Take a fresh look at your lifestyle.

డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ ‌నిరుద్యోగాన్ని తగ్గిస్తుందా ?

ఒక పక్క రోజురోజుకు దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువవుతుంటే, ఉపాధి అవకాశాలను కలిగించే అక్షయ పాత్రలాంటి ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నది. దీని వల్ల యువత ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత ఏప్రిల్‌లో ఓ ప్రైవేటు సంస్థ సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగ శాతం7.83 ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ పర్సంటేజ్‌ ‌రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. కొరోనా తర్వాత,అంతకు ముందుకూడా చాలా వరకు ఐటితోసహా పలు ప్రైవేటు సంస్థలు తమ వ్యయాన్ని తగ్గించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా వేల సంఖ్యలో తమ సిబ్బందిని కుదించివేస్తున్నాయి. దేశ విదేశాల్లోకూడా ఇదే పరిస్థితి. విదేశాల్లో ఉన్నవారైతే తిరిగి స్వదేశం బాట పట్టడంతో ఉపాధికోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య లక్షల్లోకి చేరుకుంటోంది. ఈ పరిస్థితినుండి దేశ యువతను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించలేకపోగా, ఉన్న ఉద్యోగాలకు ఉద్వాసన పలికే చర్యలు చేపడుతోంది. తాజాగా మూడు ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న తమ వాటాలను ఉప సంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఈ దీన్ని బహిరంగ పర్చకున్నా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. దేశంలోని అతిపెద్ద బొగ్గుకంపెనీ అయిన కోల్‌ ఇం‌డియా, ఆసియాలోనే అతిపెద్ద జింక్‌ ‌హిందుస్తాన్‌ ‌జింక్‌ అలాగే రాష్ట్రీయ కెమికల్స్ అం‌డ్‌ ‌ఫెర్టిలైజర్స్ (ఆర్‌ఐటిఇఎస్‌)‌సంస్థల్లోని వాటాలను కనీసం అయిదు నుండి పది శాతం వరకు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. కోల్‌ ఇం‌డియాలో మూడు శాతం వాటాను విక్రయించుకోవడంద్వారా అయిదు వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలనుకుంటోంది. హిందుస్తాన్‌ ‌జింక్‌లో ఎనిమిది శాతం వాటాను విక్రయించడం ద్వారా పదివేల కోట్ల రూపాయలను, ఆర్‌ఐటిఇఎస్‌ ‌లో పది శాతం వాటాను విక్రయించడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను సేకరించుకోవాలనుకుంటోంది. మొత్తం మీద ఈ మూడు సంస్థల్లోని వాటాల విక్రయం ద్వారా 16 వేల 500 కోట్ల రూపాయలను పొందాలనుకుంటోంది.

ఈ మేరకు మేలో జరిగిన క్యాబినెట్‌ ‌సమావేశం దీన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. వాస్తవంగా డిజ్‌ఇన్వెస్టింగ్‌ ‌ద్వారా 2023-24 లో ఆరవై అయిదు వేల కోట్ల రూపాయలను సేకరించాలని ప్రణాళికను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ విషయంలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం తన లక్ష్యాన్ని అధిగమించే దశగానే సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలనుండి వాటాలను విక్రయించుకోవడమన్నది 1996 నుండి దేశంలో విస్తృతమైంది. ఆనాటి ఎన్‌డిఏ ప్రభుత్వం ఏడు ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాను విక్రయించడంతో మొదలైన ఈ ప్రక్రియ నేటి మోదీ ప్రభుత్వం వరకు నిరాటంకంగా జరుగుతూనే ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి క్రమేణ క్షీణిస్తుండడం, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలకు కావాల్సిన నిధులను సేకరించుకోవడానికి ఈ వాటాల విక్రయంద్వారా సొమ్ము చేసుకుంటూ వొచ్చాయి.

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిగా విజృంభించిన కొరోనా తో ప్రపంచ ఆర్థిక పరిస్థితే దెబ్బతిన్నది. భారత దేశం కొంతవరకు తట్టుకోగలిగినా కొరోనాలో ఎదురైన పరిస్థితులను కుదుటపర్చుకోవడానికి ఆర్థిక వనరుల కొరత కొట్టవొచ్చినట్లైంది. దేశం గట్టెక్కాలంటే ప్రభుత్వ రంగ సంస్థల వాటా విక్రయమన్నది కేంద్రానికి తప్పనిసరి పరిస్థితిగా ఏర్పడిందన్నది దీనివల్ల స్పష్టమవుతున్నది.

కేంద్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను అమ్మితే దాన్ని ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతాపార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాని, ఇప్పుడు నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్న బిజెపి ప్రభుత్వం అంతకు మించిన వేగంగా ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి రంగం సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే బిఎస్‌ఎన్‌ఎల్‌, ‌బిహెచ్‌ఇఎల్‌, ‌విద్యుత్‌, ఎల్‌ఐసి, విమానయానం చివరకు రక్షణ విభాగాల్లో కూడా ప్రైవేటు రంగానికి కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచింది. తాను రైల్‌వేలో చాయ్‌ అమ్ముకున్న వ్యక్తిని, దాన్ని ఎట్టి పరిస్థితిలో ప్రైవేటుపరం చేయనని 2014లో చెప్పిన మోదీ క్రమేణ రైల్వేలో విభాగాల వారిగా ప్రైవేటుకు అప్పగించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలుస్తున్నది. అంతేకాదు ప్రైవేటు రైళ్ళకు, రూట్లకు కూడా రంగం సిద్ధమవుతున్నది.

ఇలా దాదాపు అన్ని సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను యాభై శాతానికన్నా తక్కువగా ఉండే విధంగా ఉప సంహరించుకుంటూ పోతున్నది. అంటే భవిష్యత్‌లో ఈ సంస్థలన్నిటిపైన ప్రైవేటు పెత్తనమే ఉంటుందన్నది సుస్పష్టం. తాజాగా వాటాలను ఉప సంహరించుకుంటున్న ఈ మూడు సంస్థల కార్యక్రమం కూడా అయిదు నెలల కాలంలో పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇది నిజంగా దేశానికి ఎట్టి పరిస్థితిలోనూ క్షేమం కాదని ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. దీనివల్ల నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరంగా మారే ప్రమాదమున్నది.

Leave a Reply