టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో జాతీయ పార్టీ ప్రస్తావన ?

బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్న టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం ఈసారి ప్రత్యేకతను సంతరించుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతీ ప్లీనరీలో పార్టీ సాధించిన విజయాలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టబోయే కార్యక్రమాలను వల్లెవేయడం జరుగుతున్నది. కాని, ఈసారి మరో కొత్త అధ్యాయానికి తెరదీయబోతున్నట్లుగా తెలంగాణ ప్రాంత ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలాకాలంగా కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న విషయం తెలిసిందే. దానికి తగినట్లుగా ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా కాంగ్రెస్‌, ‌బిజెపి యేతర పార్టీలకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులనెందరినో స్వయంగా కలిసి మంతానాలు జరుపుతున్న విషయంకూడా తెలియందికాదు. ఒడిశా, దిల్లీ , కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌తదితర రాష్ట్రాల్లోని అధికార, అనధికార పార్టీలుకూడా కాంగ్రెస్‌, ‌బిజెపి యేతర పార్టీల కూటమికట్టే విషయంలో ఒకింత ఆసక్తిగానే ఉన్నట్లుగానే వార్తలు వినిపిస్తున్నాయి.. వీరందరిని ఒక గొడుగు కిందకు తీసుకురావాలన్న కెసిఆర్‌ ‌ప్రయత్నాల్లో భాగంగానే కొత్తగా ఒక జాతీయ పార్టీ ఆవిర్భావం జరిగే అవకాశాలున్నాయన్నది స్పష్టమవుతున్నది. గత కొద్దికాలంగా కేంద్రంతో ఘర్షణ వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కలిగి ఉంది.

రాష్ట్రాల అధికారాన్ని హరించివేస్తున్నదని కేంద్రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్‌, ఆయన మంత్రివర్గం కొంతకాలంగా దుయ్యబడుతున్నారు. నిధుల కేటాయింపు, పథకాల కేటాయింపు విషయంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల పూర్తిగా సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నదంటూ రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ఘోషిస్తూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్‌ ‌వ్యవస్థ, రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం, వ్యవసాయ చట్టాలు, రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానం లాంటి అంశాలతో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తున్నది. జాతీయ స్థాయిలో ఈ అంశాలపై ఉద్యమించేందుకు టిఆర్‌ఎస్‌ ‌సిద్దపడుతోంది. అందుకు జాతీయ స్థాయిలో ఒక పార్టీ ఏర్పాటు అనివార్యం. అది ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల కూటమిగా ఏర్పడుతుందా? దాన్ని కెసిఆరు ఈ సందర్భంగా ప్రకటిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. లేదా నిన్నటివరకు ప్రాంతీయ పార్టీగానే కొనసాగుతున్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించే అవకాశాలున్నాయా? అన్న విషయంలోకూడా చర్చ జరుగుతున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాల్లో కెసిఆర్‌ ‌పూర్తిగా నిమగ్నమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాను జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలంగా పాల్గొంటానని స్యయంగా కెసిఆరే అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఆ విషయంపైన ఇటు రాష్ట్రంలోనూ, అటు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

బుధవారం నాటికి తెరాస పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు కావస్తున్నది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవం జరిపేందుకు టిఆర్‌ఎస్‌ ‌సిద్దమయింది. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో పురుడు పోసుకున్న టిఆర్‌ఎస్‌ ఈ 21 ‌సంవత్సరాల్లో అనేక ఆటుపోట్లను చవిచూసి, గత రెండు ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్నది. రెండు దశాబ్దాల క్రితం కేవలం ఉద్యమ పార్టీగానే ఆవిర్భవించిన తెరాస 2014లో తెలంగాణ సాధన తర్వాత రాజకీయ పార్టీగా మార్పు చెందింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే అంటే 2014లో 63 శాసన సభ స్థానాలను, 11 పార్లమెంట్‌ ‌స్థానాలను గెలుచుకుని అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్‌, ఆ ‌తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో 88 శాసనసభ స్థానాలను గెలచుకోవడంద్వారా తిరుగులేని మెజార్టీని సాధించుకుని అధికారం చేపట్టింది. అధికారంలోకి వొచ్చింది మొదలు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలందుకున్నాయి. తమ పథకాలనే కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలుకూడా అనుసరిస్తున్నాయంటున్న కెసిఆర్‌, ‌జాతీయ స్థాయిలో ప్రజల పక్షాన ఆలోచించే వ్యవస్థ కరువైందంటున్నారు.

అందుకే జాతీయ రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందంటారాయన. గత సంవత్సరం కోవిద్‌ ‌కారణంగా అట్టహాసంగా ఆవిర్భావ దినోత్సవాన్ని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ జరుపుకోలేక పోయింది. అందుకు ఈసారి ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపేందుకు పార్టీ శ్రేణులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు పార్టీ బాధ్యతలను అప్పగించింది. అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించుకునే ఈ జన్మదినాన పార్టీ అధినేత జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై తప్పకుండా ప్రకటన చేస్తారంటూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. అలాగే టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌•, ‌రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ముఖ్యమంత్రిని చేసే అంశం ఎదైనా ఈ సందర్భంగా వెలుగుచూస్తుందన్న ఆసక్తిని పార్టీ వర్గాలు కనబరుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *