అటు ఎండలు, ఇటు రాజకీయ పార్టీలతో వేడెక్కుతున్న తెలంగాణ

తెలంగాణలో భానుడి భగభగలతో రాష్ట్రం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ జిల్లాలో చూసినా నలబైరెండు నుండి నలబై అయిదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం పూట రోడ్లమీదకు రావాలంటేనే భయపడి పోతున్నారు. ఇంత వేడి వాతావరణం కి రాజకీయ పార్టీలు మరింతగా నిప్పు రాజేస్తున్నాయి. జాతీయ పార్టీలు ఒక పక్క, ప్రాంతీయ పార్టీలు మరోపక్క తమ కార్యక్రమాలను కొనసాగిస్తుండడంతో తెలంగాణలో ఇప్పుడు ఓవర్‌ ‌హీట్‌ ‌వాతావరణం నెలకొంది. ప్రధాన జాతీయ పార్టీల అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరుగా తెలంగాణలో పర్యటిస్తుండడంతో ఒక విధంగా ఎన్నికల సందడిని తలపిస్తోంది. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రెండు రోజుల తెలంగాణ పర్యటన గురువారం మొదలైంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రెండవ విడుతగా చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో భాగంగా గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో లక్షమందితో ‘జనం గోస- బిజెపి భరోసా’ పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. అధికార టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం తామేనంటున్న బిజెపి ఇంత పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయడం చూస్తుంటే ఎన్నికలకు సిద్దమవుతున్నదని చెప్పకతప్పదు.

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌గాంధీ కూడా తెలంగాణలో రెండు రోజులపాటు పర్యటించబోతున్నారు. ఆయన పర్యటన శుక్రవారం ప్రారంభం కానుంది. వరంగల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఈ సభ నిర్వహణను కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరో ఏడాదో లేక అంతకు ముందో ఎన్నికలు రాబోతాయన్న ఉద్దేశ్యంగానే ఇక్కడ పార్టీలు కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాయి. వరంగల్‌లో రాహుల్‌ ‌సభకూడా అందులో భాగమే. గత కొంతకాలంగా రాష్ట్రంలో రైతాంగసమస్యలు రాజకీయ పుంతలు తొక్కిన విషయం తెలియందికాదు. అదే సమస్యను ప్రధానాంశంగా తీసుకుని కాంగ్రెస్‌ ఈ ‌సభకు‘ రైతు సంఘర్షణ సభ’గా నామకరణం చేసింది. అంతేకాకుండా ఈ సభ ముఖంగా నూతన వ్యవసాయ విధానాన్ని రాహుల్‌ ‌ప్రకటించే అవకాశముంది. రాహుల్‌ ‌ప్రకటించే ఈ నూతన వ్యవసాయ విధానం ప్రభుత్వానికి కనువిప్పు తెచ్చేదిగా ఉంటుందంటున్నారు కాంగ్రెస్‌ ‌నాయకులు. తెరాస ప్రభుత్వం ఇంకా మూర?ంగా తన విధానాన్నే కొనసాగించిన పక్షంలో, ఎలాగూ తమ ప్రభుత్వం అధికారంలోకి వొస్తుంది కాబట్టి, అప్పుడు నేటి డిక్లరేషన్‌ను యధావిదిగా అమలు పరుస్తామన్న భరోసాను ప్రజలకు కల్పించే ప్రయత్నం చేస్తోంది.

అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధులతో కలిసి విద్యా, నిరుద్యోగ సమస్యలపై చర్చించాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్‌ ‌మధ్య పెద్ద గందరగోళ వాతావరణం

చోటుచేసుకుంది. ఇదికాస్తా హైకోర్టు వరకు వెళ్ళింది. అయితే అనుమతిచ్చేది లేనిది యూనివర్శిటీ విసియే నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం తీర్పుచెప్పడంతో ఇప్పుడు కాంగ్రెస్‌ అనుబంధ ఎన్‌ఎస్‌యు తదితర సంస్థలు విసి పైన విరుచుకు పడుతున్నారు. ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, ఆందోళనలు చేయడంతో పలువురు విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఆందోళన చేపట్టిన పలువురు యూనివర్శిటీకి చెందిన విద్యార్థినాయకులు చంచల్‌గూడ జైల్‌లో ఉన్నవిషయం తెలిసిందే. వీరిని పరామర్షించేందుకు రాహుల్‌ను జైల్‌కు తీసుకువెళ్ళేందుకు స్థానిక కాంగ్రెస్‌ ‌నాయకత్వం ప్రయత్నిస్తోంది. గురువారం జైల్‌ ‌సూపరింటెండెంట్‌ను కలిసి అనుమతికోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నంలో నాయకులున్నారు. ఇదిలా ఉంటే రాహుల్‌ ‌రాకను ప్రభుత్వం అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ ‌నాయకులు ఆరోపిస్తుంటే, అసలు రాహుల్‌ ఇప్పుడు తెలంగాణలో ఎందుకు పర్యటిస్తున్నాడో చెప్పాలని టిఆర్‌ఎస్‌ ‌మంత్రులే ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణలో అమలవుతున్న లాంటి పథకాలు అమలవుతున్నాయా చెప్పాలని నిలదీస్తున్నారు. అసలు రాహుల్‌ ‌గాంధీ వొచ్చినతర్వాతే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిందని వారు విమర్శించడంలాంటి మాటల యుద్దంతో ఒక విధంగా రాష్ట్రంలో రాజకీయ యుద్ధ వాతావర్ణం కొనసాగుతున్నది. బిజెపితో టిఆర్‌ఎస్‌కు లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్‌, ‌కాంగ్రెస్‌తోనే టిఆర్‌ఎస్‌కు ఒప్పందం ఉందని బిజెపి విమర్శ, ప్రతివిమర్శలు చేసుకుంటుండడంతో పార్టీల మధ్య రగులుతున్న వేడి వాతావరణం అసలే ఎండలు మండిపోతున్న పరిస్థితిలో మరింత వేడిని రాజేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page