భయం, వొత్తిడి లేకుండా ప్రపంచం ముందు దృఢంగా భారతదేశం
బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ
దేశంలో మార్పు తీసుకువొచ్చిన పార్టీ బిజెపి : పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
న్యూ దిల్లీ, ఏప్రిల్ 6 : దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కుటుంబ భక్తి రాజకీయాలు, దేశ భక్తి రాజకీయాలు మన దేశంలో ఉన్నాయని చెప్పారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతోపాటు రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్య 100కు చేరిందని, ఈ తరుణంలో ఈ వేడుకలను జరుపుకుంటున్నామని చెప్పారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా నేడు మనం జనసంఘ్ శకాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఆ రోజుల్లో నూనె దీపాలను పట్టుకుని నడిచినవారిని, ఆ తర్వాత కమలంతో నడుస్తున్నవారిని గుర్తు చేసుకోవాలన్నారు. పార్టీని వైభవోపేతంగా తీర్చిదిద్దడం కోసం మూడు, నాలుగు తరాలవారు తమ జీవితాలను అంకితం చేశారని చెప్పారు. పార్టీ ప్రభుత్వమైనా దేశం కోసం ఏదీ చేయరనే భావన ప్రజల్లో ఉండేదన్నారు. గతంలో ఈ నైరాశ్యం ఉండేదని చెప్పారు. నేడు దేశం మారుతుందని, వేగంగా ముందుకు వెళ్తుందని ప్రతి పౌరుడు గర్వంగా చెబుతారన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత దేశ వైఖరిని ప్రస్తావిస్తూ, నేడు భారతదేశం ప్రపంచం ముందు దృఢంగా నిలిచిందన్నారు.
ఎటువంటి భయం, ఒత్తిడి లేకుండా తన ప్రయోజనాల కోసం భారతదేశం దృఢ వైఖరిని ప్రదర్శిస్తుందని చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో కొందరు విదేశీ నేతలు న్యూఢిల్లీలో పర్యటించి, భారత దేశం జోక్యాన్ని కోరిన సంగతి తెలిసిందే. యావత్తు ప్రపంచం రెండు శత్రు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ప్రపంచం దృష్టిలో భారత దేశం మానవత్వం గురించి దృఢంగా మాట్లాడగలిగే దేశంగా ఉందని మోదీ చెప్పారు. న్యూ దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న వ్యవస్థాపక దినోత్సవాలకు వివిధ దేశాల దౌత్యవేత్తలను కూడా బీజేపీ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించింది. ఇదిలావుంటే ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. రాజ్యసభలోనూ బీజేపీ 100 సీట్ల మార్క్ దాటిందన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్టాల్ల్రో ఒక్క ఎంపీ కూడా లేడని అన్నారు.
బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం బీజేపీపార్టీ కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు రక్త దానం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని కరోల్ బాఘ్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ బీజేపీ పేదల పార్టీ అని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చిన పార్టీ బీజేపీ అని, కొన్ని పార్టీలు.. కుల, మతాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని నడ్డా అన్నారు. బీజేపీ మాత్రమే జాతీయవాద రాజకీయాలు చేస్తోందని, అధికారం కంటే దేశ హితమే తమకు ముఖ్యమని చెప్పారు. కుటుంబ రాజకీయాలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు వారి వారసుల ఎదుగుదల తప్ప ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోవని మండిపడ్డారు. అలాంటి పార్టీలను పూర్తిగా ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు.