ఫాసిజం విధానాలను అమలు చేస్తున్న పాలకులు

  • భారతీయ ప్రసిద్ధ రచయిత్రి అరుంధతి రాయ్
  • ప్రధాని అయ్యాక కార్మికుల హక్కులను అణిచివేస్తున్న మోడీ
  • ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ కార్యదర్శి క్లిస్టన్ డి.రాజోరియో

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : దేశంలో నిజాయితీ లేని మనుషులను తయారు చేయడమే లక్ష్యంగా ఫాసిజం విధానాలను పాలకులు అమలు చేస్తున్నారని భారతీయ ప్రసిద్ధ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత అరుంధతి రాయ్ అన్నారు. సమాజంలో ఫాసిస్టు విధానాలే సరైనవనే వాదన వినిపించేందుకు నియంతృత్వాన్ని కూడా ప్రత్యేక ఉద్యమంలా తీసుకెళ్తున్నారని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆమె ఘాటుగా విమర్శించారు. మానవ హక్కుల వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ కె.బాలగోపాల్ 13 వ స్మారకోపన్యాసం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. వేదిక కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, సుధా అధ్యక్షతన జరిగిన ఈ సభలో అరుందతీ రాయ్ ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు నియంతృత్వ విధానాలకు కుల, మతాలను జోడిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో లక్షలాది మంది ప్రజలను రోడ్లపై నడవడానికి కూడా అనుమతి లేకుండా చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వంలో పరోక్షంగా భాగస్వామి కావడం వల్లనే ఎనిమిదేళ్ల కాలనికే అదాని 8 బిలియన్ డాలర్ల నుంచి 139 బిలియన్ డాలర్ల ఆదాయానికి ఎదిగాడని తెలియజేశారు. ఇదే వరుసలో రానున్న రోజుల్లో అమిత్ షా కుమారుడు రానున్నట్టు చెప్పారు. 2014 లో అదాని విమానంలో వచ్చిన మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారన్నారు. అదాని అనే వ్యక్తి ప్రభుత్వానికి చెందిన వ్యక్తిగా ఫోకస్ చేయడం కోసమే అదాని విమానం ద్వారా వచ్చారని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో బీఎండబ్ల్యూకి ఎడ్లబండికి పోటీ నడుస్తోందని వ్యాఖ్యనించారు. బీఎండబ్ల్యూ అన్ని ప్రాంతాల్లోకి వెళ్లడం సాధ్యం కాదన్నారు. కానీ, ఎడ్లబండి ద్వారా అన్ని ప్రాంతాలకు వెళ్లవచ్చన్నారు. అందుకు సామాజిక, విప్లవ శక్తులు మరింత అంకుఠిత దీక్షతో ప్రజల మధ్య పనిచేయాలన్నారు.

The rulers who were implementing the policies of fascism

బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తులను ఆర్మీలో ప్రవేశిండానికే ఆర్మీలో నాలుగేళ్ల సర్వీసు విధానాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత ఆర్మీలో పనిచేసిన వారంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో సైనికులుగా రిక్రూట్ చేసుకుంటూ ఫాసిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. హిందూ, ముస్లీం మహిళలను మరింత అణిచివేసేందుకే హిజాబ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ కార్యదర్శి క్లిస్టన్ డి.రాజోరియో మాట్లాడుతూ మోడీ అనే వ్యక్తి ఫాసిజం భావజాలానికి ఫేస్ లాంటి వాడన్నారు.

మోడీ ప్రధాని అయ్యాక దేశంలో కార్మికుల హక్కుల మరింత అణిచివేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పీయూసీఎల్ నాయకులు మిహిర్ దేశాయ్, హెస్ఆర్ఎఫ్ నాయకురాలు జాహా ఆరా, మానవ హక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల కన్వీనర్ జీవన్ కుమార్, సంపాదకులు రామచంద్రమూర్తి, పీవోడబ్ల్యూ జాతీయ కార్యదర్శి సంధ్య, సామజిక కార్యకర్త సజయ, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో బాలగోపాల్ రచించిన కోర్టు తీర్పులు సామాజిక న్యాయం అనే పుస్తకాన్ని అరుందతీ రాయ్ ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page