ఆటోను ఢీ కొట్టిన లారీ
6 గురు వ్యవసాయ కూలీలు మృతి
మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు
బతుకు కోసం వెళ్లి మృత్యువాత పడిన వైనం
మృతుల కుటుంబాలకు సంతాపం, ఎక్స్‌గ్రేషియా
ప్రకటించిన సీఎం కేసీఆర్
మిర్యాలగూడ (నల్గొండ),ప్రజాతంత్ర,మే17 : బతుకుదేరువు కోసం కూలీ పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీల బతుకులు లారీ రూపంలో మృత్యువు కబలించిన హృదయ విచార సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పొందుగుల సమీపంలో బుధవారం తెల్లవారుజాయున చోటుచేసుకుంది. స్ధానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన 23మంది వ్యవసాయ కూలీలు తెల్లవారుజామున ఆంధ్రా రాష్ట్రంలోని పొందుగుల సమీపంలో కూలీ పనుల కోసం ఆటోలో బయలుదేరారు. అయితే పొందుగుల సమీపంలోకి రాగానే వెనుక నుండి వేగంగా వస్తున్న ఒక లారీ వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి.
మిగిలిన 8మందికి స్పల్ప గాయాలతో భయటపడ్డారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్ధలానికి చేరుకుని మృతిచెందిన వారిని పోస్ట్‌మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కు తరలించగా , క్షతగాత్రులను గురజాల ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మృతిచెందిన వారిలో ఇస్లావత్ మంజుల(25), భూక్యా పద్మ (27), పాణియ సక్ర(35), భూక్యా నాని(55), మాలావత్ కవిత (30), ఇస్లావత్ పార్వతి (44)లు ఉన్నారు. మృతి చెందిన కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5లక్షలను ప్రకటించగా గాయాల పాలయిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ స్ధానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు ఫోన్ ద్వారా ప్రమాద వివరాలను తెలుసుకుని మెరుగైన వైద్య సదుపాయాలను అందించి వారికి అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు. బాదిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి సంఘటన స్ధలంకు చేరుకుని మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలపడంతో పాటు మృతిచెందిన కుటుంబాలకు రూ.10వేల చోప్పున 6గురికి రూ.60వేలను ప్రకటించారు.