ వి•టింగ్ రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్ల అంశంపై గొడవ తలెత్తింది. దీంతో బీజేపీ కార్పొరేటర్లు పోడియంను చుట్టముట్టారు. టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్లను మన్నే కవిత పొగిడారు. సిద్ధాంతాలు నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరానని ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ తెలిపారు. బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు పోడియంను చుట్టుముట్టడంతో మేయర్ సభను వాయిదా వేశారు. దీంతో సభ ఐదు నిమిషాల పాటు వాయిదా పడింది. అనంతరం జీహెచ్‌ఎంసీలో పన్నుల వసూళ్లపై చర్చ జరిగింది. ఈ నెల 17వ తేదీన బంజారాహిల్స్‌లో కుమ్రంభీమ్ ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా భవన్‌లను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు..టీఆర్‌ఎస్ కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
దీంతో కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను భజన కార్యక్రమంగా మారుస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామంటూ చెప్పిన జీహెచ్‌ఎంసీ..కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేకపోతుందంటూ మండిపడ్డారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు తీసుకుని రాలేకపోతుందన్నారు. అప్పులు తెచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కనీసం విధి దీపాల నిర్వహణ కూడా జీహెచ్‌ఎంసీ సక్రమంగా చేపట్టడం లేదన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. చార్మినార్ జోన్‌లో 50 శాతం మాత్రమే పన్నులు వసూలు చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నుంచి 284 కోట్లు, చార్మినార్ జోన్ నుంచి కేవలం 102 కోట్లు మాత్రమే వసూలు చేశారన్నారు. పన్నులు వసూలు అయిన ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం భవనాలకు సంబంధించిన పన్నులు ఎందుకు వసూలు చేయడం లేదని బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూధన్ రెడ్డి పేర్కొన్నారు. హాస్పిటల్స్, స్కూల్స్, పోలీస్ స్టేషన్లకు సంబంధించి 1996 నుంచి 3 వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని కమిషనర్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భవనాల బకాయిలు ఎలా వసూలు చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బల్దియా సమావేశాలను కామెడీ షో చేస్తున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ విజయారెడ్డి పేర్కొన్నారు. మన్నే కవిత టీఆర్‌ఎస్ పార్టీ భజన చేయడానికి సభను వాడుకుంటున్నారని ఆరోపించారు.
మెప్పు పొందేందుకు మన్నే కవిత..కేసీఆర్, కేటీఆర్ భజన చేస్తున్నారన్నారు. అలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని విజయారెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు..బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలుపుతూ జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాలకు ర్యాలీగా వెళ్లారు. జాంబాగ్ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మద్దతుగా కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. ‘నువ్వు పోరాటం చేయి..నీకు మా మద్దతు ఉంది’ అంటూ జైస్వాల్ నినదించారు. ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు సమావేశానికి హాజరయ్యారు.




