సార్వత్రిక విద్య విధి విధానాలు,నిర్వహణ తీరు తెన్నులు రెగ్యులర్ విద్య తో పోలిస్తే భిన్నంగా వుంటాయని తెలిసి కూడా సార్వత్రిక విద్యలో భారీ మార్పులను తెలంగాణ విద్యా కమీషన్ తన నివేదికలో పొందు పరచింది. తన నివేదికలో పన్నెండవ అధ్యాయం లో సార్వత్రిక విద్య పై నివేదించిన పలు అంశాలు అట్టడుగు వర్గాలను విద్యకు దూరం చేసేవిగా వున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదవ తరగతి,ఇంటర్మీడియట్ విద్య పొందుతున్న లెర్నర్లకు గల పలు మౌలిక సమస్యలను తీర్చేందుకు ప్రతిపాదనలు చేయవలసి వుండేది. సార్వత్రిక విద్య మౌలిక లక్ష్యాలను విస్మరించిన కమిషన్ నిర్వహణ ,సిలబస్,మూల్యాంకనాలను రెగ్యులర్ తరహాకు అనుసంధానం చేయాలని సూచించటం విస్మయం కలిగి స్తుంది. సామాజికంగా వెనుకబడిన, అట్టడుగువర్గాల ప్రజలను సమ్మూల అభివృద్ధి కోసం రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. పదేళ్ళకోసారి మరో సారి పెంచుతూ రిజర్వేషన్లను ప్రభుత్వాలు గౌరవిస్తున్నాయి. అదే విధంగా పలు కారణాలతో రెగ్యులర్ విద్య పొందలేని వారికీ , డ్రాపౌట్ లకు , గృహిణులకు, జువైనల్ మరియు సాధారణ ఖైదీలకు, రిమోట్ ఏరియా గిరిజనులకు సంచార జాతులకు,దివ్యాంగులకు చెందిన చదువు మధ్యలో వదిలిన వారందరినీ ఓపెన్ స్కూల్ తిరిగి విద్యావంతులను చేస్తున్నది.
విద్యా సంవత్సరంలో సెలవుదినాలు, ఆదివారాలలో ముప్పయి ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు.లెర్నర్లు ఉపాధి ఉద్యోగాలకు హాజరవుతూనే ఈ వారాంతపు తరగతుల ద్వారా పదవ తరగతి,ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేస్తు న్నారు. విద్యా కమిషన్ నివేదికలో సార్వత్రిక విద్య పై 12.6 సెక్షన్ లో చేసిన సూచనలు సార్వత్రిక విద్యను దాని లక్ష్యాలను అర్ధం చేసుకోవటంలో కమిషన్ వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయి. రెగ్యులర్ విధానాన్ని పోలి శిక్షణను పొందిన ప్రత్యకమైన ఫాకల్టీ వుండాలని , అన్ని స్థాయిలోను ప్రత్యేక అధికారులు వుండాలనీ సూచించారు.లెర్నర్లకు ఇప్పుడందుతున్న బోధన మెరుగు పరిచేందుకు ఫాకల్టీకి వర్క్ షాప్ లు నిర్వహించాలని , వారికి రిసోర్స్ మరింత ఎక్కువగా మెరుగుపర్చాలని సూచించారు.సిలబస్,కర్రికులం రెగ్యులర్ విద్యార్థుల తో సమానంగా వుండాలని , స్కిల్ పెంచేదిగా. సమస్యలను ఎదుర్కొనేదిగా ఆ కర్రికులం అభివృద్ధి చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల లెర్నర్లకు ఇంగ్లీష్ మాధ్యమం అవసరమని సూచిస్తూనే మాధ్యమం ఎంపిక పై వారి ఇష్టాన్ని గౌరవించాలని సూచించారు. బోధనకు డిజిటల్ లైబ్రేరీలు , అధునాతన సాఫ్ట్ వేర్ రూపక ల్పన అవసరమని సూచించారు. ఎన్.ఇ.పి-2020 లో సూచనలను పోలి కమ్యూనిటీ సహకారం తీసుకోవాలన్నారు..సెమీ గవర్నమెంట్, ఎన్.జీ.ఓ. ల నుండి భౌతిక ఆర్ధిక సహకారం తీసుకోవాలని సూచిం చారు. సార్వత్రిక విద్య విధి విధానాలు ప్రయోజనాల గురించి బహుళ ప్రచారంలో తేవాలన్నారు. మూల్యాంకనం విషయంలో సార్వత్రిక, రెగ్యులర్ విద్యార్థులకు మూల్యాంకనం ఒకే రీతిలో వుండాలన్నారు. రెగ్యులర్,సార్వత్రిక విద్యార్థులకు పదవ తరగతి స్థాయి నుండి డిగ్రీ వరకు ఈ స్టాండర్డ్స్ ఒకే విధంగా వుండాలని ప్రతిపాదించారు.తమ విద్యార్హతల ఆధారంగా కళాశాలలో, పాఠశాలలో అన్ని రకాల బోధనానుభవం, అర్హతలు గలవారే బోధిస్తున్నారు. అనుభవజ్ఞులు మాత్రమే విద్యార్హతలు లేకుండా నేరుగా పదవ తరగతి,ఇంటర్ లో చేరే లెర్నర్లకు సరైన రీతిలో వివిధ సబ్దెక్ట్ లపై పాఠ్యాంశాలను వివరించగలుగుతారు. ఇంటర్, ఎస్సెస్సీ బోర్డుల ద్వారానే రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా ఓపెన్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని చేసిన సిఫార్స్ ఆచరణ సాధ్యమెలా అవుతుందనేది ప్రశ్నార్ధకం.ఓపెన్ స్కూల్ లెర్నర్లు రెగ్యులర్ విద్యార్థులతోసమానంగా పోటీపడి ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు నిర్వహించే పరీక్షలు మాత్రమే రాయాలి.
అంటే ఇంటర్ బోర్డు, ఎస్.సి.ఇ.ఆర్.టి. రూపొందించిన పుస్తకాలను చదవాలి.రెగ్యులర్ విద్యాలక్ష్యాలకు భిన్నంగా సార్వత్రిక విద్య స్వతంత్రంగా సిలబస్ కలిగి వుంటుంది. 30 ప్రత్యక్ష తరగతులలో సిలబస్ బోధించటం జరగదు. లెర్నర్లు వారం రోజుల పాటు ఇంటి వద్ద సొంతంగా చదువుకొని తమకు కలిగే సందేహాలను తీర్చుకునేందు కోసం వారాంతం జరిగే ఈ ప్రత్యక్ష తరగతులకు హాజరవుతారు.పైగా విద్యాసంవత్సరం మధ్య ఎలాంటి ఇంటర్నల్ మూల్యాంకనానికి అవకాశం వుండదు. లెర్నర్లు మూడు అస్సైన్ మెంట్ లు రాయాలని నిర్ధేశన వుంది.కానీ వాటిపై మానిటరింగ్ వుండటం లేదు. మనుగడ కొనసాగిస్తున్న ఒక స్థిరమైన వ్యవస్థలో గమనించిన లోపాలనుసరిదిద్దేందుకు కమీషన్ నివేదిక దోహద పడాల్సివుంది.కానీ ఎలుకలున్నయని ఇల్లు కాలబెట్టుకున్న చందంగా ఏకంగా సార్వత్రిక విద్యలో రెగ్యులర్ సిలబస్.రెగ్యులర్ వారితో సమానమైన సామర్థ్యాలు పెంచాలనటం సార్వత్రిక విద్యాలక్ష్యాలకు విరుద్దమైనది.నాణ్యత పేరుతో రెగ్యులర్ విద్య పొందలేని వారిని , డ్రాపౌట్ లను ,గృహిణులను , జువైనల్ మరియు సాధారణ ఖైదీలను రిమోట్ ఏరియా గిరిజనులను , సంచార జాతులను,దివ్యాంగులను విద్యా కమిషన్ నివేదిక సిఫార్సులు విద్యకు దూరం చేసే ప్రయత్నంగా భావించాలి.ఇంతగా మార్పులను ప్రతిపాదించే ముందు సార్వత్రిక అభ్యాసకుల అభిప్రాయాలూ పరిగననలోకి తీసుకోకపోవడం అంటే విద్యాకమీషన్ సిఫార్సులు ఏక పక్ష వైఖరే ఆని భావించాలి.
విఫల ప్రయోగం – డిజిటల్ ఆన్ లైన్ బోధన
సార్వత్రిక విద్య లెర్నర్లకు డిజిటల్ పాఠాలు బోధించాలన్న మరో సిఫార్సు హాస్యాస్పదమైనది. ఇందుకోసం టాస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ లో ఇప్పటికే ఒక యూట్యూబ్ ఛానల్..వాట్సప్ ఛానల్ నిర్వహిస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వం ఆన్ లైన్ వైపు మొగ్గుచూపింది. ఆన్ లైన్ సఫలీకృతమైతుందని చెప్పటానికి ఆనేక కొలమానాలతో విద్యార్థుల వివరాలను బడుల నుండి సేకరించింది. దూరదర్శన్ యాదగిరి,టి.శాట్ ఆప్ ద్వారా టీ.వీ.లలో 47.27 శాతం ఫోన్లు,కంప్యూటర్లు,లాప్ టాప్ లలో చూసిన వారు 17.62 శాతం సమీప ఆందుబాటులో వున్న వారి డివైజ్ లలో చూసినవారు 2.94 శాతం,గ్రామపంచాయితీ,కమ్యూ నిటీ హాల్స్ లలో చూసినవారు 0.45 శాతంగా వివరాలను వీటి ఆధారంగా 68.29 శాతం విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలు చూస్తున్నారని ప్రకటించింది. వాస్తవంగా 18శాతం విద్యార్థులు మాత్రమే ఆతికష్టంమీద ఆన్లైన్ పాఠాలు చూస్తున్నారని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులు,విద్యావేత్తలు వారి సర్వేలో ప్రకటించారు. ఈ లెక్కలు మనకు పాఠాలు నేర్పక పోవటం శోచనీయం
ఏ తరగతి చదువకపోయినా కేవలం చదువడం, రాయడం వచ్చి నేరుగా పదో తరగతిలో అడ్మిషన్ పొందే అద్భుత అవకాశాన్ని ఓపెన్ స్కూల్ సొసైటీ కల్పించింది.
మూడు దశాబ్దాలుగా ఈ సార్వత్రిక విద్య ద్వారా కొత్త భవిష్యత్ నిర్మించుకుంటున్న అట్టడుగు వర్గాలు ఇది మలివిడత చదువుకు రెండో అవకాశంగా భావిస్తారు. ఇలాంటి దశలో ఈ సిఫార్సులు అమలు ఎవరి ప్రయోజనాలకు దోహదపడతాయన్నది అర్ధం కాని విషయం.ఇంటర్, ఎస్సెస్సీ బోర్డుల ద్వారా ఓపెన్‌స్కూల్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించాలనటం రాజ్యాం గం కల్పించిన రిజర్వేషన్లను అపహాస్యం చేయటంతో సమానమని భావించక తప్పదు.ప్రయివేట్ వ్యక్తులు, సెమీ గవర్నమెంట్ ఎన్.జీ.ఓ. ల భౌతిక, ఆర్ధిక సహకారం తీసుకోవాలనటం భవిష్యత్తు లో సార్వత్రిక విద్యా ఉనికికి గొడ్డలిపెట్టు.క్రమంగా ప్రభుత్వం.సార్వత్రిక విద్యా నిర్వహణ బాధ్యతలనుండి తప్పుకోవాలని. ప్రయివేట్ రం గానికి అప్పగించే కుట్రగా భావించాలి.ప్రయివేట్ ప్రమేయం వ్యాపారదృక్పథంతో సార్వత్రిక విద్య ను తమకనుకూలంగా మలుచుకోవటానికి దారితీస్తుంది. మొత్తంగా ఓపెన్ స్కూల్ విద్య కనుమరుగవడానికి ఈ సిఫార్సు లు దోహదపడనున్నాయి.1991లో ప్రీ ఎలిమెంటరీ విద్యను అందించేందుకు ఓపెన్ స్కూల్ సొసైటీని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాంలోనే అందిన ఈ విద్యాకమీషన్ చేసిన తీర్మానాలపై తీసుకునే నిర్ణయం ఎలా వుండబోతుందనేది చూడాలి.
ఉల్లాస్ పథకం లక్ష్యాలకు గండి కొట్టనున్న ఈ సిఫార్సులు
ఈ విద్యాసంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యురాండ్రను అక్షరాస్యులుగా మలిచేందుకు చొరవ తీసుకున్నది. అందుకోసం ప్రారంభించిన ఉల్లాస్ పథకంలో వయోజజన విద్య, సెర్ప్, సమగ్రశిక్షా భాగస్వామ్యమై ఈ మూడింటి సమన్వయంతో మహిళా సంఘాల సభ్యులను ఓపెన్ స్కూళ్లలో చేర్పిం
చారు. దాదాపు ఈ పథకం ద్వారా పెద్ద సంఖ్యలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు జరిగాయి. నలభై యేళ్ళు చదువుకు దూరమైన వారు ,అసలు చదువే అందని యాభయి నుండి అరవై ఐదు వయసు గల మహిళలు సైతం అడ్మిషన్లు తీసుకున్నారు.ఇలాంటి మహిళాసంఘా ల సభ్యురాండ్రు భవిష్యత్ లో రెగ్యులర్ సిలబస్ ను చదవగలేరు. రెగ్యులర్ వారితో సమానమైన సిలబస్ తో పరీక్షలు రాయగలేరు. తలెత్తుతున్న ఈ సమస్యల మధ్య ఈ సిఫార్సు లే అమలైతే ఇక పై మహిళా సంఘాల సభ్యురాండ్రు తిరిగి చదువుకునేందుకు ముందు
కు రాకపోవచ్చును.
సిఫారసులపై అనుమానాలు!
రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ పరీక్షలను రద్దుచేస్తారు సరే. మరీ జాతీయస్థాయిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ లో చది వి సర్టిఫికెట్లు పొందినవారి పరిస్థితేమిటనేది చర్చకు రాలేదు. ఆయా సర్టిఫికెట్లను అనుమతిస్తారన్న గ్యారెంటీ లేదు.ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్ పొందిన వారిలో అత్యధికులు ఏదో ఒక ఉపాధి , ఉద్యోగం చేస్తున్నవారే అనేది గమనార్హం. ప్రైవేట్, ప్రభుత్వ కొలువుల్లో ఉన్న వారు పూర్తి స్థాయి సిలబస్‌ను చదవటానికి అవకాశాలు మూసుకు పోతాయి.హయ్యర్ సెకండరీ విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 75.6 శాతం మాత్రమే వుంది. 27.7 శాతం యువత ఇంటర్మీడియట్ విద్యకు దూరంగా ఉన్నారు. అంటే డ్రాపౌట్స్ అయిన ఈ 27శాతం విద్యార్థుల పరిస్థితి భవిష్యత్ లో ప్రశ్నార్ధకం అవుతుందనే అనే విచ క్షణ కమీషన్ కు లేకపోవటం శోచనీయం ప్రాథమిక విద్య నుంచి మాధ్యమిక విద్యలోకి పరివర్తన రేటు 75.6శాతం మాత్రమే. అంటే 24.4శాతం విద్యార్థులు 9, 10 తరగతుల్లో చేరడం లేదు. ఈ అంతరాలను ఎలా పూడుస్తారనేది కష్టతరంగా మారనున్నది.. 24.4 శాతం విద్యార్థులు ఎస్సెస్సీ రెగ్యులర్ విద్యార్థులతో పోటీపడలేక.. 10వ తరగతి పూర్తి చేయకుండానే మిగిలిపోవటం ఖాయం.
ఇంటర్ లో ఉత్తీర్ణత 60 శాతం దాటలేదు. రెగ్యులర్‌గా అడ్మిషన్లు పొంది తరగతులకు హాజరయ్యే వారే ఉత్తీర్ణులు కావడంలేదు. ఈ సిఫార్సులు అమలైతే డ్రాపౌట్ విద్యార్థులు ఉత్తీర్ణులు కావటం కష్టమే! సార్వత్రిక విద్య లక్ష్యాలకు విధి విధానాలకు నిర్వహణ రీతులలో రెగ్యులర్ విధానాలకు భిన్నమైనది. ఈ ఓపెన్ స్కూల్ విధానంలో చదువు పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారున్నారు. విద్యార్హతలను మెరుగు పరచుకొని పదోన్నతులు పొందిన ఉద్యోగులు వారున్నారు. మళ్ళీ చదువుకొని భవిష్యత్ నిర్మించుకున్న ఒంటరి మహిళలున్నారు.జిల్లా కో ఆర్డినేటర్లు ,ఏ.ఐ. సెంటర్ కో ఆర్డినేటర్లు,కౌన్సిలర్లు ప్రత్యేకంగా నియమాకం కాకపోయినా యేటేటా అడ్మిషన్లు పెరుగుతున్నాయి.ఫలితాలు పురోగమనంలో వున్నాయి.
ఫీజులు పెరగటం పరీక్షల తరువాత ఫలితాల ప్రకటన,సర్టిఫికేట్ల విడుద లలో ఆలస్యం ,నిర్వహణా నిధుల మంజూరు లో జాప్యం , ఓపెన్ విద్యావకాశాల విస్తరింపు కోసం ప్రచారంలో అలసత్వం వంటి అంశాలపై కమీషన్ అభిప్రాయాలను గౌరవించాల్సిందే. సిలబస్,కర్రికులం మార్పు.రెగ్యులర్ విద్యతో సమానంగా పరీక్షలనిర్వహణ,ప్రయి వేట్ వ్యక్తులు,సంస్థల భౌతిక,ఆర్ధిక సహకారం పేరిట జోక్యం తదితరాలను బేషరతుగా వ్యతిరేకించాల్సిందే.ఈ సిఫార్సులు ఉపరితలంగా కమిషన్ సూచనలని భావించినా ఇవి ప్రజా వ్యతిరేకమైన ఎన్.ఇ.పి. 2020 ప్రపంచ బ్యాంక్ షరతులను గుర్తుకుతేక మానవు.వ్యక్తిగా ఛైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయాలు వ్యక్తం చేయటం పై ఎవరికీ అభ్యంతరాలుండక పోవచ్చును. కానీ. తెలంగాణ విద్యా కమి షన్ ఛైర్మన్ హోదాలో లిఖితపూర్వకంగా నివేదికలో పొందు పరౄచే
ముందు కమీషన్ క్షేత్రస్థాయి పరిశీలన విస్మరించిందని భావించాలి.