Take a fresh look at your lifestyle.

అత్యంత వైభవంగా రాములోరి కల్యాణం

  • పులకించిన భదాద్రి
  • పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి
  • పాల్గొన్న చినజీయర్‌ ‌స్వామి, మంత్రి ఇంద్రకరణ్‌, ‌తదితరులు
  • నేడు మహాపట్టాభిషేకం

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 30 : దక్షణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. స్వస్తిశ్రీ చాంద్రనామ శోభకృత్‌ ‌నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి అభిజిత్‌ ‌లగ్నమందు గురువారం నాడు వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. భారీ సంఖ్యలో వొచ్చిన భక్తుల జైశ్రీరాం….నినాదాలతో కల్యాణ మండపం అంతా మారుమ్రోగింది. తెల్లవారుజాము నుండే భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారి కల్యాణ ఘడియలు సమీపించడంతో వారికి కేటాయించిన సెక్టార్లలో కూర్చున్నారు. స్వామివారి కల్యాణం ఆనాడు మిధిలానగరంలో జరిగిన కల్యాణానికి భిన్నంగా జరిగింది. ఆనాడు శివధనస్సు విరిచి దశరథసుతుడు శ్రీరామునికి, మిధిలానగర రాజు జనకుని పుత్రిక సీతకు పెళ్ళి జరుగగా, గురువారం నాడు భదాద్రి క్షేత్రంలో ప్రతీఏటా జగత్‌ ‌కల్యాణం కోసం చతుర్భుజుడు, శంఖుచక్రాలు ధరించిన శ్రీ మహావిష్ణువు అంశగల వైకుంఠ రాముడు ఇక్కడ వరుడు కాగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపురాలు సీతమ్మ వధువుగా కల్యాణం నిర్వహించారు. ఈ ఏడాది శోభకృత్‌ ‌నామసంవత్సరం సీతమ్మవారు జన్మించిన వత్సరం కావడం విశేషం.

శ్రీరాముడు జన్మించిన రోజుకావడం విశేషం. భదాద్రిలో ఈ ఏడాది స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృత్‌ ‌నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఉదయం 10 గంటల నుండి అభిజిత్‌లగ్న శుభ ముహూర్తమున శ్రీపాంచరాత్రగమ విధానంలో శ్రీ సీతారామచంద్ర కల్యాణ మహోత్సవంను శిల్పకళానైపుణ్య సంశోభితమై అలరారు కల్యాణ మండపంలో అంగరంగవైభవంగా జరిగింది. ప్రధాన ఆలయం నుండి ఉత్సవమూర్తులను మంగళవాయిధ్యాలతో వేదమంత్రాలతో ప్రత్యేక పల్లకిపై ఉదయం 10. గంటలకు కల్యాణం జరిగే మండపంకు తోడ్కొని వొచ్చి ధగధగాయమానంగా వెలుగొందే వెండి సింహాసనంపై సీతారాములు, లక్ష్మణ, హనుమంతులను ఆసీనులు గావించారు. తొలుత తిరునాధాన తరువాత విశ్వక్సేన మంత్రాలతో మండపాన్ని శుద్ధి చేసి మంజునకి ప్రథమం అను మంత్రం జపిస్తూ యథాసుదర్శరాజా సంవత్సర్గం శ్రీయుద్యా ఆయుష్మే అనే సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మవారిని కూర్చుండబెట్టి కన్యావరణాలు జరిపించి మోక్షబంధనం ప్రతిసారబంధం, ద్వితీయ, సువర్ణయజ్ఞోర్తితా ధారణలు జరిపించారు. అనంతరం ఆశీర్వచనం పాదప్రక్షాలనం, పుష్పోదకస్నావనం పూర్తి అయిన తర్వాత 10.20 నిమిషాలకు స్వామివారికి వరపూజ నిర్వహించారు.

అనంతరం భక్తరామదాసు చేయించిన ఆభరణాలు అయిన పచ్చలపతకం, శ్రీరామమాడ, చింతాకుపతకం, అమ్మవారికి అలంకరించి, శ్రీరంగనాధుడు పంపిన పట్టువస్త్రాలను అమ్మవారికి, స్వామివారికి అలంకరించారు. అత్తరు, పన్నీరు, దివ్యసుగంధ ద్రవ్యాలు, మంచిగంధం, అగరు, జవ్వారి, కస్తూరి, ఘనసారములతో తయారు చేసిన సుగంధ మాలికలను స్వామివారికి అలంకరించారు. అలాగే తేనే, పెరుగు కలిపిన పంచామృతాలను బంగారు పాత్రలో స్వామివారికి నివేదించిన పిమ్మట నూతన వస్త్రాలంకరణ చేశారు. ఊతబలి పేరుతో పొన్నంను దిష్టితీశారు. లోకపర్యంతమున ఉన్న విశ్వసృష్టిని దానితో నున్న కాలమును, సంకల్పం చెప్పి,11 గంటల 40 నిమిషాలకు కన్యాదానం కరిష్మే అంటూ 12. గంటలకు అభిజిత్‌ ‌లగ్నంలో స్వామివారు అమ్మవారి శిరస్సుపై జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. 12 గంటల 27 నిమిషాలకు మాంగల్యధారణతో కల్యాణం తంతునా భదాద్రి అంటూ చేశారు. అనంతరం భక్తరామదాసు 17వ శతాబ్దంలో చేయించిన మంగసూత్రధారణ జరిగింది. మూడు సూత్రాలు గల ఈ మంగళసూత్రమునకు మొదటి సూత్రము కారణశక్తి గౌరి గాను, రెండవ సూత్రం జ్ఞానశక్తి శారద గానూ, మూడవసూత్రం మనోశక్తి మహాలక్ష్మీగానూ ఆగమశాసనం చెబుతుందని వేదపండితులు మంత్రోచ్ఛారణతో అశేష భక్తజనావళికి వినిపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దంపతుల తరుపున శృంగేరి జగత్‌ ‌గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థస్వామి మరియు రాష్ట్ర దేవాదాయశాఖామాత్యులు సతీసమేతంగా స్వామివారికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు వొచ్చారు. ముత్యాల తలంబ్రాలు సుగంధద్రవ్యాలతో కలిపి సీతారామచంద్రమూర్తులకు తలంబ్రాల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మండపం చుట్టూ గులాల్‌ ‌చల్లి కల్యాణం తంతునా.. అంటూ ముగించారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు వొచ్చిన వేలాది మంది భక్తులు సీతారామచంద్రమూర్తులకు జయజయధ్వానాలు పలకగా కల్యాణం జరిగిన మండపం ఆవరణలో రామనామం మారుమ్రోగింది. కల్యాణం కమనీయంగా, కన్నులపండుగగా జరిగింది.  కల్యాణంను తిలకించేందుకు భక్తులు ఉదయం 3 గంటల నుండే పవిత్ర గోదావరి నదిలో స్నానాలాచరించి, 6 గంటలకే  కల్యాణ మండపానికి చేరుకున్నారు. కల్యాణం తిలకించేందుకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల వాసులతో పాటు ప్రక్క జిల్లాలైన వరంగల్‌, ‌నల్గొండ కరీంనగర్‌తో పాటుగా ప్రక్క రాష్ట్రమైన ఆంధప్రదేశ్‌ ‌నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

అంతేకాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, ‌చత్తీస్‌ఘడ్‌ ‌తదితర ప్రాంతాల నుండి భక్తులు కూడా అధిక సంఖ్యలో స్వామివారి కల్యాణంలో పాల్గొని తిలకించారు. సుదూర ప్రాంతాల నుండి రాలేని భక్తజన కోటి కోసం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వివిద చానల్స్‌లో  ప్రత్యక్షప్రసారం చేశారు. ఇది ఇలా ఉండగా మండపంలో కల్యాణం జరుగుతున్న తీరు ప్రతీ ఒక్కరూ తిలకించాలని ఉద్దేశ్యంతో మండపంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో ప్రత్యేక క్లోజ్డ్ ‌సర్క్యూట్‌ ‌టివిలను పెట్టి భక్తులు ఇబ్బంది పడకుండా కల్యాణంను తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఏడాది జరుగుతున్న సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు కూడా భిన్నంగా ఏర్పాటు చేయడం భక్తుల్లో భక్తి పారవశ్యంను నింపింది. తిరుకల్యాణోత్సవం ఆధ్వర్యంలో ఆధ్వర్యులు స్థానాచార్యులు కె.ఇ.స్థలశాయి, పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది చెన్నకృష్ణమాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌, అమరవాది మురళీకృష్ణమాచార్యులు, అమరవాది వెంకటశ్రీనివాస రామానుజం, కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది శేషగోపాలాచార్యులు కల్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం
భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామకళ్యాణంకు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆనవాయితీగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేసారు. ఆలయం నుండి ద్రువమూర్తులను కల్యాణ మండపం వద్దకు మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని తోడ్కొని వొస్తుండగా తిరుమల తిరుపతి దేవస్ధానం జేఇఓ తులసిప్రసాద్‌, ‌దేవాదాయ ధర్మాదాయ కమీషనర్‌ అనిల్‌కుమార్‌ ‌స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి వేదపండితులకు అందచేసారు. ఈ తంతు ప్రతీఏటా జరుగుతుంది. అలాగే శ్రీశ్రీశ్రీత్రిదండి చినజీయర్‌ ‌స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఒక ప్రక్క కల్యాణం జరుగుతున్నప్పటికి కల్యాణం విశిష్టతను భక్తులకు అర్థమయ్యే విధంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి కల్యాణం విషిష్టతను వివరించారు.

ఈ కార్యక్రమంలో హర్యాన గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ, ఆంధప్రదేశ్‌ ‌శాసన సభ స్పీకర్‌ ‌తమ్మినేని సీతారాం దంపుతులు, రాష్ట్ర దేవాదాయ, దర్మాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణరెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నగేష్‌, ‌భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్‌పి డాక్టర్‌ ‌వినీత్‌, ఎఎస్‌పి, దేవాదాయ కమీషనర్‌ అనీల్‌కుమార్‌, ‌భద్రాచలం తాహసీల్దార్‌ శ్రీ‌నివాస్‌యాదవ్‌,‌దేవస్ధానం ఇఓ రమాదేవి,ఆర్‌డిఓ రత్నమాల తదితరులు పాల్గొన్నారు.

నేడు పట్టాభిషేకం
పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం నాడు స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా నేడు శుక్రవారం స్వామివారికి మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌హాజరుకానున్నారు.

Leave a Reply