పోడుభూములు, విద్య, వైద్యంపై మంత్రులను నిలదీసిన ప్రజాప్రతినిధులు
పోడుభూములపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్న మంత్రులు పువ్వాడ, సత్యవతి రాథోడ్
ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ల మధ్య వాగ్వివాదం
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 08 : గత కొంతకాలంగా ఆదివాసీలు ఎదుర్కుంటున్న పోడుభూముల సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు అధికారులను కోరినప్పటికి ఫలితం లేకపోవడంతో శుక్రవారం నాడు భద్రాచలం ఐటిడిఏ పాలకమండలి సమావేశం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పొట్రూ అధ్యక్షతన జరిగింది. పోడు భూములపై ప్రజాప్రతినిధులు, మంత్రులను నిలదీసారు. పోడు సాగు చేసుకుంటున్న తమపై దాడులకు పాల్పడుతూ భూములను లాక్కుంటున్నారని ప్రజాప్రతినిధులు మంత్రులు, అధికారులపై మండిపడ్డారు. మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్ , సత్యవతి రాథోడ్ స్పందిస్తూ పోడు భూముల సమస్యలు త్వరలో పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరణ ఇచ్చారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్టు అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవద్దని సూచించారు. అనంతరం భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య మాట్లాడుతూ..రాష్ట్రంలో దళితబంధు మొదటివిడత లబ్దిదారులకు అందినప్పటికి భద్రాచలం నియోజకవర్గంలో దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మండలాల్లో దళితబంధు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకుంటున్నారని అందువలనే ఇంతవరకు లబ్దిదారులకు దళితబంధు అందలేదని ప్రశ్నించారు.
దళితబంధు తక్షణమే విడుదల చేయాలని మంత్రిని కోరారు. అలాగే ఏజన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు విద్య, వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఏజన్సీలో ఉన్న మారుమూల ప్రాంత గిరిజనులను అన్నీ విధాల ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు మంత్రులను, అధికారులను కోరారు. ఏజన్సీలో ఉన్న ఆదివాసీ గ్రామాలకు ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, అనేకమంది గిరిజనులు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని ప్రజాప్రతినిధులు అధికారులకు వివరించారు. ఆదివాసీల కోసం ఏర్పాటు చేసిన ఐటిడిఏ ఏమాత్రం ఆదివాసీలకు ఉయోగకరంగా లేదని ,వివిధ మండలాల ప్రజాప్రతినిధులు నిలదీసారు. అసలే వర్షాకాలం కావడం వలన మారుమూల గిరిజన ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందుగానే ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని పాలకమండలిలో కోరారు. ము్య•ంగా ఏజన్సీ ప్రాంతంలో త్రాగునీరు సమస్యగా ఉందని త్రాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా పాలకమండలి తీర్మానం చేయాలని కోరారు. ఏజన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన పిల్లలకు చదువుకునేందుకు పాఠశాలకు ఏర్పాటు చేయాలని కోరారు.
వలస ఆదివాసీలను తెలంగాణలోనే కొనసాగేల అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రులు అధికారులకు సూచించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న వలస ఆదివాసీలకు కూడ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతామధు, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు విపి గౌతమ్, అనుదీప్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్రా వెంకట వీరయ్య, పొదెం వీరయ్య, వనమా వెంకటేశర్రావు, మచ్చా నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కొరాకుల నాగభూషణం, కొత్తగూడెం, మహబూబాబాద్ జడ్పి చైర్మన్లు కోరం కనకయ్య, బింధు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఐటిడిఏ ప్రాంగణంలో 1.10 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన భవన్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ల మధ్య వాగ్వివాదం
భద్రాచలం ఐటిడిఏ పాలకమండలి సమావేశంలో భద్రాచలం శాసన సభ్యులు పొదెంవీరయ్యకు ,రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య సమావేశంలో విమర్శ చేసారు. గిరిజనులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రులను నిలదీసారు. దీనితో కొద్దిసేపు మంత్రులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వివాదం జరిగింది. దళితబంధు భద్రాచలం నియోజకవర్గంలో ఎందుకు నిలుపుదల చేసారని మంత్రి పువ్వాడను నిలదీసారు. దీనితో మంత్రులు ఒక్కసారిగా ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పరంగా తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, గిరిజనులకు ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ముందుందని వివరించారు.


