ఒక్క రోజు సెల‌వు తీసుకోలేదు…

  • గవర్నర్ పదవి రాజ్యాంగ బ‌ద్ద‌మైన హోదా
  • గౌరవించడం నేర్చుకోవాలి
  • నిద్రలో ఉన్నట్లు నటిస్తున్న వారిని లేపలేము
  • రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక
  • గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్.

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,ఏప్రిల్18: ఏడాది కాలంలో ఒక్క రోజు కూడా సెల‌వు తీసుకోకుండా రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నాను అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ అన్నారు. త‌న త‌ల్లి మ‌ర‌ణించినప్పుడు కూడా కేవలం మూడు రోజులు సెల‌వు తీసుకున్నాన‌ని చెప్పారు. కావాలంటే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ను ప‌రిశీలించుకోవ‌చ్చ‌ని అన్నారు. నేను స‌మ‌ర్థురాలిని అని గుర్తించే న‌న్ను కేంద్రం రెండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించింది అని జోక్ చేశారు. రాష్ట్ర‌ప‌తి, ప్రధాని, కేంద్ర ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌ నుండీ నాకు పూర్తి మద్దతు వుంది. అందుకే నేను ఇంత శక్తివంతంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అన్నారు. నా తలకు రాయి తగిలి రక్తం కారుతున్నా… వెనకకడుగు వేయను, పనిచేయడంలో వెనుదిరగను, నెరవేర్చాల్సిన బాధ్యతలను నెరవేస్తా అని అన్నారు. రాష్ట్రంలో తాజా అంశాల‌పై ప్ర‌తి నెల కేంద్రానికి రిపోర్ట్ అంద‌జేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ రిపోర్ట్ లో అన్ని అంశాలు పొందుప‌రుస్తామ‌ని తెలిపారు. “నేను ఇచ్చే నివేదికలపై కేంద్రం ఏమి చేయాలో అదే చేస్తుంది. నేను వివరాలు బయటకు వెల్లడించను, వెల్లడించకూడదని” చెప్పారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న అఖిల భారత సర్వీసు అధికారుల విషయంలో కేంద్రం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాజ్ భ‌వ‌న్ నిర్వ‌హించిన ఉగాది వేడుక‌ల‌కు సిఎం, మంత్రులు హాజ‌రుకాలేద‌న్నారు.

రాజ్ భ‌వ‌న్ ఇన్విటేషన్లను(ఆహ్వానాల‌ను) రాజకీయ కోణంలో చూడొద్ద‌ని హిత‌వు ప‌లికారు. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో విభేదించినా, రాజ్ భవన్ కు గౌరవిస్తున్నార‌ని మ‌రోసారి గుర్తు చేశారు. తాను తెలంగాణ గవర్నర్ గా మాత్రమే పని చేస్తున్న‌ట్లు చెప్పారు. తనకు రాజకీయం చెయ్యాల్సిన అవసరం లేదని.. చెయ్యాలనే ఆలోచన కూడా లేదని చెప్పారు. సిఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రుల‌ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు గ్రీటింగ్స్ పంపిస్తున్న‌ట్లు చెప్పారు. పెరియార్, కామ‌రాజు, అన్నా దొరైల మ‌ధ్య‌ సైద్ధాంతికంగా విభేదాలున్నా… క‌రుణానిధి,ఎంజేఆర్ మ‌ధ్య రాజ‌కీయ వైరం ఉన్నా ఎటువంటి గౌర‌వ లోపాలు ఉండేవి కాద‌న్నారు. అలాంటి రాజ‌కీయాలు దేశానికి అవ‌స‌రం అన్నారు. త‌మిళ‌నాడు కొత్త సంవ‌త్స‌రం పుర‌స్క‌రించుకొని పుదుచ్చెరి లెప్ట్ నెంట్ గ‌వర్న‌ర్ గా తాను పంపిన ఇన్విటేషన్ కు ప్ర‌భుత్వ పెద్ద‌లు హాజ‌రైనా… విప‌క్షాలు బాయికాట్ చేశాయ‌న్నారు. పుదుచ్చెరిలోనూ త‌మిళ నేత‌ల‌ ప్ర‌భావం ఉంటుంద‌ని అందువ‌ల్ల కాంగ్రెస్, డిఎంకే, క‌మ్యూనిస్ట్ పార్టీలు హాజ‌రుకాలేద‌ని చెప్పారు. ఇది పూర్తిగా పార్టీల నిర్ణ‌య‌మ‌న్నారు. అందువ‌ల్ల రాజ్ నివాస్ ఆహ్వానాల‌ను గవర్నర్ ఇచ్చిన ఆహ్వానాలుగానే చూడాల‌న్నారు.

త‌మిళి సై, కేసీఆర్ రావొచ్చు, పోవ‌చ్చూ… కానీ రాజ్యాంగ కార్యాల‌యాన్ని గౌర‌వించాలి. అది స‌ర్పంచ్ కార్యాల‌యం అయినా, రాజ్ భ‌వ‌న్ అయినా ఒక్క‌టే అన్నారు. ప్రోటోకాల్ విష‌యంలో నిద్ర‌పోయే వాడిని లేపొచ్చు, కానీ, నిద్ర‌పోయిన‌ట్లు న‌టించే వారిని లేప‌లేమ‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే వింటే, ప్ర‌జ‌ల‌కు నా ద‌గ్గ‌ర‌కు ఎందుకు వ‌స్తారు. కొన్ని సార్లు వ‌స్తారు. నేను మ‌హిళ‌ను కాబ‌ట్టే, కొంద‌రు మ‌హిళ‌లు త‌మ స‌మ‌స్య‌ను చెప్పుకోవ‌డానికి రావ‌చ్చు అని అన్నారు. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డ్డ తామే సుపీరియ‌ర్ అని, కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించింద‌నే కార‌ణంతో గ‌వ‌ర్న‌ర్ ఎవ‌రు అనే భావ‌న స‌రికాదు. కేంద్రం గ‌వ‌ర్న‌ర్ గా ఎవ‌రిని ప‌డితే వారిని నియ‌మించ‌ద‌ని, గవర్నర్ పదవి ఇవ్వడానికి చాలా అర్హతలు చూస్తార‌న్నారు. తాను పొలిటిక‌ల్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చాన‌ని చెప్పారు. అనంత‌రం ప్ర‌జా సేవ‌లో ముఖ్య‌మైన‌ డాక్ట‌ర్ వృత్తిలో సేవ‌లందించాన‌ని, ఇప్పుడు రాజ్యాంగ బ‌ద్ధ హోదాలో ప‌ని చేస్తున్నాన‌ని అన్నారు. “నేను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా. ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటారా?” అని ఎదురు ప్ర‌శ్నలు సంధించారు. ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయుటo త‌న‌ లక్ష్యమ‌న్నారు. గిరిజనుల మంచి కోసం వాళ్ళ ప్రాంతాల్లో పర్యటిస్తున్న‌ట్లు చెప్పారు. 1/70 చ‌ట్టం ప్ర‌కారం గిరిజ‌నుల ప్రాంతాల్లో ప‌నులు చేప‌ట్టేందుకు గ‌వ‌ర్న‌కు ప్ర‌త్యేక అధికారాలున్నాయ‌న్నారు. చ‌త్తీస్ ఘ‌డ్ లోని స‌ల్వాజుడుం దాడుల‌తో తెలంగాణ‌లో త‌ల‌దాచుకున్న గిరిజ‌నుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పారు. నాగర్ క‌ర్నూల్ లోని అట‌వీ ప్రాంతం వాసులు టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ అంశాన్ని త‌న దృష్టికి తెచ్చార‌ని తెలిపారు.

ఈ అంశంపై అధికారుల‌తో చ‌ర్చించాన‌న్నారు. ఏ స‌మ‌స్య అయిన చ‌ర్చ‌ల‌తో ప‌రిష్కారం అవుతుంద‌న్నారు. ఆరు గిరిజ‌న గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్న‌ట్లు చెప్పారు. అందులో 79 శాతం మంది పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నార‌న్నారు. గిరిజ‌న మ‌హిళ‌లు ప‌చ్చ‌ళ్లు మాత్ర‌మే తింటూ ఫైబ‌ర్ ప‌దార్థాలు తీసుకోక‌పోవ‌డంతో 25 ఏండ్ల‌కు హైప‌ర్ టెన్షన్ స‌మ‌స్య‌కు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. ఈఎస్ఐ ఆసుప‌త్రులు ఏర్పాటు చేయాల‌ని కోరాన‌న్నారు. ఆసుప‌త్రుల్లో ప్ర‌స‌వం లేక‌పోతే త‌ల్లి, బిడ్డ మ‌ర‌ణించే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ప్రోటోకాల్ విష‌యంలో ఉగాది, ఉమెన్స్ డే రోజు బ‌హిరంగంగానే మాట్లాడాన‌న్నారు. ఇటీవ‌ల రోడ్డు మార్గంలో భ‌ద్రాద్రి టూర్ బాగా జ‌రిగింద‌న్నారు. అయితే, టూర్ కు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రోటోకాల్ క‌ల్పించ‌లేద‌న్నారు. పూర్తిగా న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతంలో జ‌రిగిన త‌న టూర్ కేవ‌లం ప్రోటోకాల్ తో ముడిప‌డి ఉన్న అంశంకాద‌ని, భ‌ద్ర‌తా కూడా కీల‌క‌మైంద‌ని చెప్పారు. “గ‌తంలో నేను బిజేపిలో ప‌ని చేసిన మాట వాస్త‌వం. కానీ ఇప్పుడు రాజ్యాంగ బ‌ద్ద‌మైన గ‌వ‌ర్న‌ర్ హోదాలో ఉన్నాను. వారు మాత్రం నిన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ లో ఉన్న వ్య‌క్తిని టీఆర్ఎస్ లోకి తీసుకోని ఎమ్మెల్సీ ఇవ్వ‌వ‌చ్చు. మ‌రి అప్పుడు అయ‌న కాంగ్రెస్ ఏజెంట్ కాదా…?” అని ప్ర‌శ్నించారు. అలాంట‌ప్పుడు త‌న విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ ను బిజేపి వ్య‌క్తి అని ఎలా దూషిస్తార‌ని అన్నారు. ఒక వ్య‌క్తిని కానీ, ఒక కార్యాల‌యాన్ని కానీ అవ‌మానించ‌డం ఆరోగ్య‌క‌ర‌మైన అంశం కాద‌న్నారు. విప‌క్షాల‌తో పోరాడాలి కానీ, గ‌వ‌ర్న‌ర్ తో కాద‌ని హిత‌వు ప‌లికారు. గవర్నర్ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య పరస్పరం గౌరవించుకుందామ‌ని సూచించారు. కేంద్రంతో స‌రైన సంబంధాలు లేవ‌ని, గ‌వ‌ర్న‌ర్ ను కేంద్ర మ‌నిషిగా భావిస్తే తానేమి చేయ‌లేన‌న్నారు. అయినా, ఇదో పెద్ద అంశ‌మ‌ని తాను భావించ‌డం లేద‌న్నారు. రాజ్ భ‌వ‌న్, ప్ర‌గ‌తి భ‌వ‌న్ మ‌ధ్య దూరం పెర‌గ‌డాన్ని కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదంటూ వ‌స్తోన్న వార్త‌ల‌న్నీ ఊహాగానాలే అని అన్నారు.

ప్రెసిడెంట్ రేసుపై మాట్లాడను….
రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి రేసులో ఉన్నార‌న్న వార్తలపై స్పందించేందుకు ఆమె నిరాక‌రించారు. “ఈ అంశంపై నేను ఏమీ స్పందించను. నేను ఎప్పుడూ ప్రజలకు, దేశానికి ఏమి చేయాలని ఆలోచిస్తూ వుంటాను” అని అన్నారు.

ధాన్యం కుంభ‌కోణంపై సంబంధిత శాఖ‌కు పంపాను…
ధాన్యం కొనుగోళ్ళపై కుంభకోణంకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత‌ల వినతి ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు. ఆ ఫైల్ ను సంబంధిత సంస్థకు పంపిన‌ట్లు చెప్పారు. ఒక గ‌వ‌ర్న‌ర్ గా ఏ అంశంపై త‌న‌కు ఫిర్యాదు అందినా… దానిపై విచార‌ణ జ‌రుపుతాన‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే, గ‌వ‌ర్న‌ర్ హోదాలో ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చిన‌ట్లు చెప్పారు. గ‌వ‌ర్న‌ర్ రాజ‌కీయం చేస్తున్నార‌ని టీఆర్ఎస్ మంత్రులు, నేత‌లు అనవసరంగా విమర్శిస్తున్నార‌ని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శ‌లు చేయ‌డం మంచిదికాద‌న్నారు. ప్రోటోకాల్ క‌ల్పించ‌క‌పోవ‌డంపై తాను నోరువిప్ప‌డంపై టీఆర్ఎస్ శ్రేణులు త‌న‌ పాత వీడియోలు, ఫోటోల‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశార‌ని గుర్తు చేశారు. ఈ కామెంట్ల‌పై సామాన్యులే కౌంట‌ర్ ఇచ్చార‌ని చెప్పారు. సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డంపై త‌న‌కెలాంటి బాధ‌లేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *