‘‘తినడానికి తిండి దొరకక చెట్ల ఆకులను తింటున్న మనుషులు. తన పిల్లల కడుపు నింపడానికి మురికిని వండిన ఓ తల్లి..’’ -ఇది సినిమాలోని సన్నివేశం కాదు. సూడాన్ దేశంలో ప్రస్తుత వాస్తవ పరిస్థితికి నిదర్శనం.
ఆధిపత్య పోరే కారణం: ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణం..వీరిలో ఒకరు సుడానీస్ మిలటరీ అధిపతి జనరల్ అబ్దెల్ ఫత్తా బుర్హాన్ కాగా, మరొకరు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు అధిపతిగా ఉన్న మహ్మద్ హమ్దాన్ దగాల. ఈ ఆధిపత్య పోరు ఏప్రిల్ 2023లో పెద్ద ఎత్తున సంఘర్షణగా మారి సూడాన్ పౌరులు తీవ్ర కరువు కోరల్లో చిక్కడానికి కారణమయింది. ఈ సంఘర్షణలో కనీసం 15,500 మంది మరణించారని అంతర్జాతీయ నివేదికలు తెలుపు తున్నాయి. గత పద్నాలుగు నెలల నుండి జరుగుతున్న విధ్వంసకర సంఘర్షణ, పెరుగుతున్న ప్రజల స్థానభ్రంశం, నిధులలో అంతరాయంతో పాటు మానవతా సహాయం అందుబాటుపై వీరి తీవ్రమైన ఆంక్షలు మూలంగా సూడాన్‌లోని పంట ఉత్పత్తి ప్రాంతాలైన డార్ఫర్, కోర్డోఫాన్, ఖార్టూమ్, అల్జజీరా ప్రాంతాలలో అత్యంత ఘోరమైన కరువు తాండవిస్తుంది.
వ్యాపార మార్కెట్లు, మానవతా సహాయ గిడ్డంగులను దోపిడీ చేయడం ఆహార కొరతకు మరింత దోహదం చేసింది. సంఘర్షణ మూలంగా సూడాన్లో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఊహా తీతమైన నిష్పత్తిలో ఆకలి సంక్షోభం ఉంది. సూడాన్ తీవ్ర స్థాయిలో ఆహార అభద్రతను ఎదుర్కొంటోంది. ప్రతిరోజూ లక్షలాది ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోట్లాది ప్రజలకు తగినంత ఆహారం అందుబాటులో లేదు. వ్యవసాయోత్పత్తిపై ప్రభావం చూపుతోంది. వేలాది మంది రైతులు మరణిస్తున్నారు. ఆహార వ్యవస్థలు దిగజారాయి.ఆహార మార్కెట్లు ఖాళీగా ఉంటున్నాయి. అధిక ఆహార ధరలు, తక్కువ కొనుగోలు శక్తి మానవతా అవసరాలను పెంచుతున్నాయి. పంటలు పండిరచగల ప్రజల సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది ఇంధన ధర పెరుగుతోంది. దక్షిణ సూడాన్‌లో అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజల ఆదాయాలపై ప్రభావం చూపింది. సుడాన్ ‘‘బ్రెడ్‌బాస్కెట్’’, అల్ జాజిరా రాష్ట్రానికి సంఘర్షణ విస్తరించడం వలన ఐదు లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. గత సంవత్సరంలో చాద్‌కు వచ్చిన ఆరు లక్షలతో కలుపుకొని చాలా మంది ప్రజలు సుడాన్ నుండి పొరుగు దేశాలకు పారిపోయారు. ఇప్పుడు సూడాన్ పొరుగు దేశాలు పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం,సరిహద్దుల్లో సంఘర్షణల ప్రమాదం రెండిరటినీ ఎదుర్కొంటున్నారు.
మానవతా సంక్షోభం: సూడాన్ సంఘర్షణకు ముందే దీర్ఘకాలిక రాజకీయ అస్థిరత, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా 1.58 కోట్ల మందికి మానవతా సహాయం అవసరమైంది. సంఘర్షణ చెలరేగడానికి ముందే విపరీతమైన వాతావరణ విపత్తులు, సామాజిక, రాజకీయ అశాంతి, పేదరికం, ఆకలి, పెరుగుతున్న ఆహార ధరల కారణంగా సుడాన్ మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంఘర్షణ ఈ పరిస్థితులను మరింత తీవ్రతరం చేసింది. దాదాపు వీరి సంఖ్య సూడాన్ జనాభాలో (2.50 కోట్ల ) సగానికి పైగా అవసరంలో ఉన్నారు. ఏప్రిల్ 2023 నుండి జరిగిన క్రూరమైన సంఘర్షణ కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయేలా చేసింది. జూన్ 2024 నాటికి స్థానభ్రంశం చెందిన వారి సంఖ్య దాదాపు 1.2 కోట్లకు చేరుకుంది.
