నేనెప్పుడూ నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు

  • సిద్ధిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా..
  • రిస్క్‌ వద్దు…కారుకు వోటెయాలె…
  • నంగునూరు రోడ్‌ షోలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‘నేను ఏనాడు నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు. మీ ఆరోగ్యం గురించే ఆలోచన చేసిన. మీరే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా. మీరు నా కుటుంబ సభ్యులని పని చేశా. నేను ఎప్పుడూ నా స్వార్ధం కూడా చూసుకోలేదు. ఎప్పుడూ సిద్ధిపేటను అభివృద్ధి చేయడం కోసమే పని చేసిన. కొరోనా వొచ్చినప్పుడు కిట్లు, సూదులు, మందులు పంపి మిమ్మల్ని కాపాడుకున్నాను’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తన్నీరు హరీష్‌రావు గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన నంగునూరులో నిర్వహించిన రోడ్డు షోలో మంత్రి హరీష్‌రావు పాల్గొని మాట్లాడుతూ…ఒకప్పుడు నంగునూరు ఎట్లుండే. ఇప్పుడు ఎట్లుంది. డబుల్‌ రోడ్లు, డివైడర్లు, లైట్లతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడంతో ఇప్పుడు నంగునూరు రూపురేఖలే మారిపోయాయన్నారు. మండలంలోని నర్మెటలో 300కోట్ల రూపాయలతో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందన్నారు.
గతంలో ఈ ప్రాంతానికి చెందిన పిల్లలు చదువుల కోసం వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాదుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదనీ, ఇప్పుడు ఏ చదువు కావాలన్నా సిద్ధిపేట దాటి పోవాల్సిన అవసరం లేకుండా చేసినట్లు తెలిపారు. సర్కారు దవాఖానలను కూడా  బాగు చేసుకున్నామనీ,  మోకాలి చిప్పల మార్పిడి, డయాలసిస్‌, ఐసియూ వంటి సౌకర్యాలు కల్పించు కున్నామన్నారు. సిద్ధిపేటలో విద్య, వైద్యం, చదువు, రోడ్లు, మంచి నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించు కున్నామన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కరువు ఏర్పడేది. కూలీ పనులు దొరక్క అవస్థలు పడేవారు. జీవాలకు గడ్డి కొని తెచ్చుకునే దుస్థితి ఉండేది. ఇప్పుడు కూలీలు దొరకని పరిస్థితి. గడ్డి పుష్కలంగా లభ్యమై కాలబెట్టే పరిస్థితికి చేరామన్నారు. కాంగ్రెసోళ్లను నమ్మితే కరెంటు విషయంలో తిప్పలు పడతామనీ, కాంగ్రెస్‌ వొద్దు..రిస్క్‌ వొద్దు..కారుకు వోటు గుద్దాలన్నారు.
దేవుణ్ణి 10 మొక్కులు మొక్కితే కూడా అన్నీ కావనీ, అలాగే కొరోనా వల్ల కొన్ని పనులు కాలేదన్నారు. ముఖ్యంగా ఇండ్ల విషయంలో కొంత అసంతృప్తి ఉందనీ, ఈ ఎన్నికలు కాగానే ఇండ్ల సమస్యపై ప్రత్యేక దృష్టిసారించి ఇల్లు లేని వారిని గుర్తించి పక్కా ఇల్లు కట్టిస్తానన్నారు. రుణమాఫీ 75 శాతం అయింది. మిగిలిన 25 శాతం త్వరలో చేస్తామన్నారు. కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి ఇన్నేళ్లు ప్రభుత్వం చేసిన పనులను వివరించాలన్నారు. సోషల్‌ మీడియాలో వొస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండిరచాలన్నారు. సిద్ధిపేట ప్రజలు సరిహద్దు నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేయాలన్నారు. తాను ఏమేం చేశానో ప్రజలకు తెలుసునని, ప్రజలకేం కావాలో తనకు తెలుసునని, ఆత్మ విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం వొద్దనీ, లక్ష వోట్ల మెజారిటీని కాపాడుకుందామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ రోడ్‌ షోలో నంగునూరు జడ్పిటిసి సభ్యురాలు తడిసిన ఉమా వెంకట్‌రెడ్డి, బిఆర్‌ఎస్‌ నేతలు దువ్వల మల్లయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, కోల రమేష్‌గౌడ్‌, ఎడ్ల సోమిరెడ్డి, లింగంగౌడ్‌, కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *