దిల్లీ ఐఐటి విద్యార్థి ఆత్మతహత్య
పరీక్షలో తప్పడంతో ఒత్తిడిలో ఘాతుకం
న్యూదిల్లీ,సెప్టెంబర్2 : దిల్లీ ఐఐటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది.మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్‌లో బీటెక్ చదువుతున్న బాధిత విద్యార్థి కొన్ని సబ్జెక్టులు తప్పాడు. దీంతో గత ఆరు నెలల నుంచి హాస్టల్‌లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, ఉరేసుకున్న స్టూడెంట్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. విద్యార్థి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.