రెడ్ల పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందా?

రెడ్లు తప్ప మరే ఇతర కులాల వారికి పాలన చాతకాదా అంటే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటల్లో కాదనే సమాధానం వినిపిస్తున్నది. రెడ్ల నాయకత్వంలోనే ప్రభుత్వాలు సాఫీగా సాగుతాయన్న అభిప్రాయం ఆయన ప్రసంగంలో స్పష్టమవుతుంది.. అందుకే కేవలం కాంగ్రెస్‌లోనే కాకుండా ఇతర పార్టీల్లో కూడా రెడ్ల నాయకత్వమే ఉండాలన్న ఆయన అభిప్రాయం ఇప్పుడు రాష్ట్రంలోని రెడ్డి ఏతర వర్గాల్లో హాట్‌ ‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా రాష్ట్రంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న బిసి వర్గాల వారినుండి ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో దామోదరం సంజీవయ్య, అంజయ్య, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు లాంటి వారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తమ పార్టీ ఉంటుందని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ ‌పార్టీలో ఈ కుల రాజకీయాలేంటని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులే ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. తన మాటలను రేవంత్‌ ‌రెడ్డి వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీ ఎంపి, ప్రచార కమిటీ చైర్మన్‌ ‌మధుయాస్కీ ఈ విషయంలో సరాసరి రేవంత్‌రెడ్డికే బహిరంగ లేఖరాసి తన నిరసన వ్యక్తంచేశాడు.

అసలే కునారిల్లితున్న కాంగ్రెస్‌ ‌పార్టీని పటిష్ఠం చేయాల్సింది పోయి , ఇలాంటి వ్యాఖ్యలు చేయడంద్వారా పార్టీలో విభేదాలు పొడసూపుతాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవంగా ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌సిద్దాంతానికే వ్యతిరేకమని, కాంగ్రెస్‌కు నష్టపరిచే ఈ వ్యాఖ్యలపై వెంటనే మీడియా ముఖంగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన తన బహిరంగ లేఖలో రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెరాస పాలనపైన విసుగెత్తి పోయిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ ‌వైపు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అం‌టేనే రెడ్ల పార్టీ అనే విధంగా పేరు పడిపోవడం పార్టీకి తీవ్ర విఘాతంగా మారుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అధిక సంఖ్యలో ఉన్న బిసి వర్గాలకు ఇది తీవ్ర గొడ్డలి పెట్టుగా మారుతుందని, ఒక విధంగా బిసి వర్గాలను అణగతొక్కాలన్న అభిప్రాయం ఈ మాటల వల్ల వ్యక్తమవుతున్నదని బిసి నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తమ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న రేవంత్‌రెడ్డి మాటల తీరుపై త్వరలో కీలక బిసి నేతలంతా సమావేశమై ఈ విషయాన్ని అధిష్టానవర్గం దృష్టికి తీసుకువెళ్ళాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తున్నది.

ఇలాంటి మైండ్‌ ‌సెట్‌ ఉన్న రేవంత్‌రెడ్డిని ఇలానే వొదిలేస్తే భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీలో క్రమేణ బిసీలకు స్థానంలేకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు ఆ వర్గ నాయకులు. కాగా ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, ఏఐసిసి అధికార ప్రతినిధి బక్క జడ్సన్‌ ‌మరో లేఖలో రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ‘మీరు చేసిన వ్యాఖ్య) నేపథ్యంలో బలహీన వర్గాలకు చెందిన నేను కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇంకా ఎందుకుండాలో చెప్పాలె’అని తన లేఖద్వారా రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అదే విధంగా కాంగ్రెస్‌ ‌పార్టీ రెడ్డి కాంగ్రెస్‌గా మారిందని బండ్ల గణేష్‌ ‌సరాసరి రాహుల్‌ ‌గాంధీకే లేఖ రాశారు. మీ పార్టీ అధ్యక్షుడే తెలంగాణలో పార్టీని బొందపెడుతున్నారని ఘాటుగా లేఖలో రాసారు .. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటి చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఏకంగా గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌పార్టీ అన్ని వర్గాలు, కులాలకు చెందిందని రేవంత్‌రెడ్డిని విమర్శించకుండానే ఆయన మాటలకు సమాధానంగా చెప్పుకొచ్చారు.

ఉమ్మడి అంధ్రప్రదేశ్‌ ‌కాలంనుండి వాస్తవంగా రెడ్లదే డామినేషన్‌. అధికార పదవుల్లో మొదటినుండి వారిదే ఆధిపత్యం.. అయితే ఒకే పార్టీలో ఉన్నప్పటికీ రెడ్లకు వెలమ సామాజిక వర్గాలకు అంతగా పడేదికాదు. అప్పట్లో రెడ్డి వర్సెస్‌ ‌రావు అంటూ పత్రికల్లో హెడ్‌లైన్స్ ‌చోటుచేసుకునేవి. తెలంగాణ ప్రభుత్వం వొచ్చిన తర్వాత ఇప్పుడు బహిరంగంగానే ఈ మాటలు వినిపిస్తున్నాయి. వెలమ సామాజిక వర్గానికి చెందిన వారి అధికారాన్ని రెడ్లు భరించలేకపోతున్నట్లుగా ఆనేక వార్తలు వొచ్చాయి.

అంతెందుకు వోటుకు నోటు సంఘటన సమయంలో రేవంత్‌రెడ్డి రెడ్లందరినీ ఒకే తాటిమీదకు తీసుకురావాలన్న వ్యాఖ్యలు చేసినట్లుగా ఆనాటి పత్రికల్లో వొచ్చిన విషయం తెలిసిందే. అదే రేవంత్‌ ‌రెడ్డి ఇప్పుడు తన మనస్సులో మాటను మరోసారి బహిరంగంగా వ్యక్తచేసినట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. కాకతీయ రాజులు రెడ్లను దూరం చేసుకోవటంవల్లే రాజ్యాన్ని కోల్పోవాల్సి వొచ్చిందంటూ, రెడ్డిరాజుల గొప్పదనాన్ని తెరపైకి తీసుకు రావడం ద్వారా అన్ని పార్టీల్లోని రెడ్లను ఒక గూటికిందకు తీసుకురావాలన్న ఆలోచన కనిపిస్తున్నది. అయితే దీనివల్ల కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే రెడ్లపార్టీ అని, తెరాస అంటే వెలమ పార్టీ అని పేరు వొచ్చే ప్రమాదం కనిపిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీలు కుల రాజకీయాలను పక్కకు పెట్టి అభివృద్ధి ఎజండాతో ముందుకు పోతే రాష్ట్రానికి శ్రేయస్కరమంటున్నారు సామాజికవేత్తలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page