‌ప్రతిపక్ష పార్టీల సభలపై అధికార పార్టీ దాడులు ..

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా కొన్ని మాసాల వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ వేడి రాచుకుంటోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను విస్తృతం చేశాయి. ఇంటింటికని ఒకరు, గడప గడపకని ఒకరు, పల్లెలు పట్టణాలని కాకుండా వీధి సమావేశాలు, కార్నర్‌ ‌మీటింగ్‌లని, బహిరంగ సభలని ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో వేడి రగిలించేస్తున్నారు. ముఖ్యంగా అధికార బిఆర్‌ఎస్‌ను టార్గెట్‌ ‌చేస్తూ రెండు జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌లు తమ అధిష్ఠానం కనుసన్నల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇటీవల రాహుల్‌గాంధీ ‘భారత్‌ ‌జోడో’ పేరున దేశవ్యాప్త పర్యటన చేసిన విషయం తెలియందికాదు. ఆయన యాత్ర  విజయవంతమైందని .. ఈ సందర్భంగా దేశంలోని ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను తాను అవగాహన చేసుకున్నానని, చాలా విషయాలు తనను కదిలించివేశాయని ఆయన పార్లమెంటు సాక్షిగా వివరించిన విషయం తెలిసిందే. అయితే ఆయన యాత్ర కొనసాగింపుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ తమ సొంత• ప్రణాళికతో ప్రజలతో మమేకం అయ్యేకార్యక్రమాలను రూపొందించుకున్నాయి.

ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు పన్నెండు, పదమూడు రోజులపాటు దాదాపుగా పద్నాలుగు నియోజకవర్గాలను చుట్టబెట్టిన ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఎనుముల రేవంత్‌రెడ్డి మహబూబాబాద్‌ ‌జిల్లా పరకాల పట్టణంలో చేపట్టిన యాత్ర ఘర్షణకు దారితీసింది. కేవలం ఘర్షణలకే పరిమితం కాకుండా దాడులు చేసుకోవడం వరకు వెళ్ళింది. బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేయడమే ఈ అలజడికి కారణమైంది. వాహనాన్ని వేదిక చేసుకుని ప్రసంగిస్తున్న రేవంత్‌రెడ్డిపైకి  టమాటాలు, కోడిగుడ్లు విసరడంతో ఉన్నట్లుండి వాతావరణం వేడెక్కింది. దానికి ప్రతిగా కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలపై రాళ్ళు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభా ప్రాంగణంలోని కుర్చీలను లేవనెత్తి ఒకరిపై ఒకరు విసురుకోవడం, కర్రలతో కొట్టుకోవడంలాంటి చర్యలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇరుపక్షాలవారిని చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ నాయకుల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతునేఉంది. దీనికంతటికీ రేవంత్‌రెడ్డి స్థానిక ఎంఎల్‌ఏలపై ఘాటైన విమర్శలు చేయడం.. పరకాల ఎంఎల్‌ఏల చల్లధర్మారెడ్డి పేరులోనే ధర్మ ఉందిగాని, ఆయనదంతా అధర్మమేనంటూ కించపర్చినట్లు మాట్లాడాన్ని కార్యకర్తలు సీరియస్‌గా తీసుకున్నారు. ఆయనతో పాటు భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డిని కలిపి వీరంతా భూ దందాలు చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్‌ ఈ ‌గందరగోళానికి ప్రధాన కారణమైంది. తనను ఎదుర్కోవటం చాతగాక కార్యకర్తలతో తనపై దాడి చేయిస్తున్నాడని గండ్ర వెంకటరమణారెడ్డి పైన రేవంత్‌ ‌విరుచుకు పడ్డాడు.

ఈ సందర్భంగా ఆయన ఘాటైన పదప్రయోగం చేయడం ఉద్రిక్తతకు కారణమైంది. చెప్పులు మోసేటోళ్ళు, చెంచాలు, సన్నాసులు, హాఫ్‌, ‌ఫుల్‌ ‌బాటిళ్ళకు అమ్ముడు పోయే అడ్డగాడిదను నేనుకాదంటూనే,  దమ్ముంటే తన ముందుకు రావాలని ఛాలెంజ్‌ ‌చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. తనపై అక్రమంగా మోపిన అభియోగాన్ని ఎదుర్కునేందుకు తాను సిద్ధమేనంటూ  గండ్ర వెంకట రమణారెడ్డి ప్రతి ఛాలెంజ్‌ ‌చేయడంతో ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాయే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ పార్టీ భూపాలపల్లి జిల్లాకు చెందిన సీనియర్‌ ‌నాయకుడు గండ్ర సత్యనారాయణ గండ్ర వెంకట రమణారెడ్డి ఛాలెంజీని స్వీకరిస్తూ సమయం, స్థలాన్ని ప్రకటిస్తే రమణారెడ్డిపైన ఉన్న ఆరోపణల చిట్టానంతా తీసుకురావడానికి సిద్ధమని  ప్రకటించడంతో శాంతి భద్రతల సమస్యగా పరిణమించనుందని పోలీసులు జోక్యం చేసుకోక తప్పలేదు. అంబేద్కర్‌ ‌సెంటర్‌లో చర్చకు సిద్ధపడిన  ఇద్దరినీ పోలీసులు  హౌజ్‌ అరెస్టు చేయడంతో వివాదం తాత్కాలికంగా ముగిసినట్లైనప్పటికీ ఈ విషయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులంతా బిఆర్‌ఎస్‌ ‌వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు.

ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్యరావ్‌ ‌ఠాక్రే ఈ సంఘటన బిఆర్‌ఎస్‌ ‌పాలనా విధానానికి అద్దం పట్టేదిగా ఉందని విమర్శించారు. ప్రతిపక్షాలు బహిరంగ సభలు నిర్వహించుకునే అవకాశంలేకుండా దాడులు చేయడం ఎలాంటి ప్రజాస్వామ్యమని ఆయన నిలదీస్తున్నారు. మరో సీనియర్‌ ‌నాయకుడు వి.హనుమంతరావు, పిసిసి వైస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌వినోద్‌రెడ్డి, శాసనసభలో ప్రతిపక్షనేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌పైన ఇలాంటి దాడి జరిగితే ముఖ్యమంత్రి ఇలానే మౌనంగా ఉంటారా అంటూ ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వొచ్చిన వెంకట్‌రెడ్డి తన ప్రసంగంలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని విమర్శించడంతో వెంకట్‌రెడ్డి గో బ్యాక్‌ అం‌టూ బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల నినాదాలకు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ప్రతి నినాదాలు, పరస్పర చెప్పులు విసురుకోవడంతో తనపర్యటన అర్ధాంతరంగానే కోమటిరెడ్డి ముగించుకోవాల్సి వొచ్చింది. కాగా మహబూబాబాద్‌ ‌జిల్లాలో నర్సంపేట, డోర్నకల్‌, ‌మహబూబాబాద్‌ ‌పర్యటనల్లో వైఎస్‌ఆర్‌టిపి అధినేత్రి వైఎస్‌ ‌షర్మిలకు కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురైనాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *