హైదరాబాద్‌లో జోరుగా ప్రచారం
ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి, వివేక్‌ల పేర్లు
రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే విషయంలో అప్పుడూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చోటు దక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరుగనున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖాయం అనేది సర్వత్రా చర్చ మొదలైంది. అలాగే వివేక వెంకట్ స్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌లకు కూడా చోటు దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. గతంలో గ్రేటర్ నుంచి రాష్ట్రమంత్రి వర్గంలో ప్రాతినిథ్యం ఉండేది. ప్రస్తుతం లేదు. అయితే, ఎన్నికల్లో గ్రేటర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులెవరూ విజయం చేజిక్కించుకోలేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి రాష్ట్ర మంత్రిపదవి దక్కలేదు. నామినేటెడ్ కేటగిరిలోనూ పలువురు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు.
అందులో విజయశాంతి ఒకరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక.. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ప్రస్తుతం గ్రేటర్‌కు మంత్రి పదవి రావడం ఖాయమనేది, అందులో విజయశాంతి పేరు అధికంగా వినిపిస్తున్నది. ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేశారు. అధికారం వచ్చాక ఏమీ అడగలేదనీ, ఎమ్మెల్సీ పదవిని పిలిచి ఇచ్చారనేది టాక్ ఉన్నది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గం 11 మందితో ఉండగా అందులో ఇద్దరు మహిళలు కొండా సురేఖ, సీతక్కలకు మాత్రమే మంత్రి పదవి లభించింది.
ఉన్న వారిలోనూ 1:3 గా చూసినా మరో మహిళకు మంత్రివర్గంలో చోటుకల్పించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనూ విజయశాంతికి మంత్రి పదవి లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు సినీరంగానికి చెందిన ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల చలనచిత్ర పరిశ్రమ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే దిశగా ప్రయత్నం చేసినట్టుగా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లోని అభిప్రాయం. ఇకపోతే వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లుకూడా వినిపిస్తున్నాయి. రాహుల్ వీరిద్దరికీ హామీ ఇచ్చారని ప్రచారం. అయితే ఎవరెవరు అదృష్టవంతులో ఆదివారం ఉదయానికి తేలనుంది.