శేషన్ సంస్కరణల అమలకు..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో వోటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 80కోట్ల వోటర్లు ఉన్న మనదేశంలో ఎన్నికల నిర్వహణ అంత ఆషామాషీ కాదు. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన వోటు హక్కుతో నచ్చినవారికి అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే పదవిలో నుంచి ఎప్పుడు దించాలనే కుతూహలంతో ఎదిరిచూస్తారు. రాజ్యాంగం కల్పించిన హక్కును వజ్రాయుధంలా వినియోగించుకునేది వోటు హక్కు మాత్రమే. పార్లమెంట్, అసెంబ్లీలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఎంతో విలువైన వోటుహక్కు అగుపడని ఓ రాజముద్ర. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు వోటు అనే బ్రహ్మాస్త్రం, మంచి చెడులను గ్రహించే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ప్రపంచాన్ని శాసించగల శక్తి, ప్రజాస్వామ్యాన్ని బతికించే యుక్తి వోటరుకు ఉంది.
ఎంతో విలువైన వోటు హక్కును అర్హతగల ప్రతి ఒక్కరికి కల్పించేందుకు గాను ఏటా కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తుంది.భారత ఎన్నికల సంఘం ఆవిర్బ •వించిన రోజూ జనవరి 25ను జాతీయ వోటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ‘బలమైన ప్రజా స్వామ్యం ఏర్పాటు కోసం వోటు నమోదు, బాధ్యత అనే నినాదంతో జాతీయ వోటర్ల దినోత్సవాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది.1952 నుండి ఇప్పటివరకు భారత ఎన్నికల కమిషన్ కు 25 మంది ఎన్నికల ప్రధాన కమిషనర్లుగా నియమితులైనారు.జాతీయ వోటర్ల దినోత్సవం రోజున ప్రతీ ఏటా బూత్‌స్థాయిలో, ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అంతే కాకుండా కొత్తగా వోటర్లుగా నమోదయిన యువతీయువకులను, ఉత్తమ అధికారులను వోటరు దినోత్సవం రోజున ఘనంగా సన్మానిస్తారు.
భారతదేశం.ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం వోటర్లు,భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా 1950లో ఏర్పాటు అయిన భారత ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు 17 పర్యాయాలు లోకసభకు ఎన్నికలను నిర్వహించింది.సమకాలీన రాజకీయాల్లో ‘మనిషి విలువ కన్నా’ మని విలువే ఎక్కువ అయ్యింది.దీనికి ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. హక్కులను కాలరాస్తున్నకారకులు ఎవరు? అని ప్రతి ఒక్క వోటర్ మహాశయులు ప్రశ్నించుకోవాలి ? లంచం ఇచ్చేవాడు మాత్రమే కాదు.. తీసుకునేవాడు కూడా నేరస్తుడే. అందుకే వోటుకు నోటు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి చక్రవడ్డీతో దోచుకునేందుకు ప్రజాప్రతినిధులను వెనుకాడడం లేదు .తయారుచేసింది కూడా వోటరు మహాశయులే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా దేశ ప్రజలకు కత్తిని చేతికి ఇవ్వలేదు, వోటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. దాన్ని సద్వినియోగం చేసుకొని రాజులౌతారో, వోటును అమ్ముకోని బానిసలగా ఉంటారో అంత మీ చేతుల్లోనే ఉంది అన్నాడు. నిరక్ష్యరాస్యుల కంటే అక్షరాస్యులలోనే ఈ ప్రలోభాల ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి. అధికారమే ఏకైక లక్ష్యంగా పాలకులు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి, గెలుపే లక్ష్యంగా పరిపాలిస్తూన్నారు. ఇప్పుడు విజ్ఞానవంతులు కులం పేర , మతంపేర , డబ్బుకు , మద్యం వంటి ప్రలోభాలకు లొంగి వోటేస్తున్నారనేది జగద్విదితం. నేడు స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో నడుస్తుందనే విమర్శ ఉంది. ఇటీవల జరిగిన తాజా పరిణామాలు నిలువెత్తు ప్రతిరూపం.
ప్రధాన మంత్రి గా చంద్రశేఖర్ ఉన్న సమయంలో నియమించిన టి.ఎన్ శేషన్ ఎన్నికల కమిషన్ బాధ్యతలు చేపట్టే నాటికి ఎన్నికల్లో మూడు కిడ్నాప్ లు ఆరు హింసగా యథేచ్ఛగా జరుగుతుండేది.దాని కారణంగా కొన్ని వర్గాల ప్రజలు వోటింగ్ కు దూరంగా ఉండేవారు. ఇది గ్రహించి శేషన్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును భారీగా పెంచారు. రిగ్గింగ్ కు పూర్తిగా అడ్డుకట్ట వేశారు. వోటర్లను ఎవరూ భయభ్రాంతులకు గురిచేయకుండా చర్యలు తీసుకున్నారు.1991లో మత ఘర్షణలతో పరిస్థితులు వేడెక్కిన సమయంలో జరిగిన ఎన్నికల్లోనూ వోటింగ్ శాతం అధికంగానే నమోదయిందంటే అందుకు కారణం శేషన్ సంస్కరణలే. విధి నిర్వహణలో చండశాసనుడు గా టి.ఎన్.శేషన్ కు పేరుంది.భారతావనిలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఆయన అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరించారు.
రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు. వోటర్లలో అభద్రతా భావాన్ని తొలగించారు. ఎన్నికల ప్రక్రియలో చట్టాలను కఠినంగా అమలు చేశారు. అయితే శేషన్ పెట్టిన కఠినమైన మార్గదర్శక సూత్రాల మూలంగా రాజకీయ పార్టీలలో వణుకుపుట్టింది. గత ఎనిమిదేండ్లుగా ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రతిపక్షాల నుంచి ప్రజాస్వామ్య వాదుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నియామకం వివాదాస్పదం అయ్యింది.న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థ తరహాలో ఎన్నికల కమిషనర్లను నియమించాలని కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో పారదర్శకత ఉండాలని కోరుతున్న పిటిషన్ల కారణంగా సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. శేషన్ లాంటి కమిషనర్ వస్తేగాని దీనికి పరిష్కారం లేదని హితబోధ చేయడం గమనార్హం.
2011 నుంచి ఏటా ఒక్కో నినాదంతో జాతీయ వోటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గతేడాది 11వ జాతీయ వోటర్ల దినోత్సవాన్ని ‘మా వోటర్లను శక్తివంతం చేయడం, అప్రమత్తంగా, సురక్షితంగా సమాచారం ఇవ్వడం’అనే నినాదంతో నిర్వహించారు.ప్రజాస్వామ్య వ్యవస్థ పై నమ్మకం లేనివారిని, ప్రత్యామ్నయ రాజ్య వ్యవస్థలను విశ్వసించే వారిని వదిలేయండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య. గణతంత్ర రాజ్యం పైన నమ్మకం ఉన్నవారు కూడా వోటింగ్ కు దూరంగా ఉండడం ఎట్లా అర్థం చేసుకోవాలి ? చదువుకున్న వారు సమాజం పట్ల దేశం పట్ల అవగాహన కలిగిన వారు భవిష్యత్తును నిర్దేశించే శక్తి యుక్తులు ఉన్నవారు వోటింగ్ కు దూరంగా ఉండడం. ప్రజాస్వామ్యం వ్యవస్థను బలోపితం చేసే సంకేతం ఏమాత్రం కాదు.
న్యాయనిపుణులు, ప్రజాస్వామ్య అధ్యయనవేత్తలు, సామాజిక పరిశోధకులు, తమ తమ పద్ధతుల్లో బుద్ధిజీవులు వోటింగ్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారని విషయాన్ని పరిశోధించారు ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు తాము ఆశించిన గుణగణాలు ఉన్న వాళ్ళు లేనందున ఏవరు గెలిచినా ఒకటే అనే భావన ఏర్పడింది. యోగ్యత లేని వారందరిలో తక్కువ చెడు లక్షణాలు కలిగిన వారిని ఎన్నుకోక తప్పని పరిస్థితి ఉన్నందున బుద్ధిజీవులు వోటింగ్ కు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం. వోటుకు నోటు సంస్కృతి పోవాలంటే అభ్యర్థులకు ప్రచారం చేసుకునే వెసలుబాటు ఇవ్వని సంస్కరణలు తెచ్చే శేషన్ మళ్ళి పుట్టాలి.. మళ్ళి రావాలి. స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేయక పోతే లంచగొండితనం మితిమీరిపోయే ప్రమాదం ఉంది. కట్ చేస్తే .. విద్యావంతులు సిగ్గు విడిచి వోటుకు నోటు అడుగుతుంటే.. అభ్యర్థులు పోయిన డబ్బులు సంపాదించుకునేందుకు, భవిష్యత్త్ తరాలకు సరిపోనూ అక్రమాలు చేయక తప్పడం లేదనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం.
(జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా)
డా.సంగని మల్లేశ్వర్, విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, 9866255355.





