రోజూ పెట్రోల్ ధరలు పెంచుతూ పాపాన్ని రాష్ట్రాలపై…
బీజేపీ ప్రభుత్వానికి పేద, మధ్య తరగతి ప్రజలపై కనికరం లేదు
కేంద్రానికి మంత్రి కేసీఆర్ లేఖాస్త్రం
ప్రజాతంత్ర , హైదరాబాద్: సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గొప్పలు చెప్పే ప్రధాని మోదీ పాలనలో దేశంలో పరిస్థితి సబ్ కా సత్తేనాశ్ అయిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రోజూ పెట్రోల్ ధరలు పెంచుతూ ఆ పాపాన్ని నిస్సిగ్గుగా రాష్ట్రాలపైకి నెడుతున్నారని విమర్శించారు. ఈమేరకు దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలపై బుధవారం కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. ప్రతీ రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాస్తున్నాననీ, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర అసమర్థ విధానాలు అది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోసి పేదల బాధల పట్ల మొసలి కన్నీరు కార్చిన నరేంద్ర మోదీ, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను లెక్క చేయకుండా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి నాళ్ల నుంచే తన చేతకానితనం, తమకు అస్సలు తెలియని ఆర్థిక విధానాలతో ప్రజలను కేంద్ర ప్రభుత్వం పీడించుకుని తింటున్నదని వ్యాఖ్యానించారు. తాను కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి అడ్డూ అదుపూ లేకుండా రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, ఆకాశాన్ని దాటి అంతరిక్షానికి చేరుకుంటున్న నిత్యావసర వస్తువుల ధరలే కారణమని స్పష్టం చేశారు.
ధరలను అదుపు చేయడం చేతగాని మోదీ ప్రభుత్వం అందుకు కారణాలుగా చెబుతున్న అంశాలన్నీ శుద్ధ అబద్ధాలేనని స్పష్టం చేశారు. పేద మధ్య తరగతి ప్రజలంటే మోదీ ప్రభుత్వానికి కనికరం లేదనీ, ఇందుకు కరోనా సమయంలో పెంచిన ఎక్జైస్ సుంకమే సాక్ష్యమన్నారు. 2014లో సుమారు రూ.70.51 ఉన్న పెట్రోలు, రూ.53.76గా ఉన్న డీజిల్ ధరలను క్రమంగా పెంచుతూ ఈ రోజుకి పెట్రోల్‌ను రూ.118.19కి, డీజిల్‌ను రూ.104.62కు పెంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుని నడ్డి విరిచిందని ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో విమర్శించారు.