– కాంగ్రెస్ అభ్యర్దులను గెలిపిస్తే మరిన్ని ప్రగతి ఫలాలు
– మంత్రి పొంగులేటి
కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్ధలాలకు సంబంధించి జీవో 76ను పరిష్కరించి ప్రజలకు మేలు చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఆయన సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే ఈ ఇండ్ల స్ధలాల సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి సభలో స్పష్టమైన హామీ ఇచ్చారని, కార్మిక పక్షపాతిగా నిలిచిన తమ ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే నుంచి ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు అందరూ కాంగ్రెస్ ప్రతినిధులేనని, ఈ ప్రాంత అభివృద్ది కోసం కాంగ్రెస్, మిత్రపక్ష అభ్యర్దులను గెలిపించి అభివృద్ది ఫలాలను అందుకోవాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం పరిధిలోని 60 డివిజన్లలో 58 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల సీపీఎం అభ్యర్ధులు పోటీ చేస్తున్నారని, వీరందరినీ గెలిపించాలని మంత్రి పొంగులేటి కోరారు. కొత్తగూడెం ప్రాంతంలోని రోడ్లు, డ్రైనేజీ, వంతెనల నిర్మాణం, ఎంతోకాలంగా ఇక్కడి ప్రజలను వేధిస్తున్న మంచినీటి సమస్య తీరి 24 గంటలూ సరఫరా కావాలన్నా కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. ఇవేగాక యువతకు ఉపాధి కల్పనా కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే బాథ్యత తీసుకుంటానని ప్రకటించారు. 11న పోలింగ్ జరగనున్నందున ఈ రెండు రోజులు కార్యకర్తలు మరింత కష్టపడాలని, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని సూచించారు. కొత్తగూడెం నా సొంత గడ్డ- కాంగ్రెస్ అడ్డా అని చెబుతూ రంగుల రంగుల కండువాలు కప్పుకొని శీనన్న మాకు తెలుసు అంటూ వచ్చే వారిని నమ్మవద్దని మంత్రి పొంగులేటి కోరారు. ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, అర్హులైన పేదలకు ఇంటిస్ధలంతోపాటు ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.
11 తర్వాత మీ సంగతి తేలుస్తా : ఏదులాపురం సభలో పొంగులేటి
ఏదులాపురం: రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తామన్నా, ఫోన్లలో బెదిరింపులకు దిగినా సహించేది లేదు. 11వ తేదీ ఎన్నికలు ముగియనివ్వండి.. హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తా.. చందాలు, దందాలు చేస్తే, తింగరి వేషాలు వేస్తే ఊరుకోం.. చట్టప్రకారం మీ అందరినీ బొక్కలో వేయించడం ఖాయం అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యర్థులను హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా ఏదులాపురంలో వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థుల తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు. ఎవరైనా కారుకూతలు కూస్తే చట్టరీత్యా ఉక్కుపాదం మోపుతాం. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. మీ దందాలకు, దౌర్జన్యాలకు ప్రజలు ఈ ఎన్నికలతో ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి.. అశాంతి సృష్టించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతాం అని స్పష్టం చేశారు.
అధికారం లేని మీరు అభివృద్ధి ఎలా చేస్తారు?
రంగురంగుల కండువాలు వేసుకుని వస్తున్న నాయకులను మంత్రి సూటిగా నిలదీశారు. అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సాయం ఉండాలి. అధికారంలో ఉన్న తామే పనులు చేయగలం. ఏ అధికారం ఉందని మీరు మేలు చేస్తామంటూ ప్రజల వద్దకు వస్తున్నారు? అని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీకు పేదలకు ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేదు అని పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు, హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను అందించామని గుర్తుచేశారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని మంత్రి ప్రకటించారు.‘ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదే. ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు. మున్నేరు వరద బాధితులకు అండగా ఉన్నామని, వచ్చే వర్షాకాలం నాటికి రిటైనింగ్ వాల్ పూర్తిచేస్తామని భరోసా ఇచ్చారు. సభ అనంతరం వరంగల్ క్రాస్ నుంచి నాయుడుపేట సర్కిల్ వరకు వేలాది మందితో జరిగిన భారీ ర్యాలీలో పొంగులేటి పాల్గొన్నారు. ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