పిల్లలు పరిస్థితి ఘోరం: ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (ఐపిసి) గణాంకాల ప్రకారం సూడాన్‌లో 1.64 కోట్ల మంది పిల్లలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కుంటున్నారు. వీరి సంఖ్య గత ఆరు నెలల్లో రెట్టింపు అయింది. దాదాపు 75% మంది పిల్లలు ఇప్పుడు రోజువారీ ఆకలితో అలమటిస్తున్నారు. పిల్లలలో పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. సుమారు 25 శాతం మంది ఎత్తుకు తగిన బరువు లేరు.
సేవ్ ది చిల్డ్రన్ అంచనా ప్రకారం ఇది డిసెంబర్‌లో 83.36 లక్షల నుండి 1.635 కోట్ల మంది పిల్లలకు పెరిగింది. తగినంత ఆహారం లేకపోవడం పోషకాహార లోపానికి దారితీస్తుంది. ఇది పిల్లల ఆరోగ్యం అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపించడమే కాకుండా కొన్ని పరిస్థితుల్లో చావుకు కూడా కారణం కావచ్చు. పెద్దల పరిస్థితి: సూడాన్ దేశవ్యాప్తంగా గ్రేటర్ డార్ఫర్, సౌత్ నార్త్ కోర్డోఫాన్, బ్లూ నైల్, అల్జాజిరా, ఖార్టూమ్‌లతో సహా పది ప్రాంతాలలో 7.55 లక్షల ప్రజలు ఐదవ దశ విపత్తు పరిస్థితులలో ఉన్నారని ఐపిసి చెప్తుంది. ఈ పద్నాలుగు ప్రాంతాలలో నివాసితులు, యుద్ధ భాదితులు, శరణార్థులను కరువు ప్రమాదం బెదిరిస్తుంది. వీరిలో 3.55 లక్షల మంది పిల్లలు ఉంటారని సేవ్ ది చిల్డ్రన్ అంచనా వేసింది. డిసెంబరు 2023లో విడుదల చేసిన మునుపటి ఐపిసి నివేదికతో పోల్చితే తాజా నివేదికలు ఆహారభద్రత పరిస్థితి పూర్తిగా వేగంగా క్షీణించడాన్ని సూచిస్తున్నాయి.
అక్టోబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 తో పోల్చితే ఐపిసి మూడవ దశ వ్యక్తులు జూన్ నుండి సెప్టెంబర్ 2024లో 1.77 కోట్ల నుండి 2.56 కోట్లకు పెరగనున్నారు. ఐపిసి నాల్గవ దశ (ఎమర్జెన్సీ)లో వ్యక్తుల సంఖ్య 49 లక్షల నుండి 85 లక్షలకు, ఐపిసి ఐదవ దశ (విపత్తు)లో సున్నా నుండి 7.55 లక్షలకు జనాభా పెరుగుదల ఉంది. 2004లో ఐపిసి ప్రారంభమైనప్పటి నుండి సూడాన్‌లో ఐపిసి దశ ఐదో పరిస్థితి నిర్ధారించబడటం ఇదే మొదటిసారి. 1.8 కోట్ల ప్రజలు ( 37 శాతం ) తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. అగ్రస్థానంలో సూడాన్: ప్రతి సంవత్సరం ప్రపంచలో ఏయే దేశాలలో మానవతా సంక్షోభాలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాల్ని విశ్లేషించే అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ యొక్క ఎమర్జెన్సీ వాచ్ లిస్టులో సూడాన్ మొదటి స్థానంలో ఉంది. సూడాన్లో పెరుగుతున్న సంఘర్షణ, సామూహిక స్థానభ్రంశం, ఆర్థిక సంక్షోభం, ఆరోగ్య సంరక్షణ సేవల పతనం కారణంగా సూడాన్ అగ్రస్థానంలో నిలవడానికి కారణాలుగా ఉన్నాయి.
డి.జె మోహనరావు
యం.ఎస్సీ(ఫిజిక్స్) టీచర్,
ఆమదాలవలస,
శ్రీకాకుళం జిల్లా,
ఆంధ్రప్రదేశ్,
8247045230