ఆ ‌మూడు పార్టీలు ఒకవైపు… కాంగ్రెస్‌ ‌మరోవైపు

  • కాంగ్రెస్‌ ‌గెలుపును అడ్డుకునేందుకు కుట్ర
    దిల్లీ బిజెపికి బిఆర్‌ఎస్‌ ‌గులాం
  • కెసిఆర్‌ ‌కుటుంబానికే మంత్రి పదవులు
  • పదేళ్లలో వందల ఎకరాల భూమి స్వాహా
  • కాంగ్రెస్‌ ‌తోనే ప్రజా సంక్షేమ రాజ్యం సాధ్యం
  • మధిర విజయ భేరి సభలో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత ప్రియాంక గాంధీ

మధిర,  ప్రజాతంత్ర ,నవంబర్‌ 25 : ‌కాంగ్రెస్‌ ‌విజయ యాత్రను అడ్డుకునేందుకు దిల్లీలో ఉన్న బిజెపి, గల్లీలో ఉన్న బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఏకమై లోపాయకార ఒప్పందం చేసుకుని ప్రజలను మభ్య పెట్టేందుకు తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనంటూ ప్రజల ముందుకు వొస్తున్న బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌లను నమ్మవద్దని కాంగ్రెస్‌ అ‌గ్ర నేత ప్రియాంక గాంధీ వోటర్లకు పిలుపునిచ్చారు. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న మధిర సత్తుపల్లి పాలేరు సభల్లో పాల్గొని అభ్యర్థిగా గెలుపు కోసం కాంగ్రెస్‌ ‌చేపట్టబోయే ప్రజా సంక్షేమల గురించి ప్రసంగించారు. దిల్లీకి వెళ్లి తెలంగాణలో చేసిన తప్పులను మోదీ వద్ద మోకరిల్లి తెలంగాణ ఆత్మగౌరాన్ని కెసిఆర్‌ ‌తాకట్టు పెడుతున్నారన్నారు. దీనికి ప్రతిఫలంగా నేడు తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మద్దతుగా తెలంగాణలో ఎలాంటి బలం లేని బిజెపి పోటీ నిర్వహిస్తూ ప్రభుత్వ వ్యతిరేక వోటు చీల్చి బిఆర్‌ఎస్‌ ‌గెలుపు కోసం పనిచేస్తుందని ఆరోపించారు. మరో పార్టీ ఎంఐఎం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో 30 నుండి 40 సీట్లకు పోటీ చేస్తుంటే తెలంగాణలో కేవలం ఆరు సీట్లకే పరిమితం అవ్వటానికి చూస్తుంటే ఆ పార్టీ బిఆర్‌ఎస్‌కు ఏ స్థాయిలో మద్దతు తెలుపుతుందో అర్థమవుతుందన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లు పరిపాలన సాగించిన టిఆర్‌ఎస్‌ ‌కేసిఆర్‌ ‌ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను వెనుకేసుకొని వందల వందల ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని ఫామ్‌ ‌హౌస్లను నిర్మించుకొని రాచరిక పాలన రాజబోగాలను అనుభవిస్తున్నాడని మండిపడ్డారు. పదేళ్ల కాలంలో కేసీఆర్‌ ‌కుటుంబం మాత్రమే మంత్రి పదవులను అనుభవిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో సొంత ఇల్లు, సొంత భూమి లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్న పేద ప్రజలను విస్మరించిన దోపిడీ మోసపూరిత వాగ్దానాలను చేసి ప్రజలను వంచిస్తున్న బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పనికి బిజెపి, ఎంఐఎం, మద్దతు తెలపడం వారి అవినీతి రాజకీయానికి నిదర్శనమన్నారు. ఈ మూడు పార్టీలు ఏకమై కాంగ్రెస్‌ ‌గెలుపును అడ్డుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. ఎవరెన్ని ఎత్తుగడలు వేసిన కాంగ్రెస్‌ ‌గెలుపును అడ్డుకోలేరని, తెలంగాణలో వొచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రజా సంక్షేమ ఇందిరమ్మ ప్రజారాజ్యం అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల స్కీమ్‌ ‌లతోపాటు, పేద ప్రజలందరికీ 10 లక్షల ఉచిత వైద్యం, ప్రతి నియోజకవర్గానికి ఇంటర్నేషనల్‌ ‌కార్పొరేట్‌ ‌స్థాయి పాఠశాల, వృద్ధులకు రూ 4వేలు వికలాంగులకు రూ 5వేలు, పెన్షన్‌ అం‌దించనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ‌రైతులకు రూ15వేల రైతుబంధు రైతు కూలీలకు 12 వేల రూపాయల, వరి ధాన్యానికి గిట్టుబాటు ధర రూ500 ల బోనస్‌, 500 ‌రూపాయలకే గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెలంగాణ ఉద్యమంలో అమరులైన ప్రతి కుటుంబానికి ఉద్యోగం, ఉన్నత విద్యను చదువుకునే విద్యార్థులకు రూ 5 లక్షల  క్రెడిట్‌ ‌కార్డ్, ‌రెండు లక్షల రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా అవినీతి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా ఏకమై ఇందిరమ్మ ప్రజారాజ్య స్థాపనకు సహకరించాలని ఓటర్లకు ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీ హిందీలో ప్రసంగించగా బట్టి విక్రమార్క దాన్ని తెలుగులోకి అనువదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *