- కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది
- అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం
- తెలంగాణాలో రాచరిక పాలన
- ప్రజాస్వామ్యం ఖూనీ
- కెసిఆర్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది
- నష్టం జరుగుతుందని తెలిసి తెలంగాణ ఇచ్చాం
- కష్టపడి పనిచేసే వారికే టిక్కెట్లు ఇస్తాం
- అసమ్మతి నాయకులు టిఆర్‌ఎస్, బిజెపీలకు వెళ్లొచ్చు
- తొమ్మిది అంశాలతో వరంగల్ డిక్లరేషన్
- కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ
హన్మకొండ, మే 6, (ప్రజాతంత్ర విలేకరి): ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకు పాలన నడుస్తుందని, రాచరిక పాలనలో రాజు నిర్ణయాలే అమలవుతాయని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతున్నదని ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. శుక్రవారం వరంగల్‌లో జరిగిన రైతు సంఘర్షణ సభకు ఆయన హాజరైనారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హనుమకొండలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్‌కు చేరుకున్న ఆయనకు.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆర్టస్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభ నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత రెండు పర్యాయాలు ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. అయితే యువకులు, ప్రజల బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణాలో పాలన చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని అన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మబలిదానాలు చేసుకుంటే కెసిఆర్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు.
వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏక కాలంలో ప్రతీ రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తుందని ప్రకటించారు. పంటలకు మద్దతు ధర ఇవ్వడమే గాకుండా ఒక్కో ఎకరాకు ఏడాదికి 15వేల రూపాయలు పరిహారం అందజేస్తుందన్నారు. కౌలు రైతులకు కూడా ఈ పరిహారాన్ని వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలో మిర్చి రైతులు తెగుళ్లతో నష్టపోయి ఆత్మబలిదానాలకు సిద్ధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, పత్తి, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం నడుస్తున్నదని అక్కడి రైతులకు వరి ధాన్యానికి క్వింటల్‌కు రూ. 2500లు చెల్లిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అక్కడి విధనాన్నే అమలు చేసి వరి రైతులకు రూ. 2500లు మద్దతు ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిందే అమలు చేస్తుందని వివరించారు. ఎన్నో వాగ్ధానాలతో మోసపూరిత విధానాలతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కి రైతులకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండూ ఒక్కటేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువస్తే టిఆర్‌ఎస్ పార్టీ ఎందుకు విమర్శించలేదని అన్నారు. దీంతో ఆ రెండు పార్టీల విధానం ప్రజలకు అర్థమై ఉంటుందని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలని అన్యాయానికి గురైన ప్రజల కోసం ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకున్న వారికే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే విధానాలు నచ్చని వ్యక్తులు అవసరమైతే ఇతర పార్టీలకు వెళ్లవచ్చని హెచ్చరించారు. పార్టీ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వాదులు బిజెపి, టిఆర్‌ఎస్‌లోకి వెళ్లితే తమకు అభ్యంతరం లేదని ఈ సందర్భంగా అన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం జరుగుతుందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లోపభూయిష్టంగా ఉన్న ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు దుర్భర జీవితాలు గడుపుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆదివాసీల భూములకు పట్టాలిచ్చి ఆదుకుంటామన్నారు. మున్ముందు ఆదివాసీలతో పెద్దఎత్తున సభ ఏర్పాటుచేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతామన్నారు. రైతులు అధైర్యపడకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని రాహుల్‌గాంధీ మరోసారీ భరోసా ఇచ్చారు. దేశంలో నరేంద్రమోదీ విధానాల వల్ల రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారని ఆయన పాలనలో కొద్దిమంది పారిశ్రామిక వేత్తలు మాత్రమే అభివృద్ధి చెందారని విమర్శించారు.
ఈ వరంగల్ డిక్లరేషన్ హామీలను ప్రతీ కార్యకర్త, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి చదివి వినిపించాలని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టం కడితే జరుగుతున్న మోసాన్ని క్షేత్రస్థాయి నుంచి వివరించాల్సిన ప్రతి నాయకుడిపై ఉందన్నారు. ముందుముందు మరిన్ని ప్రజా సమస్య)పై పోరాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపి మధుయాష్కీగౌడ్, షబ్బీర్‌అలీ, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అంజనీకుమార్ యాదవ్, బెల్లయ్య నాయక్, బలరాంనాయక్, పోదెం వీరయ్య, కొండా సురేఖ, గీతారెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు డిక్లరేషన్ అంశాలు ఇలా ఉన్నాయి..
సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం, పసుపు పంటకు భరోసా కల్పిస్తాం, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, క్వింటాల్ వడ్లకు రూ. 2500 మద్దతు ధర, ఏ పంటను ఎంత కొంతమో ముందే చెబుతాం, చెరుకు మద్దతు ధర రూ. 4500, మెరుగైన పంటలకు బీమా కల్పిస్తాం, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, గిరిజనలకు భూమిపై హక్కులు కల్పిస్తాం, భూమి లేని రైతులకు పంట బీమా పధకాన్ని అమలు చేస్తాం, మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరుస్తాం, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, పోడు రైతులకు యాజమాన్య హక్కులు వర్తింపు అయ్యేలా చేస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేల ఆర్ధిక సాయం, ఇందిరమ్మ రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15 వేల ఆర్ధిక సాయం, రైతు భరోసా కింద ఏడాదికి రూ. 10 వేలు ఆర్ధిక సాయం.