తెరాస ఇరవై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ఆ పార్టీ ప్లీనరీలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగమంతా బిజెపి, కాంగ్రెస్ లక్ష్యంగానే సాగింది. భారతదేశం శాంతికాముకమైనది. అలాంటి దేశంలో సంకుచిత, ఇరుకైన విధానాలు దేశ శ్రేయస్సుకు గొడ్డలిపెట్టుగా మారాయి. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75 ఏళ్ళ కాలంలో ఎక్కువ కాలం పాలించిన బిజెపి, కాంగ్రెస్‌లు సమర్థవంతమైన పాలనను అందించలేకపోయాయి. అందుకే ఈ రెండు పార్టీలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూనే ఆ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులను హెచ్చరించారు. దేశంలో మతం, కులం పేరుతో కొన్ని పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయంటూ బిజెపి పేరెత్తకుండానే పరోక్షంగా ఆయన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపైన విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారన్నారు. ఏ వస్తువు కొనాలో, ఏది కొనవద్దో, ఎవరి వద్ద కొనాలన్న విషయాల్లో ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నది ప్రజలు ఆలోచించాలంటూ ఇటీవల కర్ణాటకలో హిజాబ్, హలాల్‌పై ఏర్పడ్డ వివాదాలను ఆయన ప్రస్తావించారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం దుర్మార్గం. అమెరికా ఆలానే ఆలోచిస్తే అక్కడున్న 13కోట్ల భారతీయులు ఇండియాకు వొస్తే వారందరికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితిలో మన దేశం ఉందా అన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరముంది.
దేశానికి ఇవ్వాళ కావాల్సింది కత్తుల కోలాటలు, తుపాకుల చప్పుళ్ళు కాదు. దేశ ప్రజలకు కావాల్సింది కరెంటు, సాగునీరు, తాగునీరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్రం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన జాతిపితను దూషణలు చేయడం, ఆయన్ను చంపిన వ్యక్తిని పూజించడం ఎలాంటి సంస్కృతి. ప్రజలను ఎటువైపు తీసుకుపోతున్నారంటూ కెసిఆర్ ఆవేశంగా మాట్లాడారు.
దేశ స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా లభించడంలేదు. డెబ్బై అయిదేళ్ళ పాలనలో కేంద్ర ప్రభుత్వాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు లాంటి మౌలిక వసతులు అందించలేకపోయాయి. సముద్రంలో కలిసి పోతున్న నీరును వడిసి పట్టుకుని వినియోగంలోకి తీసుకువచ్చే కనీస ఆలోచనలను కూడా ఈ ప్రభుత్వాలు చేయలేకపోయాయి. దేశ నదుల్లో నీటి లభ్యత 65వేల టిఎంసి కాగా, అందులో 30 వేల టిఎంసిలను మాత్రమే దేశం వినియోగించుకోవడంలేదంటే అంతకన్నా దౌర్బగ్యం లేదన్నారు. ప్రపంచంలోనే యువ జనాభా అత్యధికంగా ఉన్న దేశం మనది. వారి ప్రతిభా పాటవాలను విదేశాల్లో ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా వెనుకబడిపోతున్నాం. దేశం లక్ష్య రహితంగా ముందుకు పోతున్నది. తన లక్ష్యాన్ని కోల్పోయింది.
అపారమైన ఖనిజ, జల సంపద కలిగి ఉండి, ఇతర దేశాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది. ఇప్పటికైనా సమీక్షించుకోవాల్సిన అవసరముంది. దేశంలోనే తెలంగాణ రోల్ మాడల్‌గా నిలుస్తుంటే, కేంద్రం మాత్రం ఈ రాష్ట్రంపైన సవతితల్లి ప్రేమను కనబరుస్తుందన్నారు. దేశంలో అంధకారం అలమటిస్తున్న పరిస్థితిలో కేవలం ఆరేళ్ళ కాలంలో రెప్పపాటు సమయంకూడా విద్యుత్ లోపం లేకుండా తెలంగాణ ప్రజలకు అందిస్తుంది. ప్రధాని స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా కరెంటు కోతలున్నాయి. కాని, తెలంగాణలో విద్యుత్ కోత అనే విషయాన్నే ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. తెలంగాణలో చేపట్టిన పతకాలు పలువురి ప్రశంసలను అందుకున్నాయి. కనీసం ఆ పద్దతిలో దేశం పనిచేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దె దించాలని కాదు. తమది కేవలం రాజకీయ ఎజండా కాదు. దీనికి ప్రత్యమ్నాయ ఎజండా అవసరమన్నారు.
ప్రగతి పథంలోకి తీసుకుపోయే ఎజండా కావాలన్నారు కెసిఆర్. తెలంగాణ ఏర్పడిన ఈ ఏడున్నరేళ్ళ కాలంలో రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నది. గత ఉమ్మడి రాష్ట్రంలో తరుచూ అమలవుతూ వొచ్చిన కర్ఫ్యూలు, 144 సెక్షన్‌లు, మత ఘర్షణలేవీ లేకుండా సాఫీగా కొనసాగుతున్న పరిస్థితి. ఫలితంగా ప్రపంచ దేశాల్లోని వివిధ పారిశ్రామిక దిగ్గజాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఎవరైనా పరిశ్రమలు స్థాపించాలంటే అక్కడ మౌలిక వసతులతోపాటు ప్రశాంత వాతావరణాన్ని ఆశిస్తారు. అలాంటి వాతావరణం ఇక్కడ ఉండటం వల్లే సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వొచ్చాయి. ఇంకా కొత్తకొత్త పరిశ్రమలు రావడానికి మొగ్గుచూపుతున్నాయి. విశ్వనగరంగా గుర్తింపు పొందుతున్న ఈ హైదరాబాద్‌లో విస్తరిస్తున్న పరిశ్రమల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు
ఏర్పడుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు దశాబ్దాల కిందే ఏర్పడినా, అక్కడ లేని అభివృద్ధి తెలంగాణ కేవలం ఏడున్నర ఏళ్ళలో సాధించింది. ఇలాంటి వాతావరణాన్ని కొన్ని దుష్టశక్తులు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ శక్తులు చూపిస్తున్న తాత్కాలిక ప్రయోజనాలకు భ్రమపడితే శాశ్వత ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.