- వైసిపి, టిడిపి నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు
- రాళ్లు, చెప్పులు విసురుకున్న కార్యకర్తలు
- ధ్వంసమైన కార్లు..పలువురికి గాయాలు
అనంతపురం, ఏప్రిల్ 1 : ఏపి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సవాల్‌తో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందుగా సవాల్ చేసుకున్న సమయానికి ఇరువురు శనివారం ఉదయం సత్యమ్మ దేవలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు దాడులు ప్రతిదాడులకు దిగారు. ఈ దాడుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వాహనాలు ధ్వంసమయ్యాయి. తోపులాటలో రఘునాథ్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. అయితే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని సత్తెమ్మ దేవాలయం వద్దకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పుట్టపర్తిలో పాదయాత్ర సందర్భంగా పుట్టపర్తిలో అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీధర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే సత్తెమ్మ దేవాలయంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. శ్రీధర్‌రెడ్డి సవాల్‌ను మాజీ మంత్రి ప్లలెరఘునాథ్ రెడ్డి స్వీకరించారు. శ్రీధర్‌రెడ్డి చేసిన అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రతిసవాల్ చేశారు. సత్తెమ్మ దేవాలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్లలె చెప్పారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి, ప్లలె రఘునాథ్ రెడ్డి ఈరోజు సత్తెమ్మ దేవాలయానికి వస్తున్నారన్న నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ క్రమంలో పల్లె రఘునాథ్ రెడ్డి గృహ నిర్బంధం చేశారు.
ఇంటి నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు. పల్లె ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేను మాత్రం సత్తెమ్మ దేవాలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. ఓవైపు పుట్టపర్తిలో 30యాక్ట్ అమలులో ఉందని.. రాజకీయ కార్యక్రమాలు చేయడానికి వీల్లేదంటూ పోలీసుల చెబుతూనే పుట్టపర్తి ఎమ్మెల్యేకు మాత్రం దేవాలయానికి అనుమతించారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. 30 యాక్ట్ పేరుతో తమ నాయకుడు రఘునాథ్‌రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేకు అనుమతి ఎలా ఇచ్చారని మండిపడుతున్నారు. టీడీపీ, వైసీపీ శ్రేణులు సత్తెమ్మ దేవాలయానికి చేరుకుంటున్న సమయంలో ఇరువర్గాలు చెప్పులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ, టీడీపే నేతల కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. పోలీసులు లాఠీ చార్జి చేసి ఆందోళన సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుతం పుట్టపర్తిలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు స్పష్టం చేశారు.