గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిగారికి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నమస్కారం…నా అధ్యయనం అనుభవాల నుండి నూతన ప్రభుత్వానికి కొన్ని సూచనలు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కల నాయకత్వంలో నూతన ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో ఊహించిన దానికన్నా వేగంగా ముందుకు సాగడం హర్షనీయం.
1) మహిళల సంక్షేమం, అభివృద్ధి సాధికారికత
రాష్ట్రంలోని సగం జనాభా అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూత పరిమితి 10 లక్షలకు పెంచడం పేద ప్రజల ఆయు ప్రమాణాలను పెంచడంలో గొప్ప ముందడుగు. మహిళలకు 2500 రూపాయలు వెంటనే ప్రకటించడం మహిళల పట్ల వారి సాధికారికత పట్ల చూపుతున్న శ్రద్ధ, ఆసక్తి కమిట్‌మెంట్ ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ డబ్బును మహిళలు వృధా చేయరు. కూరగాయల పెంపకం, అమ్మకం, చిన్న చిన్న వ్యాపారాలు, ఉత్పత్తుల ద్వారా సమాజ సంపదను పెంచడంలో, కుటుంబం సాఘింకంగా, ఆర్థికంగా ఎదగటంలో తోడ్పాటును ఇస్తుంది. కుటుంబ పరిపాలనలో, ఆరోగ్యం, పిల్లల పెంపకం, పాఠశాల మొదల్కెనవి అనేక విషయాల్లో మహిళలకు ఇచ్చే చేయూత గొప్ప పాత్ర నిర్వహిస్తుంది. మహిళల స్వయం నిర్ణయాధికారాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది. ఈ చేయూత నుంచి కొంత మొత్తాన్ని వారి పేరిట ప్రావిడెంట్ ఖాతా ప్రారంభించి జమ చేసి ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానిస్తే జీవన భద్రత, పొదుపు, భవిష్యత్ నిధి చక్కగా చేకూరుతుంది.
2) అసంఘటిత కార్మికులకు, కూలీలకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా
అలాగే అసంఘటిత కార్మికులకు, కూలీలకు, ఆటో డ్క్రెవర్లకు, పని మనుషులకు, భవన నిర్మాణ కార్మికులకు మొదల్కెనవారందరికి ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ప్రారంభించి అన్ని సబ్సిడీలను వారి ఖాతాలో జమ చేసి ఇన్సురెన్స్ సౌకర్యం కూడా అనుసంధానిస్తే చాలా సమస్యలు తగ్గుతాయి. సబ్సిడీలలో జరిగే అవినీతి తగ్గుతుంది. జీవన భద్రత పెరుగుతుంది.
3) లక్షల ఉద్యోగాలు వెంటనే నింపాలి
తెలంగాణలో రెండు లక్షల చిల్లర ఖాలీలు ఉన్నాయని కమిటీ ప్రకటించిన ఉద్యోగాలను వెంటనే నియమించడం అవసరం. గ్రూప్ 1, గ్రూప్ 2 తప్ప మిగతా ఉద్యోగాలన్నిటినీ జిల్లా సెలక్షన్ కమిటీ (డిఎస్) ద్వారా నియమించడం సులభం. కాంట్రుక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి కొత్త స్కేలు రూపొందించడం అవసరం.
1996 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, విద్యావంతులు, నిరుద్యోగులు 40 లక్షల మంది ఉన్నారు. వీరిలో కనీసం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం సాధ్యమే. మరో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పన కోసం ఆర్థిక సాయం అందించడం అవసరం.
4) వయో పరిమితిని పూర్వస్థితికి తేవాలి
58 సంవత్సరాల ఉద్యోగ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచడం వల్ల ఉద్యోగులు వయోభారంతో బాధపడుతున్నారు. వారి ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఆధునిక టెక్నాలజీ, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ పరిపాలనా విధానంలో, విద్యావిధానంలో పనిచేయడంలో అలసిపోతున్నారు. తిరిగి వయో పరిమితిని 58 సంవత్సరాలకు మార్చడం అవసరం. తద్వారా 50 వేల ఉద్యోగాలు ఖాలీలు ఏర్పడతాయి. ఆ ఉద్యోగాల్లో మన యువతరం విద్యావంతులే ఎన్నికవుతారు. యువతరం విద్యావంతులకు ఉపాధి కల్పించడానికి సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు 58 యేళ్ళకు రిట్కెర్ కావడాన్ని సంతోషంగా అంగీకరిస్తారు. వారి పిల్లలు కూడా పోటీలో ఎదిగి కొత్త ఉద్యోగాలు సంపాదించుకుంటారు. వీరు రిట్కెర్ కావడం వల్ల జరిగే అనేక లాభాల్లో ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. ఒక జీతం ఖర్చులో ముగ్గురిని నియమించవచ్చు.
5) తొలుత కాన్సాలిడేటెడ్ జీతంతో నియామకాలు
తొలుత మూడేళ్ళు కనీస వేతనంతో నియమించి క్రమంగా పే స్కేల్స్ వర్తింపజేసే పద్దతిని పునరుద్దరించాలి. గతంలో 1973లో తెలంగాణ ఉద్యమకారుల్లో 125 రూపాయలు, డిగ్రీ పూర్తి చేసినవారికి 150 రూపాయలు ఇచ్చి ఐదేళ్ళకు పే స్కేల్స్ ఇచ్చారు. ఆ తర్వాత 398 రూపాయలకు నియామకాలు చేశారు. తర్వాత పే స్కేల్ ఇచ్చారు. ఆ తర్వాత 1200 రూపాయలకు నియమించి మూడేళ్ళ తర్వాత పే స్కేల్స్ అమలు జరిపారు. ఇప్పుడు కూడా ఇదే విధానంలో తొలుత 15 వేల రూపాయలు ఫిక్స్‌డ్ పై యేటా మూడు వేలు పెంచుతూ మూడేళ్ళ తర్వాత కొత్త పే స్కేల్స్ అమలు జరిపేవిధంగా నియమించడం వల్ల ప్రభుత్వం మీద పెద్దగా బారం పడదు. సీనియర్ ఉద్యోగులకు లక్ష రూపాయలు జీతం ఉంటే 50 వేలు పెన్షన్ ఉంటుంది. మిగతా 50 వేలతో ఇలా ముగ్గురి విద్యావంతులను, నిరుద్యోగులను నియామకాలు చేపట్టవచ్చు.
6) పెన్షనర్లకు ప్రభుత్వ బాండ్ల జారీ
పెన్షన్‌తో పాటు ఇవ్వాల్సిన గ్రాడ్యుటీ మొదల్కెన నగదు ఒక్కొక్క పెన్షనర్‌కు ముప్పై లక్షల నుండి 50 లక్షల దాకా యివ్వాల్సి వస్తుందని బడ్జెట్ చాలదని మూడేళ్ళు వయో పరిమితిని పెంచి 61 యేళ్ళు చేయడం జరిగింది. ఇది ఒక తప్పుడు నిర్ణయం. నిరుద్యోగులను నిరాశకు గురి చేసిన నిర్ణయం. ఒక ఉద్యోగి రిట్కెర్డ్ అయితే నలుగురికి ప్రమోషన్లు వస్తాయి.
7) ఒక రిట్కెర్మెంట్‌తో ఐదుగురికి ప్రమోషన్లు
ఉదాహరణకు పదివేలమంది రిట్కెర్డ్ అయితే 40 వేల మందికి ప్రమోషన్లు వస్తాయి. పదివేలమందికి కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. జూనియర్ అసిసెంట్ సీనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్ సూపరిండెంట్‌గా, సూపరిండెంట్ గెజిటెడ్ అధికారిగా, తాహసిల్దార్ ఆర్డీవోగా, ఆర్డీవో డిఆర్‌వోగా ఇలా నాలుగు అంచల్లో ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. రికార్డ్ అసిస్టెంట్, అటెండర్లు అర్హత సాధించిన వారు జూనియర్ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్లు పొందుతారు. ఈ నిచ్చెన మెట్ల ప్రక్రియ ఆగిపోయింది. దాన్ని పునరుద్దరించడం అవసరం.
ప్రభుత్వానికి పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక భారం ఇతర రూపాల్లో భర్తీ చేసుకోవచ్చు. ప్రభుత్వం బాండ్లు జారీ చేసి పెన్షనర్లకు ఇవ్వవచ్చు. ఆ బాండ్లను బ్యాంకుల్లో కుదువబెట్టి పెన్షనర్లు లోన్ తీసుకోవచ్చు.
8) పెన్షనర్లకు భద్రత, ప్రయోజనాలు
బ్యాంకులకు ఆ బాండ్లు గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం లేఖ అందించవచ్చు. ఇలా ఒకేసారి భారం పడకుండా క్రమక్రమంగా ఆ అప్పులు తీర్చవచ్చు. దీనివల్ల పెన్షనర్లకు కూడా గొప్ప సౌలభ్యం ఉంటుంది. పెద్ద మొత్తం నగదు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు యేవేవో చెప్పి గుంజుకోకుండా వారి డబ్బు బ్యాంకులో భద్రంగా ఉంటుంది. వెంటనే నగదుగా మార్చడానికి వీలుండదు. అవసరమైనవాళ్ళు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు ఇవ్వవచ్చు. పెళ్ళిళ్ళు చేయవచ్చు. పిల్లలను చదివించుకోవచ్చు. ఇలా రిజర్వు బ్యాంకు అనుమతితో పెన్షనర్లకు ప్రభుత్వ బాండ్లను విడుదల చేయవచ్చు.
