బిఆర్‌ఎస్‌ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తున్నదా ?

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన భారత రాష్ట్రసమితి తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వొచ్చింది. రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో ఒక్క స్థానంలోకూడా తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిందంటే ఆ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నది స్పష్టమవుతున్నది.  ప్రతిపక్ష పార్టీలు  మొదటినుండీ ఈసారి బిఆర్‌ఎస్‌కు ఒక్క స్థానంకూడా రాదన్నట్లుగానే ఫలితాలు వెల్లడైనాయి. మెదక్‌ నియోజకవర్గం విషయంలో కొంత ఆశ ఉండిరది. ఆలాగే నాగర్‌ కర్నూల్‌పైన కూడా ఆ పార్టీ కొంత ఆశించింది. కాని, కొత్త రాష్ట్రాన్ని సాధించడంతోపాటు, పదేళ్ళుగా అధికారంలో కొనసాగిన పార్టీని కాదని, ఆ పార్టీని పూర్తిగా వ్యతిరేకించే రెండు జాతీయ పార్టీలకు చెరిసగం స్థానాలను పంచిపెంటారు తెలంగాణ ప్రజలు. గత ఎన్నికల్లో తొమ్మిది ఎంపి స్థానాలను గెలుచుకున్న బిఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను ఒక్క స్థానంలోనైనా గెలిపించని తెలంగాణ ప్రజలు బిజెపికి మాత్రం రెండిరతల స్థానాలనివ్వడం గమనార్హం. గత ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకున్న బిజెపి ఈసారి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. అంటే బిఆర్‌ఎస్‌ స్థానాలను బిజెపి కొట్టేసుకుపోయిందన్నమాట.

దీన్నిబట్టి చూస్తే, బిఆర్‌ఎస్‌ స్థానాన్ని క్రమేణా బిజెపి ఆక్రమిస్తున్నదనిపిస్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికలను వొదిలేసి, ఆ తర్వాత నుండి తెలంగాణపైన కాషాయ జండాను ఎగురవేయాలన్న దృఢ సంకల్పంతో బిజెపి ఇక్కడ పావులు కదుపుతూ వొచ్చింది. స్థానిక ఎన్నికలు మొదలు, అనేక కీలక ఎన్నికల్లో తన
ఉనికిని, బలాన్ని చాటుకుంటూ వొచ్చింది. తాజా లోకసభ ఎన్నికల్లో  డబుల్‌ డిజిట్‌లను సాధించుకుంటామని చెప్పిన బిజెపి డబుల్‌ స్థానాలనైతే సాధించుకోవడం ద్వారా తెలంగాణపై తమ లక్ష్యానికి చేరువవుతూ వొస్తున్నది. దీన్నిబట్టి వొచ్చే ఎన్నికల్లోగా తెలంగాణలో తమ పార్టీని విస్తృత పర్చుకుంటుందనడంలో సందేహంలేదు. ఇది బిఆర్‌ఎస్‌ ఉనికికే ప్రమాదమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటి నుండీ ఆ పార్టీకి కష్టకాలం మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కుంటూ చాలామంది ప్రధాన నాయకులు ఒక్కొక్కరిగా కాంగ్రెస్‌, బిజెపి లాంటి జాతీయ పార్టీలో చేరడం ప్రారంభించారు. అధిష్టానం  రంగంలోకి దిగి వారిని అనునయించే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

 

ఆ వెంటనే మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు వొచ్చేసరికి ఆ పార్టీకి పోటీ చేసే నాయకుల కరవు ఏర్పడిరది. పార్టీ టికట్లకోసం క్యూ కట్టాల్సిన పరిస్థితినుండి టికట్‌ కేటాయించినా తిరస్కరించి వెళ్ళిన పరిస్థితులను బిఆర్‌ఎస్‌ ఎదుర్కోవాల్సి వొచ్చింది. ఫలితంగా లోకసభ ఎన్నికల అభ్యర్ధులకోసం వెతుక్కోవాల్సి వొచ్చింది. ఎన్నికల ప్రచారంలో కూడా ఉద్యమకాలం నాటి ఊపు ఎక్కడా కనిపించలేదు. ఆ పార్టీలో ఆ నలుగురే అన్నట్లు, ఆ నలుగురి సభలు, సమావేశాలే తప్ప క్యాడర్‌లో ఉత్సాహం కనిపించలేదు. దీనికంతకు అసెంబ్లీ ఎన్నికలు మొదలు, పార్లమెంటు ఎన్నికల వరకు ప్రతిపక్షాలు బిఆర్‌ఎస్‌ పార్టీపైన, అధినేతలు కెసిఆర్‌, కెటిఆర్‌, హరీష్‌రావులపైన చేసిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోయారన్న వాదన ఉంది. దిల్లీ  లిక్కర్‌ కేసులో కవిత జైల్‌ జీవితం అనుభవిస్తున్న విషయంలో స్వయంగా తండ్రి అయిన కెసిఆర్‌  మౌనం వహించడం, కాళేశ్వరం క్రుంగివేత, టెలిఫోన్‌ ట్యాపింగ్‌ లాంటి అంశాలు  బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపేవిగా ఉండడంతో, కల్వకుంట్ల కుటుంబమంతా జైలుపాలవుతుందంటూ కాంగ్రెస్‌, బిజెపి పార్టీల ప్రచారం వోటర్లలో ఆలోచనను రేకెత్తించడంవల్లే ఈ ఫలితాలంటున్నారు.

 

దానికి తోడు 2001 నుండి 2014 వరకు ఎలాంటి పదవులు ఆశించకుండా తెలంగాణ వాదన్ని పట్టుకుని ఉన్న ఉద్యమకారుల్లో ఇంకా ఎంతకాలం అన్న నిరాశ కలగడం కూడా పార్టీ ఓటమికి కారణంగా భావిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ పేరులో ఉన్న  తెలంగాణ పదాన్ని తొలగించడం. దేశరాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ నేల విడిచి సాము చేసినట్లు టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చినప్పటినుండే ఆ పార్టీకి ఒక విధంగా కష్టకాలం మొదలైందన్న భావన ఉంది. ఇలాంటి పరిస్థితిలో కనీసం ఒక్క స్థానాన్ని కూడా ఇవ్వాళ గెలుచుకోలేక పోయిన స్థితిలో, రానున్న అయిదేళ్ళ కాలం పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడమన్నది ఇప్పుడు ఆ పార్టీకి సవాల్‌గా మారింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఒకసారి కాకపోతే మరోసారికైనా తమకు అవకాశం వొస్తుందనుకున్న క్యాడర్‌, అయిదేళ్ళకాలం పదవులు  లేకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉండగలుగుతారా అన్నది ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *