అనూహ్యంగా అభ్యర్థుల ఎంపిక

ఖాలీఅవుతున్న రాజ్యసభ స్థానాల్లోపై ఆశలు పెట్టుకున్న వారందరినీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశ్చర్యంలో ముంచేశారు. కెసిఆర్‌ ‌వ్యూహాలు ఎవరికీ అంతుబట్టవన్నట్లే ఈ ఎంపిక జరిగింది. ఇటీవల కెసిఆర్‌కు, పార్టీకి సన్నిహితంగా ఉన్నవారిని కాదని ఆయన కొత్తవారిని ఎంపిక చేయడంతో నిన్నటి వరకు ఆ స్థానాలను ఆశించిన వారంతా నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పైకి మాత్రం తమ అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినా తీవ్ర మనస్థాపం చెందుతున్నట్లు తెలుస్తున్నది. నిన్నటి వరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నవారిని పక్కకు పెట్టి కొత్తవారిని అందునా వ్యాపార వేత్తలను తీసుకుకోవడంలో కెసిఆర్‌కు ఏదో దూరాలోచన ఉండే ఉంటుందనుకుంటున్నారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త పార్టీ ఏర్పాటు కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలలో పర్యటించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల నేతలతో సమావేశాలకు వెళ్ళేప్పుడు తెలుగు సినిమా యాక్టర్‌ ‌ప్రకాశరాజ్‌ను వెంట తీసుకు వెళ్ళిన విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో మంచి పలుకుబడి ఉన్న ప్రకాశ్‌రాజ్‌కు కెసిఆర్‌ అం‌తటి ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక్కసారే ప్రకాశ్‌రాజ్‌ ఇమేజ్‌ ‌పెరిగింది. దీంతో తాజాగా ఖాలీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒకటి ప్రకాశ్‌రాజ్‌కు ఖాయమని అందరూ ఊహించారు. ఆయన్ను కేంద్రానికి పంపడం ద్వారా కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న జాతీయ స్థాయి పార్టీకి వివిధ నాయకులతో సంప్రదింపులు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నది కెసిఆర్‌ ‌వ్యూహంగా భావించారు.

కాని, సిఎం ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేకుండా పోయింది. అలాగే మోత్కుపల్లి నర్సింహులు పేరు కూడా. టిడిపిలో ఉన్నంతకాలం చంద్రబాబు మెప్పుకోసం కెసిఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి ఆ తర్వాత కెసిఆర్‌ ‌చెంతకే చేరిన నర్సింహులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని బిజెపి నాయకుడి హోదాలో మెచ్చుకోవడం, కెసిఆర్‌ ఏర్పాటు చేసిన సమావేశాలకు బిజెపిని వ్యతిరేకించి హాజరయ్యాడు. పైగా టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఈ పథకాన్ని ఆయన తెగ మెచ్చుకున్నాడు. దళిత సీనియర్‌ ‌నాయకుడిగా ఆయనకున్న గుర్తింపు వల్ల మంచి పదవినే కట్టబెడతారను కున్నారు. ఇప్పుడు ఏర్పడిన రాజ్యసభ ఖాలీ ల్లో ఏదో ఒకదానిని ఆయనకు ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ, సిఎం ప్రకటించిన ముగ్గురి పేర్లలో ఆయన పేరు కూడా చోటు చేసుకోకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక పోతే రాష్ట్ర రాజకీయాల్లో కెటిఆర్‌, ‌హరీష్‌రావు, సంతోష్‌కుమార్‌ ‌తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా బోయినపెల్లి వినోద్‌కుమార్‌కు గుర్తింపు ఉంది.

ఆయన రాజ్యసభ పదవీ కాలం కూడా త్వరలో ముగియనుండడంతో తిరిగి ఆయన్నే ఎంపిక చేస్తారన్న వార్తలు వొచ్చాయి. కాని అందరి వ్యూహలను కెసిఆర్‌ ‌తలకిందులు చేశారు. ఈసారి కొత్తగా ముగ్గురు వ్యాపారవేత్తలను రాజ్యసభ పదవులకు ఎంపిక చేశారు. వీరిలో ఇద్దరు ఓసిలు కాగా, ఒకరు బిసి. ఎవరూ ఊహించని విధంగా ఎంపికైన బండి పార్థసారథిరెడ్డి హెటిరో డ్రగ్స్ ‌చైర్మన్‌ ‌తో పాటు ఆ కంపెనీకి ఎండిగా ఉన్నారు. ఈ కంపెనీ భారతదేశంలోని డ్రగ్స్ ‌కంపెనీల మొదటి పది కంపెనీల జాబితాలో ఒకటిగా ఉంది. స్యయంగా సైంటిస్ట్ ‌కూడా. అలాగే తెలంగాణ పబ్లికేషన్స్ ‌ప్రైవేటు కంపెనీ పేర టి. న్యూస్‌, ‌నమస్తే తెలంగాణ నడుపుతున్న సిఎండి దీవకొండ రామోదర్‌రావుకు మరో రాజ్యసభ స్థానానికి ఎంపిక చేశారు. అంతకుముందు ఈ రెండు పదవుల్లో కొనసాగిన డి. శ్రీనివాస్‌, ‌కెప్టన్‌ ‌లక్ష్మీకాంతరావు స్థానాల్లోనే వీరిని ఎంపిక చేశారు. వీరిద్దరి పదవీకాలం ఆరేళ్ళు ఉంటుంది. కాగా, అర్థాంతరంగా రాజ్యసభకు రాజీనామా చేయించి బండా ప్రకాశ్‌ను ఎంఎల్సీగా పంపించడంతో ఖాలీ అయిన రాజ్యసభ స్థానంలో వద్దిరాజు రవిచంద్రకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ టికెట్‌ ఇచ్చింది. రవిచంద్ర కూడా వ్యాపార వేత్తే కావడం విశేషం. గాయత్రి గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీస్‌కు చీఫ్‌ ‌ప్రమోటర్‌గా, తెలంగాణ గ్రానెట్‌ ఓనర్స్ అసోసియేషన్‌ ‌గౌరవ అధ్యక్షుడుగా ఉన్న వద్దిరాజు రవిచంద్రను రెండేళ్ళ పదవీకాలం కొనసాగే రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేశారు.

ఈ ముగ్గురిని గెలిపించుకునే విషయంలో తెరాసకు కావాల్సిన నంత బలముండడంతో వీరి గెలుపు ఖాయమంటున్నాయి తెలంగాణ శ్రేణులు. రానున్న సారస్వత, శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కెసిఆర్‌ ‌వీరిని ఎంపికచేసి ఉండవొచ్చనుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాజ్యసభ మాజీ సభ్యులు మందా జగన్నాథం, అజ్మీరా సీతారామ్‌ ‌నాయక్‌తో పాటు పలువురు ఎంత ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page