9) ప్రజల్లో పొదుపు ఉద్యమం
అలాగే ప్రజల పొదుపును ప్రోత్సహించి ప్రభుత్వానికి ఆర్థిక వనరులను చేకూర్చుకోవడానికి ఫోస్టాఫీసులో కన్నా ఒక శాతం అధిక వడ్డీతో బాండ్లను జారీ చేసి వేల కోట్లను ప్రజలనుండి సేకరించ వచ్చు. తద్వారా ప్రజల్లో పొదుపు చేసే దృష్టి పెరుగుతుంది.
10) నిరుద్యోగ యువకులకు లోన్లు
నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పన కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లకు కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున ప్రతి శాఖకు వెంటనే బడ్జెట్లు కేటాయించడం అవసరం. తద్వారా ఐదు, పది లక్షల మంది నిరుద్యోగులకు, నిపుణులకు చేయూతనిచ్చి సంపద పెంచడంలో కృషి చేయవచ్చు.
11) ఉద్యమకారుల సేవలు వినియోగించుకోవాలి
తెలంగాణ ఉద్యమకారుల సేవలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఉద్యమకారుల నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నదనే ఒక గొప్ప స్ఫూర్తిని ప్రజలకు అందించాల్సి ఉంది. అందువల్ల ఉద్యమకారులను వివిధ రంగాల్లో నామినేటెడ్ పదవులలో నియమించడం అవసరం. ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలు పోటీచేసి ఎన్నిక కాలేకపోయారు. నామినేటెడ్ పదవులలో వారిని నియమించి ఆ లోటును భర్తీ చేసి, అన్ని సామాజిక వర్గాలకు తగు ప్రాధాన్యత ఇవ్వబడిరది అనే విశ్వాసం ప్రజల్లో కలిగించడం అవసరం. ముఖ్యంగా ముదిరాజ్, గంగపుత్ర, రజక, నాయీబ్రాహ్మణ, పద్మశాలి, విశ్వకర్మ, యాదవ, కురుమ వంటి అధిక జనాభా గల సామాజిక వర్గాలతో పాటు ఎంబీసీ కులాల వారిని వివిధ స్థాయిల్లో నియామకాలు చేపట్టి సామాజిక న్యాయం అందించడం అవసరం. జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థలు వంటి జిల్లాస్థాయి నియామకాలు కూడా ఎన్నో రంగాలలో నియామకపు అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా గ్రంథాలయాలు, పుస్తకాలు కొనడం లేదు. గత ఐదేళ్ళ నుండి అచ్చయిన రచయితల పుస్తకాలను ఐదు వందల కాపీలు చొప్పున ఫిబ్రవరి చివరి వారంలోగా కొని రచయితలకు ప్రోత్సాహం అందించడం అవసరం.
12) తెలంగాణ సంస్కృతి, భాష, పాఠ్య పుస్తకాల పునర్నిర్మాణం
తెలంగాణ సాహిత్య అకాడమి, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ, తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం తదితర సంస్థల ద్వారా తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్యం అభివృద్ధికి నూతన ప్రణాళికలు, నూతన నాయకత్వం ఎంతో అవసరం. పాఠ్యపుస్తకాలు రాసి పదేళ్ళవుతున్నది. వెంటనే నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనకు పెద్ద ఎత్తున కమిటీలను ఏర్పాటు చేసి ఇంతదాకా నిర్లక్ష్యానికి గురైన విద్యావంతులను, మేధావులను, సాహితీవేత్తలను, ఆ కమిటీలలో తీసుకోవడం అవసరం. ఒకటో తరగతి నుంచి డిగ్రీదాక అన్ని పాఠ్య పుస్తకాలను సమూలంగా, శాస్త్రీయంగా రూపొందించి మే నెలలో ప్రింట్కె అందుబాటులోకి వచ్చేవిధంగా తక్షణ చర్యలు చేపట్టడం అవసరం.
తెలంగాణ ఉద్యమ చరిత్ర పునర్నిర్మాణం, ఆవశ్యకత
తెలంగాణ ఉద్యమ చరిత్రను సమగ్రంగా పునర్నిర్మాణం చేయడానికి ఉద్యమ కారులతో, తెలంగాణ చరిత్రకారులతో, జర్నలిస్టులతో వెంటనే కమిటీ వేయడం అవసరం.
-బి.ఎస్.రాములు
సామాజిక తత్వవేత్త.
బీసీ కమిషన్ తొలి చైర్మన్,
తెలంగాణ – 8331 966 987.





