పార్టీ బలోపేతానికి ఐకమత్యం ముఖ్యం

  • అందుకు ఏం చేయడానికైనా సిద్ధం
  • అన్ని స్థాయిల్లో నాయకులు కలిసి నాడవాలి
  • ప్రజాస్వామ్యానికి, సమాజానికి కూడా పార్టీ పునరుజ్జీవనం పొందడం అవసరం
  • కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధినేత్రి సోనియా గాంధీ
  • బాబూ జగ్జీవన్‌ ‌రామ్‌కు కాంగ్రెస్‌ ‌నేతల నివాళి

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌కాంగ్రెస్‌లోని అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా అవసరమని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. పార్టీ పునరుజ్జీవం పొందడం కేవలం తమ కోసం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి, సమాజానికి ముఖ్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటుందని, భయాందోళనలను వ్యాపింపజేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌లో జరిగి కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి సోనియా మాట్లాడుతూ, పార్టీ భవిష్యత్తు మునుపటి కన్నా సవాళ్ళతో కూడినదని చెప్పారు. మన అంకితభావం, దృఢ సంకల్పం, తట్టుకుని నిలబడగలిగే సత్తా కఠిన పరీక్షకు నిలుస్తున్నాయి. మన విశాలమైన సంస్థలో అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా ముఖ్యం అని తెలిపారు. ఐకమత్యాన్ని సాధించడం కోసం ఏం చేయడానికైనా తాను నిశ్చయించుకున్నానని చెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పరాజయం పాలైన నేపథ్యంలో త్వరలో మేధోమథనం జరగబోతుంది. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. దీనిపై సోనియా మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతికి గురి చేశాయని, అత్యంత బాధాకరమని చెప్పారు. తాను ఇతర నేతలతో కూడా మాట్లాడానని, పార్టీని బలోపేతం చేయడానికి సలహాలు తీసుకున్నానని చెప్పారు. పార్టీ ఎదుర్కుంటున్న సవాళ్లను అధిగమిండంలో వారి సలహాలు ఎంతో ఉపయోగపడుతాయని ఆమె అన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలని గతంలో ఆమెకు లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్‌ ‌నేతల్లో గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ ‌శర్మ, మనీశ్‌ ‌తివారీ ఇటీవల సోనియా గాంధీతో మాట్లాడిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌విజయం సాధించే విధంగా నేతలంతా ఐకమత్యంగా ఉండాలని సోనియా గాంధీ చెప్తున్నారు.

ఐక్యత సాధించడం కోసం గతంలో ఆమెకు లేఖ రాసిన 23 మంది నేతలకు కూడా జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల్లో పరాజయానికి ప్రధాన కారణం అంతర్గత కలహాలేనని ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తడంలో ముందుండాలని ఎంపీలకు ఉద్బోధించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసందరముందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో వంటగ్యాస్‌, ‌నిత్యావసర సరుకులు, పెట్రో ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. వ్యవసాయ చట్టాల పేరుతో వందల మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టకుందని ఆరోపించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఇదిలావుండగా, ఉక్రెయిన్‌ ‌నుంచి వొచ్చిన భారతీయ విద్యార్థుల భవిష్యత్తుకు అతి త్వరగా భరోసా కల్పించవలసిన అవసరం ఉందని సోనియా చెప్పారు.

బాబూ జగ్జీవన్‌ ‌రామ్‌కు కాంగ్రెస్‌ ‌నేతల నివాళి
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి ముందు కాంగ్రెస్‌ ‌నేతలు బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌ ఉదాత్తమైననేత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌, ‌రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *