- అమిత్ షా, నిర్మలా సీతరామన్‌లతో భేటీ
- రాష్ట్ర సమస్యలపై ఇరు నేతలతో చర్చలు
న్యూ దిల్లీ, మార్చి 30 : ఏపి సీఎం జగన్ దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం దిల్లీ చేరుకున్న ఆయన రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. నిజానికి నేటి ఉదయం వరకూ నిర్మల అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో జగన్ నేటి ఉదయం 9:30కే విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె సడెన్‌గా అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో తన ప్రోగ్రాంను మార్చుకుని నిర్మలతో జగన్ భేటీ అయ్యారు. వీరిద్దరి భేటి 40 నిమిషాల పాటు సాగింది. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హా, పోలవరం నిధుల విడుదలపై కూడా సమావేశంలో చర్చించినట్టు సమాచారం. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకున్నారు.
గురువారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన సమావేశమవుతారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ… అనూహ్యంగా బుధవారం రాత్రే అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఖరారైంది. రాత్రి 11 గంటల వరకు అమిత్ షా పిలుపుకోసం సీఎం వేచి చూశారు. రాత్రి 11 గంటలకు పిలుపు రావడంతో హోంమంత్రి నివాసానికి వెళ్లి ఆయన చర్చలు జరిపారు. అర్ధరాత్రి 11.40 గంటలకు భేటీ ముగించుకుని బయటికి వచ్చారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై అమిత్ షా సీఎం వద్ద ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో… ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర సహకారం అవసరమని, పెండింగ్ నిధులతోపాటు గ్రాంట్లు విడుదల చేయాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశంకానున్నారు. 15 రోజుల వ్యవధిలో జగన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 17వ తేదీన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన చర్చలు జరిపారు.