రూ.6150 కోట్లతో జిహెచ్‌ఎం‌సి వార్షిక పద్దు

  • రెవెన్యూ ఆదాయం రూ.3434 కోట్లు
  • రెవెన్యూ మిగులు రూ.634 కోట్లుగా
  • రసాభాసాగా బడ్జెట్‌ ‌సమావేశం
  • పరస్పర విమర్శలతో పలుమార్లు వాయిదా

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌మహానగర పాలక మండలి 2022-23కు గానూ రూ.6150 కోట్ల వార్షిక బ్జడెట్‌ను మంగళవారం మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి ప్రవేశపెట్టారు. జీహెచ్‌ఎం‌సీని సరికొత్త హంగులతో విశ్వనగరంగా మార్చుకునే దిశలో 20222-23వార్షిక బడ్జెట్‌ను రూపొందించినట్లు ఈ సందర్భంగా మేయర్‌ ‌స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌నగర అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనలో ఫలప్రదమైన పురోగతి సాధిస్తుందని మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి తెలిపారు.  జీహెచ్‌ఎం‌సీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ ‌విజయలక్ష్మి అధ్యక్షతన బడ్జెట్‌, ‌సాధారణ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో మేయర్‌ ‌జీహెచ్‌ఎం‌సీ వార్షిక బ్జడెట్‌ను ప్రవేశపెట్టారు. జీహెచ్‌ఎం‌సీలో రెవెన్యూ ఆదాయం రూ.3434 కోట్లు కాగా..వ్యయం రూ.2800 కోట్లు..రెవెన్యూ మిగులు రూ.634 కోట్లుగా చూపించారు. అదే విధంగా మూలధన ఆదాయం రూ. 3350 కోట్లు..మూలధన వ్యయం కూడా రూ.3350 కోట్లుగా పేర్కొన్నారు.

అయితే జీహెచ్‌ఎం‌సీ కౌన్సిల్‌ ‌భేటీ రసాభాసగా సాగింది. కౌన్సిల్‌ ‌సమావేశంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఉదయం భేటీ ప్రారంభం కాగానే బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్ల మధ్య వివాదం నెలకొంది. బడ్జెట్‌ ‌పూర్తిగా ఇల్లీగల్‌ అం‌టూ ఎంఐఎం కార్పొరేటర్లు ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు నినాదాలు చేశారు. దీంతో జీహెచ్‌ఎం‌సీ కౌన్సిల్‌ ‌భేటీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మేయర్‌ ‌రెండు పార్టీల నేతలకు సర్థి చెప్పినా…వినిపించుకోకపోవటంతో టీ బ్రేక్‌ ఇచ్చారు. బ్రేక్‌ ‌తర్వాత ప్రారంభమైనా…జీహెచ్‌ఎం‌సీ కౌన్సిల్‌ ‌సమావేశంలో ఎలాంటి మార్పులేదు.

బీజేపీ కార్పొరేటర్లకు, టీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు మధ్య మళ్లీ వివాదం మొదలైంది. జీహెచ్‌ఎం‌సీని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా జీహెచ్‌ఎం‌సీకి రావటం లేదని ఆరోపించారు. దీంతో కౌన్సిల్‌ ‌భేటీని మేయర్‌ ‌మరోసారి వాయిదా వేశారు. అనంతరం వాడీవేడిగా సాగిన సమావేశాల్లో.. మేయర్‌ ‌ప్రవేశపెట్టిన రూ.6150 కోట్ల 2022-23 వార్షిక బ్జడెట్‌ ఆమోదం పొందింది. భోజనా విరామం తర్వాత మళ్లీ కౌన్సిల్‌ ‌భేటీ అయింది. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. కార్పొరేటర్ల ప్రశ్నలకు జీహెచ్‌ఎం‌సీ అధికారులు సమాధానం ఇచ్చారు. అంతకు ముందు.. సభలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రజా సమస్యలను కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు.

ఈ క్రమంలో తెరాస, భాజపా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. భాజపా కార్పొరేటర్లకు వరికి, గోధుమలకు తేడా తెలియదని తెరాస కార్పొరేటర్లు ఎద్దేవా చేయటంతో.. సభలో గందరగోళం నెలకొంది. తెరాస కార్పొరేటర్‌ ‌కవిత చేసిన వ్యాఖ్యలపై భాజపా కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్దిపై చర్చించకుండా సమావేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని భాజపా కార్పొరేటర్లు పొడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఒకింత ఉద్రిక్తత తలెత్తింది. భాజపా పనికిమాలిన పార్టీ అంటూ తెరాస కార్పొరేటర్‌ ‌కవిత చేసిన వ్యాఖ్యలు సభలో మరింత దుమారం లేపాయి. ఆ వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగిస్తామని మేయర్‌ ‌విజయలక్ష్మి ప్రకటించారు. జీహెచ్‌ఎం‌సీ అధికారుల పనితీరుపై ఎంఐఎం కార్పొరేటర్‌ ‌మాజీ మేయర్‌ ‌మాజీద్‌ ‌హుస్సేన్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టానికి వ్యతిరేకంగా..చాలా ఆలస్యంగా బడ్జెట్‌ ‌సమావేశం పెడుతున్నారని మండిపడ్డారు. చట్టం తెలియకుండా జీహెచ్‌ఎం‌సీ అధికారులు పనిచేస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు.

2021-22 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2600 కోట్లు జీహెచ్‌ఎం‌సీకి కేటాయించిందని.. అందులో ఒక్క రూపాయి కూడా బల్డియాకు రాలేదని ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎం‌సీ ఫైనాన్స్ ‌విభాగం అధికారులు ప్రభుత్వాన్ని ఎందుకు అడగడంలేదని నిలదీశారు. ప్రజల కోసం పనిచేయాలని ఉందా.. లేదా..? అని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా ప్రజలపై భారం వేయడం హీనమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌మొత్తం అంకెల గారడీగా కనిపిస్తుందని విమర్శించారు. ప్రధానంగా అభివృద్ది మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించినట్టు మేయర్‌ ‌వివరించారు. హైదరాబాద్‌ ‌నగర అభివృద్దికి సిటిజన్‌ ‌సమస్యల పరిష్కారానికి ఉపయుక్తంగా ఉండేలా రూపొందించినట్లు తెలిపారు. ‘మూలధనం వ్యయంలో రోడ్ల అభివృద్ది, స్కైవేలు, అండర్‌ ‌పాస్లు , ప్లైఓవర్లు, ప్రధాన రోడ్ల మెయింటెనెన్స్ ‌కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.

గతంలో వొచ్చిన వరదల దృష్ట్యా నాలాల అభివృద్ధిపై ఫోకస్‌ ‌చేస్తున్నాం. వ్యుహాత్మక నాలాల అభివృద్ది పథకం ఎస్‌ఎన్డీపీలో భాగంగా చేపడుతున్న పనులకు రూ. 340 కోట్లు, ఇతర నాలా పనుల నిర్వహణ కోసం రూ.200 కోట్లు.. మొత్తంగా వరద నివారణ కోసం రూ.540 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేయనున్నాం. ప్రజా అవసరాలు తీర్చడం, మౌలిక సౌకర్యాలు కల్పించడం కోసం ఈ బ్జడెట్‌లో పెద్ద పీఠ వేశాం. ఇందుకోసం రూ.146 కోట్లు ఖర్చు చేస్తాం. నగరంలో థీమ్‌ ‌పార్కుల అభివృద్ది కోనసాగుతుండగా.. గ్రీనరీ మరింతగా పెంచడమే లక్ష్యంగా ఈ వార్షిక బడ్జెట్‌లో 332.23 కోట్లతో గ్రీన్‌ ‌బ్జడెట్‌ ‌కేటాయించాం. ప్రతి భోజనంపై రెండు రూపాయల అదనపు భారాన్ని సైతం భరించి నగరంలో అభాగ్యుల ఆకలి తీర్చడం కోసం జీహెచ్‌ఎం‌సీ ప్రణాళికలు సిద్ధం చేసింది’ అని మేయర్‌ ‌వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page