మేడారంలో శాశ్వ‌త అభివృద్ధి ప‌నుల కోసం క‌మిటీ

నిపుణులు, భ‌క్తులు, ఆదివాసీ సంఘాల స‌ల‌హాలు తీసుకుంటాం..
మేడారం జాత‌ర‌కు జాతీయ‌హోదా క‌ల్పించాలి..
సమ్మక్క సారలమ్మ  దీవెన‌ల‌తోనే  ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.
27న రెండు గ్యారంటీల‌ను అమ‌లు చేస్తాం.. ప్రారంభోత్స‌వానికి ప్రియాంకా గాంధీ వ‌స్తారు..

మేడారం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 23 : నిపుణులు,  భక్తులు, ఆదివాసీ సంఘాల  అభిప్రాయాలు తీసుకొని  ఆదివాసీల సంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో శాశ్వత ప్రాతిప‌దిక‌న‌ అభివృద్ధి ప‌నులు చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  మ‌హాజాత‌ర‌లో  భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు రూ.110 కోట్ల నిధులు విడుదల చేసిన‌ట్లు చెప్పారు. అన్ని ముఖ్యమైన కార్యక్రమాలను మేడారం తల్లుల ఆశీర్వాదంతోనే మొదలుపెట్టామని తెలిపారు.  శుక్ర‌వారం సీఎం రేవంత్ రెడ్డి మేడారం సంద‌ర్శించి స‌మ్మ‌క్క-సార‌ల‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంత‌రం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సీఎం మాట్లాడారు. సమైక్య  పాలనలో కూడా జరగని దోపిడీ.. గ‌త 10 ఏండ్లలో జరిగిందని విమ‌ర్శించారు. 10 ఏళ్లు పరిపాలనలో ఉన్నా  కేంద్రం ఏనాడూ విచారణ జరపలేద‌ని, నాటి పాలనలో అక్రమాలపై  జ్యూడిషరీ  విచారణ జరిపిస్తామ‌ని తెలిపారు.


ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన  ప్రతి హామీ అమలుచేస్తామ‌ని,  రెండు లక్షల రుణమాఫీ తొందరలోనే  అందిస్తామ‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో పరిపాలనను దారిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామ‌ని, అందుకోసం అందరం సెలవు లేకుండా పనిచేస్తున్నామ‌న్నారు  అధికారంలోకి వ‌చ్చాక‌ 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ  చేశామ‌ని, యువతకు ఉపాధి కలిపించేందుకు  65 ఐటిఐలను స్కిల్ డెవలప్ మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.  ఈ నెల 27న సాయంత్రం మరో రెండు గ్యారెంటీలు .. రూ 500 లకే పేద మహిళలకు గ్యాస్ సిలిండర్,  తెల్లరేషన్  కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమ‌లు చేసి తీరుతామ‌ని తెలిపారు.  ఈ రెండు గ్యారెంటీల ప్రారంభానికి ముఖ్య అతిథిగా  కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రానున్నార‌ని వెల్ల‌డించారు.

మేడారానికి జాతీయ హోదా ప్రకటించాలని  కేంద్రాన్ని ఇప్పటికే చాలా సార్లు కోరామ‌ని, కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అది  సాధ్యం కాదన్నారని గుర్తుచేశారు. కుంభమేలా పేరిట లక్షల కోట్లు కేటాయిస్తున్నారని,   కానీ  కేంద్రం మేడారానికి కేవలం రూ. 3 కోట్ల  నిధులే ఇచ్చిందని విమ‌ర్శించారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు ఈ వ్యత్యాసం ఎందుకని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. అయోధ్యలో రాముడిని అందరూ వచ్చి దర్శించుకోండని  ఎలా చెబుతున్నారో.. అదే తరహాలో మా మేడారం జాతరకు  కూడా ఆహ్వానిస్తున్నామ‌ని, కోట్లాది భక్తులచే కొలవబడుతున్న మేడారం ఆదివాసుల పండుగ గురించి ప్రధానమంత్రి కి దృష్ష్టికి తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి కి  సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *