Take a fresh look at your lifestyle.

నవరత్నాల కింద పేదలకు ఇళ్లు

  • గుంటూరు, ఎన్టీఆర్‌ ‌జిల్లాల పేదలకు అమరావతిలో ప్లాట్లు
  • సిఆర్డిఎ సక్షలో ఏపి సిఎం జగన్‌ ‌నిర్ణయం

అమరావతి, ఏప్రిల్‌ 3 : ‌గుంటూరు, ఎన్టీఆర్‌ ‌జిల్లాలలో ఇళ్ళు లేనివారికి అమరావతిలో ఇంటి పట్టాలు లభించనున్నాయి. నవరత్నాలు పథకం ద్వారా పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్లపట్టాలను ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. లబ్దిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్‌ ‌జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌  అధ్యక్షతన 33వ సీఆర్డీయే అథారిటీ సమావేశం లో ఆమోదం తెలిపారు. న్యాయపర మైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్లస్థలాలు అందివ్వనున్నారు. అమరావతిలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం భాగంగా ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ఇప్పటికే జీవో జారీ అయ్యింది.

ఆ జీవో ప్రకారం అమరావతిలో 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్ల కోసం కేటాయింపు జరగాల్సి ఉంది. మొత్తం 20 లే అవుట్లలో స్థలాలు ఇస్తామంటూ వెల్లడించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి రాజధానిలో ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సర్కార్‌ ‌ప్రయత్నిస్తోంది. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వనున్నారు.  నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడోవిడత కింద వీరికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. మేనెల మొదటివారం నాటికి.. పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఆదేశించారు.

Leave a Reply