అమరావతి, మార్చి 28 : ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం జగన్ ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీలో ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారంవిజయవాడ విమానాశ్రయం నుంచి జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఈ నెల 17న ప్రధానితో ఏపీ సీఎం భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రెండు వారాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఎవరెవరని కలవబోతున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నిన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో జగన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఏపీ బ్జడెట్ తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం జగన్ ఢిల్లీ వెళతారు అని వార్తలు రావడంతో పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.