కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో భట్టి విక్రమార్క కు చోటు

కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో ఖమ్మం జిల్లాలోని ఐదు స్థానాలలో మధిక ఒక్క స్థానానికి చోటు దక్కింది. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క మల్లు 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచారు. 2009లో తొలిసారి మధిరా నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2009లో చీఫ్‌ విప్‌గా నియమించబడ్డారు. 2011జూన్‌ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుండి పోటీచేసి సిపిఎం పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌ రాజు పై 12,329 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ పై పోటీ చేసి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా నియామకమయ్యారు. డైరెక్టర్‌, ఆంధ్రాబ్యాంక్‌, పిసిసి కార్యనిర్వాహక సభ్యుడిగా, పిసిసి కార్యదర్శి, శాసనమండలి సభ్యుడిగా ఇలా అనేక పదవులు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా 2019 జనవరి 20 నుండి నేటికి కొనసాగుతున్నారు. మల్లు భట్టి విక్రమార్క 2023 మార్చి 16న ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్‌ నుంచి పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా మొత్తం 1,360 కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. దీనికి చిహనంగా ఖమ్మం రూరల్‌ మండలంలోని తల్లంపాడు దగ్గర పైలాన్‌ను ఆవిష్కరించి పాదయాత్రను ముగించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో జులై 2న జన గర్జన మహా సభను నిర్వహించాడు. ఈ సభకు రాహుల్‌ గాంధీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *